సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Apr 13, 2020 , 00:08:35

పెంపుడు జంతువుల నుంచి వ్యాప్తి చెందదు

పెంపుడు జంతువుల నుంచి వ్యాప్తి చెందదు

 • అనారోగ్యంగా ఉండే వాటిని దూరంగా ఉంచాలి
 • సామాజిక దూరం పాటించాల్సిందే
 • ఆహారాన్ని షేర్‌ చేయొద్దు
 • పశు సంవర్ధక శాఖ రిటైర్డ్‌ జేడీ డా.సీహెచ్‌ రమేశ్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19.. మనుషుల నుంచి మనుషులకే సోకుతుంది. గబ్బిలాలు ప్రధాన హోస్టులుగా వ్యవహరిస్తాయని జన్యుపరమైన డేటా ద్వారా తెలిసింది. కరోనా వైరస్‌ వల్ల ఒంటెల నుంచి ‘మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోం’ వ్యాధి, పిల్లుల నుంచి ‘సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోం’ మనుషులకు సోకుతుందని పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. అయితే హాంగ్‌కాంగ్‌లో ఒక పమేరియన్‌ జర్మన్‌ షెపర్డ్‌ జాతి కుక్కలు, బెల్జియంలో ఒక పిల్లి కొవిడ్‌-19 బారీన పడ్డాయి. పెంపుడు కుక్కలు, పిల్లుల్లో కరోనా వైరస్‌ కనబడినప్పటికీ కొవిడ్‌-19కు సంబంధం లేదు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాధి విస్తరిస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికన్‌ వెటర్నరీ మెడిసిన్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసినట్లు పశు సంవర్ధక శాఖ రిటైర్డ్‌ జేడీ డా.సీహెచ్‌ రమేశ్‌ తెలిపారు. అయితే కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో పెట్స్‌ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

జాగ్రత్తలివే.. 

 • పెట్స్‌ యజమానులు వాటిని హ్యాండిల్‌ చేసేటప్పుడు శుభ్రత పాటించాలి. చేతులను 10 సెకండ్ల పాటు కడుక్కోవాలి. 
 • వాటిని ముద్దు పెట్టుకోవడం, అతి సన్నిహితంగా ఉండడం, ఆహారాన్ని షేర్‌ చేయడం తగదు. 
 • వాటి పాత్రలను, బొమ్మలను, బెడ్డింగ్‌ మెటీరియల్‌ను ప్రతి రోజూ శుభ్రం చేయాలి. 
 • వైరస్‌ చర్మంపై ఉంటుంది. అందుకే షాంపుతో స్నానం చేయించాలి. 
 • ఫిజికల్‌ డిస్టన్స్‌ పాటిస్తూ వాకింగ్‌కు తీసుకెళ్లాలి. పార్కులకు వద్దు. 
 • వాకింగ్‌ పూర్తవ్వగానే పాదాలను శానిటైజర్లతో క్లీన్‌ చేయాలి. 
 • సాధ్యమైనంత వరకు ఇండోర్‌ ఆటలు ఆడేలా చూడాలి. 
 • పెట్స్‌ తిరిగే ప్రాంతాలను, వస్తువుల ఉపరితలాల్ని క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. 
 • సాధారణంగా వాడే డీవార్మింగ్‌, టీకాల కోసం వెటర్నరీ హాస్పిటల్స్‌కు వెళ్లొద్దు. ఫోన్‌ ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలి. 
 • దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడే వారు, విదేశాల నుంచి వచ్చిన వారు పెట్స్‌కు దూరంగా ఉండాలి. 
 • అనారోగ్యంగా ఉంటే వాటిని వేరుగా ఉంచాలి. 
 • దూరంగా ఉంటూనే ఆహారం, నీళ్లు అందించాలి. 

ఆదివారం.. జాగ్రత్త

 • మాంసం, చికెన్‌ దుకాణాల దగ్గర సోషల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి. 
 • అనారోగ్య జీవాల పశు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. 
 • పచ్చిపాలు, మాంసం, అంతర్గత అవయవాలను శుభ్రం చేయాలి. బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చి పాలు తాగొద్దు. 
 • మాంసం, చికెన్‌ షాపుల్లో గోడలను, టైల్స్‌ను తాకొద్దు. 
 • దుకాణాల దగ్గర వీధి కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పక్షులను దూరంగా తరిమేయాలి. 


logo