బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Apr 13, 2020 , 00:01:57

కంటైన్‌మెంట్‌ జోన్లలో.. కట్టుదిట్టం

కంటైన్‌మెంట్‌ జోన్లలో.. కట్టుదిట్టం

  • ఇండ్ల వద్దకే నిత్యావసర సరుకులు
  • అనవసరంగా బయటికి వస్తే కేసులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కంటైన్‌మెంట్‌ జోన్లను అష్టదిగ్బంధం చేశారు. ప్రజల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపించారు. వికారాబాద్‌ పట్టణంలోని పలు కాలనీల్లో ఆదివారం ఏఎస్పీ రషీద్‌ పర్యటించి లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. ఇండ్ల నుంచి అనవసరంగా బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వికారాబాద్‌ పట్టణంలోని బూర్గుపల్లిలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగం లబ్ధిదారులకు ఆసరా ఫించన్లను పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. 24వ వార్డులో కౌన్సిలర్‌ శ్రీదేవి మున్సిపల్‌ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందజేసి, అన్నదానం చేశారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు వడ్ల నందు పట్టణంలోని 25మంది పూజారులకు నిత్యావసర సరుకులను అందజేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లకు హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని అందజేశారు. 

తాండూరులో పటిష్ట నిఘా

తాండూరులో మరో కరోనా పాజిటివ్‌ కేసు ఆదివారం నమోదు కావడంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లుగా నిర్ణయించిన శాంతినగర్‌, సాయిపూర్‌, ఆదర్శ తులసీనగర్‌, భవానీనగర్‌, రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. తాండూరు నుంచి పెద్దేముల్‌ మండలం ఇందూరుకు వెళ్లిన 9మందికి అధికారులు హోంక్వారంటైన్‌ స్టాంపులు వేశారు. 27వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న కూరగాయలు, నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. 

మాస్కులు, శానిటైజర్ల  పంపిణీ

పరిగి మున్సిపాలిటీ పరిధిలో రెండు కంటైన్‌మెంట్‌ జోన్ల తో పాటు పట్టణంలో నిఘాను పెంచడంతోపాటు 144 సెక్ష న్‌ అమలు చేస్తున్నారు.  కొడంగల్‌ంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి మార్కెట్‌లో మాస్కులను పంపిణీ చేశారు. పర్సాపూర్‌లో మున్నూర్‌కాపు సంఘం ఆధ్యర్యంలో మాస్క్‌లు అందజేశారు. బొంరాస్‌పేట మండలం నాందార్‌పూర్‌లో మల్లికార్జున ఒగ్గుడోలు కళాకారుల బృందం ఆధ్వర్యంలో మాస్కు లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. రేగడిమైలారంలో కానిస్టేబుల్‌ నరేందర్‌, వసంత దంపతులు ఎస్‌ఐ వెంకటశీను సమక్షంలో వందమందికి మాస్కులు పంపిణీ చేశారు. కులకచర్ల మండలం బండవెల్కిచర్లలో పారిశుధ్య కార్మికులకు సర్పంచ్‌ శిరీష శానిటైజర్స్‌ను అందజేశారు.


logo