శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Apr 24, 2020 , 02:25:00

కంటైన్‌మెంట్‌ జోన్లలో కట్టడి భేష్‌..

కంటైన్‌మెంట్‌ జోన్లలో కట్టడి భేష్‌..

  • అమలులో 144 సెక్షన్‌ 
  • ఇండ్ల వద్దకే నిత్యావసర సరుకులు
  • అనవసరంగా బయటకొస్తే కేసులే 
  • డ్రోన్‌ కెమెరాలతో పటిష్ట నిఘా
  • పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు  
  • జిల్లాకేంద్రంలో కేసులు తగ్గుముఖం

వికారాబాద్‌, పరిగి, తాండూరు, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాల్లో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదైన కాలనీల్లో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టారు. డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలను ఇండ్ల వద్దకే చేరవేస్తున్నారు. ఇందుకోసం వ్యాపారులకు ప్రత్యేకంగా పాసులను జారీ చేశారు. సరుకులు చేరవేస్తున్న వ్యక్తులు, వాహనాలపై సోడియం హైడ్రోక్లోరైడ్‌ను పిచికారీ చేస్తున్నారు.  కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో వికారాబాద్‌ పట్టణంలో కొత్త కేసులు నమోదు కావడం లేదు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూనే, అనవసరంగా బయటకు వచ్చేవారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఎస్పీ నారాయణ కంటైన్‌మెంట్‌ జోన్లలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాలతో వార్డుల్లో కౌన్సిలర్లు కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు అందజేయడంతోపాటు ప్రజలెవరూ బయటకు రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. 

సామూహిక ప్రార్థనలు రద్దు 

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున రంజాన్‌ మాసం సందర్భంగా మసీదు, ఈద్గా, దర్గాల వద్ద సామూహిక ప్రార్థనలు రద్దు చేశామని పరిగి పురపాలక సంఘం కమిషనర్‌ వీరప్ప గురువారం తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

‘సీ’ జోన్లలో అష్టదిగ్బంధం

కంటైన్‌మెంట్‌ జోన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు. 144 సెక్షన్‌ను అమల్లో ఉంది. రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసివేసి అష్టదిగ్బంధం చేశారు.  రాకపోకలను పూర్తిగా నిషేధించారు. పరిగి పట్టణంలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా వారి కాంటాక్ట్స్‌ 45మందిని గుర్తించి రక్త నమూనాలను పరీక్షలకు పంపగా అందరికీ నెగెటివ్‌ రావడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరితోపాటు మరో 188మందిని అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలో కంటైన్‌మెంట్‌ జోన్లుగా ఏర్పాటు చేసిన శాంతినగర్‌, సాయిపూర్‌, ఆదర్శతులసీనగర్‌, భవానీనగర్‌, ఇందిరమ్మకాలనీ, రాజీవ్‌కాలనీల్లో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత కొనసాగుతున్నది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు ఆరోగ్య, బ్యాంకు సదుపాయాలను కాలనీల్లోనే కల్పిస్తున్నారు.


logo