మంగళవారం 14 జూలై 2020
Vikarabad - May 01, 2020 , 01:28:38

దండిగా ధాన్యం కొనుగోళ్లు

దండిగా ధాన్యం కొనుగోళ్లు

  • ఇప్పటివరకు 4,123 మెట్రిక్‌ టన్నుల సేకరణ
  • రూ.31.96 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • మరో రూ.2.18 కోట్ల బిల్లులు పూర్తి
  • పెండింగ్‌లో రూ.5.38 కోట్ల చెల్లింపులు
  • జిల్లావ్యాప్తంగా 206 కేంద్రాలు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. వారంరోజుల నుంచి సేకరణ ప్రక్రియ వేగం పుంజుకున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో 206 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కరోనా వైరస్‌ దృష్ట్యా రైతులకు ముందుగా టోకెన్లు ఇచ్చి, ఆ ప్రకారంగా రోజుకు 50మంది నుంచి ధాన్యాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4,123 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలోని 54 కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రేడ్‌-ఏ ధాన్యాన్ని సేకరించి, సీఎంఆర్‌ రైస్‌ కోసం ఎప్పటికప్పుడు రైస్‌మిల్స్‌కు సరఫరా చేస్తున్నారు. మరోవైపు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం వారం, పది రోజుల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఆన్‌లైన్‌ ద్వారా నగదును జమ చేస్తుంది. 

రూ.7.56 కోట్ల ధాన్యం సేకరణ...

ఇప్పటివరకు రూ.7.56 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. జిల్లాలో 1,497మంది రైతుల నుంచి 4,123 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది. ఐకేపీ 28, పీఏసీఎస్‌ 28, డీసీఎంఎస్‌ 6 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 702 రైతుల నుంచి 2,080 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ ద్వారా 598 రైతుల నుంచి 1,640 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 197మంది నుంచి 402 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది. జిల్లావ్యాప్తంగా 324 గ్రామ పంచాయతీల్లో వరి సాగవుతున్న దృష్ట్యా మొత్తం 206 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఐకేపీ 82, పీఏసీఎస్‌ 55, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 69 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు 3,770 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు సరఫరా చేయగా, మరో 352 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. మరోవైపు ప్రతీ రైతు నుంచి కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం ఏ-గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1,835, సాధారణ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1,815 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో 19వేలమంది రైతులు 12,505 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు.

వారం, పది రోజుల్లో చెల్లింపులు

  • విమల, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌  

జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి చెల్లింపులను వారం, పది రోజుల్లో పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకు రూ.7.56 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.31.96 లక్షల విలువైన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. మరో రూ.2.18 కోట్ల చెల్లింపుల బిల్లులు పూర్తికాగా, రూ.5.38 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు పూర్తయిన వెంటనే ఆలస్యం చేయకుండా ఖాతాల్లో నగదును జమ చేస్తున్నాం. ప్రభుత్వ సూచనల ప్రకారం తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నాం. అయితే ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. logo