బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Apr 20, 2020 , 01:04:06

మరో 4 పాజిటివ్‌ కేసులు

మరో 4 పాజిటివ్‌ కేసులు

  • జిల్లాకేంద్రంలో నలుగురికి నిర్ధారణ
  • ఢిల్లీ వెళ్లొచ్చిన వారి కాంటాక్ట్స్‌గా గుర్తింపు
  • పెండింగ్‌లో 134 శాంపిల్స్‌
  • జిల్లాలో 38కి చేరిన కేసులు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని రిక్షాకాలనీకి చెందిన నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వీరిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఆదివారం పాజిటివ్‌ నిర్ధారణ అయిన నలుగురిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలుండగా, ఇద్దరు వేరే వ్యక్తులు ఉన్నారు. రిక్షాకాలనీలో మూడు రోజుల్లో 311 శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీకి పంపగా, శనివారం 90 శాంపిల్స్‌కు సంబంధించి నెగెటివ్‌ రాగా, ఆదివారం వచ్చిన 87 శాంపిల్స్‌ రిపోర్ట్‌లలో 83 నెగెటివ్‌, 4 పాజిటివ్‌గా వచ్చాయి. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు 38మందికి కరోనా పాజిటివ్‌ రాగా, వీరిలో ఒక్కరు మృతిచెందారు. మరో 37మందికి గాంధీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 38 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 31 కేసులు ఉండటం గమనార్హం. తాండూరులో 4, పరిగిలో 2, మర్పల్లి మండల కేంద్రంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారందరూ ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌గా జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. 

రిక్షాకాలనీలో 19 కేసులు...

జిల్లా కేంద్రంలోని రిక్షాకాలనీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన మధుకాలనీకి చెందిన వ్యక్తి కాలనీలోని ఓ ప్రార్థన మందిరానికి వెళ్లి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని రెండు, మూడుసార్లు కలవడంతోనే వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు తేల్చారు. మధుకాలనీకి చెందిన ఒక్కరితోనే అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. సంబంధిత వ్యక్తి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన 13మందిలో 11మందికి వ్యాప్తి చెందగా, వారి నుంచి కాలనీలోని మరో 8మందికి వైరస్‌ సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన 11మందితోపాటు వారికి సహాయం చేసిన ఒకరికి, ప్రార్థన మందిరం పక్కనే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం కాలనీలోని 311 మంది రక్త నమూనాలను సేకరించి పంపించింది. వీరిలో ఇప్పటివరకు 177 రిపోర్ట్స్‌రాగా 4 పాజిటివ్‌గా నిర్ధారణకాగా, మరో 173 నెగెటివ్‌ వచ్చాయి. మిగతా 134మంది శాంపిల్స్‌ రిపోర్ట్స్‌ నేడు రానున్నాయి. జిల్లా పోలీసు యంత్రాంగం పాజిటివ్‌ వచ్చినవారి కాంటాక్ట్స్‌ను తెలుసుకునే పనిలో ఉంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నారు. అనుమానం వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇచ్చి వారి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. జిల్లాలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, వికారాబాద్‌ ఏరియా దవాఖానకి వెళ్లే గర్భిణులు, ఇతర అత్యవసరమున్న వాళ్లు జ్వరం, దగ్గు, జలుబు, గొంతులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలున్నవారు మహావీర్‌ ఆసుపత్రికి వెళ్లాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.


logo