శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Apr 20, 2020 , 01:03:14

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

  • జిల్లాలో 206 కేంద్రాలు
  • ఇప్పటికే 8 చోట్ల ప్రారంభం
  • ఐకేపీ-164, డీసీఎంఎస్‌ -28,  పీఏసీఎస్‌-14 
  • రైతులకు ముందుగానే టోకెన్లు జారీ
  • కేంద్రాల వద్ద నీరు, సబ్బు, శానిటైజర్స్‌ ఏర్పాటు
  • 70 వేల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి ఊపందుకోనున్నాయి. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 12 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాగా, మిగతా 194 కేంద్రాల్లో సోమవారం నుంచి సేకరించనున్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామస్థాయిలోనే కేంద్రాలను సిద్ధం చేశారు. వరి అధికంగా సాగైన గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు సెలవులున్నందున చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలతోపాటు కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ స్థలాలను ఇందుకు వాడుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలోని 324 పంచాయతీల్లో 19వేల మంది రైతులు 12,505 హెక్టార్లలో వరిపంటను సాగు చేయగా, 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్‌ నియంత్రణకు అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు. ఒకేరోజు రైతులందరూ కొనుగోలు కేంద్రానికి రాకుండా ఐదుగురికి మించి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు 800 క్వింటాళ్లు, 50మంది రైతుల నుంచి సేకరించేలా గ్రామాల వారీగా ఏఈవోలు ఇప్పటికే రైతులకు టోకెన్లు జారీ చేశారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే వారం, పదిరోజుల్లో నగదును జమ చేయనున్నది. 

ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో..

మొత్తం 206 కేంద్రాల్లో ఐకేపీ-164, డీసీఎంఎస్‌ -28, పీఏసీఎస్‌-14 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నారు. యాసంగికి గాను జిల్లా పౌరసరఫరాల శాఖ 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు ప్రారంభమైన కేంద్రాల్లో 18మంది రైతుల నుంచి 68 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రభుత్వం వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1835, సాధారణ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1815 మద్దతు ధరను కల్పిస్తున్నది. మరోవైపు జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాల ద్వారా 736 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేశారు. 

ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా ధాన్యాన్ని విక్రయించే రైతులెవరికీ ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాం. నేటి నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తాం. కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా ముందుగానే టోకెన్లు అందజేసి, ఆ ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని సూచించాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర అందేలా చూస్తాం. కేంద్రాల వద్ద నీటితోపాటు సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నాం.

- విమల, మేనేజర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ  logo