శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Apr 13, 2020 , 00:06:38

జిల్లాలో కరోనాతో ఒకరు మృతి

జిల్లాలో కరోనాతో  ఒకరు మృతి

  • గాంధీ ఆసుపత్రిలో చేరిన రెండు రోజులకే వృద్ధుడి మరణం
  • ఆదివారం ఒక్కరోజే 11 పాజిటివ్‌ కేసులు
  • వికారాబాద్‌లో 10మంది, తాండూరులో ఒకరు 
  • జిల్లాలో 21కి చేరిన కేసుల సంఖ్య
  • పాజిటివ్‌ కేసుల్లో రెండున్నరేండ్ల బాలుడు?
  • కేసులు పెరుగడంతో అప్రమత్తమైన అధికారులు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో చేరిన జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. పీ-3 కేసుగా నిర్ధారణ అయిన సంబంధిత వ్యక్తి వారంరోజులపాటు తీవ్ర జ్వరం ఉన్నప్పటికీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారం అతడి కుమారుడు హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో అక్కడి వైద్యులు కరోనా పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు వెళ్లాలని సూచించడంతో తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. అనంతరం రెండు రోజుల్లోనే అతడు మృతి చెందాడు. వృద్ధుడి కుమారుడికి కూడా ఆదివారం పాజిటివ్‌ అని తేలింది. ఆదివారం ఒక్కరోజే 11 కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రైమరీ కాంటాక్ట్స్‌పై ఆరా తీయడంతోపాటు హోంక్వారంటైన్‌లో, కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో ఉన్నవారిపై జిల్లా పోలీసు యంత్రాంగం పక్కా నిఘా పెట్టింది. 

అందరికీ ఢిల్లీ వెళ్లొచ్చినవారి నుంచే...

ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితోనే వ్యాప్తి చెందినట్టు ఉన్నతాధికారులు తేల్చారు. జిల్లాకేంద్రంలోనే 10మందికి పాజిటివ్‌ రాగా, తాండూరుకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మృతి చెందిన వృద్ధుడి కుమారుడితోపాటు జిల్లా కేంద్రంలో శుక్రవారం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుమారుడికి, రెండున్నరేండ్ల మనువడికి కూడా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. మరో ఏడుగురు మత ప్రచారం నిమిత్తం వచ్చిన ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. ఫిబ్రవరిలో మొత్తం 13మంది ఢిల్లీ నుంచి రాగా, లాక్‌డౌన్‌ క్రమంలో వీరు మున్సిపల్‌ పరిధిలో రిక్షా కాలనీలో ఉన్నారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఇద్దరు వీరిని కలవడంతో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. నెగెటివ్‌ వచ్చిన మిగతా ఆరుగురి రక్త నమూనాలను మరోసారి సేకరించి పంపించినట్లు అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో మహిళ కూడా శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబ సభ్యురాలిగా తేలింది. వీరందరినీ ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. అత్యధికంగా వికారాబాద్‌ పట్టణంలో 15 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, తాండూరులో 3, పరిగిలో 2, మర్పల్లి మండల కేంద్రంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. కాగా శనివారం సీసీఎంబీకి పంపిన 66 రక్త నమూనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. 

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం...

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారి సెకండ్‌ కాంటాక్ట్స్‌ ఎంతమంది ఉన్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ఇంకెవరైనా ఉన్నారా? వారిని ఎవరెవరు కలిశారు ? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇంకా సమాచారమివ్వకుండా గోప్యంగా ఉన్నవారు ఎక్కడెక్కడున్నారనే దాని పై జల్లెడ పడుతున్నారు. 

కరోనా లక్షణాలు ఇంకెవరికైనా ఉన్నాయనే వివరాలను తెలుసుకునేందుకుగాను వికారాబాద్‌ నియోజకవర్గపరిధిలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే ప్రత్యేకంగా వైద్య పరీక్షలతోపాటు చికిత్స అందించేందుకు వికారాబాద్‌లోని మహావీర్‌ ఆసుపత్రిలో వార్డులను ఏర్పాటు చేశారు.


logo