శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Apr 20, 2020 , 01:04:39

అంతటా అప్రమత్తం

అంతటా అప్రమత్తం

  • జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

తాండూరు, నమస్తే తెలంగాణ : జిల్లాలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. కేసులు పెరుగుతుండటంతో అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలోని కాలనీలను అష్టదిగ్బంధం చేశారు. నిత్యావసర సరుకులను ఇండ్లకే పంపిస్తున్నారు. మరోవైపు పేదలకు ఇబ్బందులు కలుగకుండా పలుచోట్ల దాతలు సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. తాండూరు పట్టణంలో హై అలర్ట్‌ కొనసాగుతున్నది. కంటైన్‌మెంట్‌ జోన్లుగా నిర్ణయించిన శాంతినగర్‌, సాయిపూర్‌, ఆదర్శ తులసీనగర్‌, భవానీనగర్‌, ఇందిరమ్మకాలనీ, రాజీవ్‌కాలనీలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే పోలీసులు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అపరిశుభ్రంగా మారిన రాజీవ్‌, ఇందిరమ్మ కాలనీల్లో కలెక్టర్‌ సూచనల మేరకు ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి పారిశుధ్య పనులు చేపట్టారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని, మున్సిపల్‌ వాహనంలోనే వేయాలని కమిషనర్‌ సూచించారు. లాక్‌డౌన్‌ను  పాటించాలని, బయటకు వస్తే కేసులు తప్పవని స్పష్టం చేశారు.

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగిలో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో పట్టణంలో 144సెక్షన్‌ కొనసాగుతున్నది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ‘సీ’ జోన్‌ పరిధిలో నిత్యావసర వస్తువులను ఇండ్ల వద్దకే చేరవేశారు. సంబంధిత వాహనాలకు సోడియం హైడ్రోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. సీజ్‌ చేసిన వాహనాలను సైతం శానిటైజ్‌ చేశారు. 

పెరుగుతున్న కరోనా కేసులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాకేంద్రంలో ఒకేరోజు 4 కేసులు నమోదు కావడంతో ప్రజలు అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, నగదులను కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. బూర్గుపల్లిలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శంషద్‌ బేగం పారిశుధ్య కార్మికులను సన్మానించి నగదును అందజేశారు. బీటీఎస్‌ కాలనీలో కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. గంగారం కాలనీలో కౌన్సిలర్‌ సురేశ్‌ కాలనీవాసులకు కూరగాయలు పంపిణీ చేశారు. నవాబుపేట మండల కేంద్రంలో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. మటన్‌, చికెన్‌షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు. మోమిన్‌పేట్‌ మండలంలోని వెల్చాల్‌లో రీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ధారూరు మండలంలోని కొండాపూర్‌లో శశి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సీఐ రాజశేఖర్‌, ఫౌండేషన్‌ ప్రతినిధులు సరుకులను అందజేశారు.


logo