శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Apr 12, 2020 , 00:20:09

ప్రజలు సహకరించాలి

ప్రజలు సహకరించాలి

  • ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌
  • వైరస్‌ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు
  • ప్రజలెవరూ ఇల్లు దాటొద్దు
  • జిల్లాలో 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • రైతులు ఆందోళన చెందొద్దు
  • ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించినా ప్రజలు సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లో వైరస్‌ నివారణ చర్యలు, నిత్యావసరాల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ప్రభుత్వం రోజు కు రూ.600 కోట్లు నష్టపోతున్నా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అమలు చేస్తుందన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదికి పెరుగడంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసు, వైద్య, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే సామాజిక దూరం తప్ప క పాటించాలన్నారు. జిల్లాలో 9కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, వీటి లో 5వికారాబాద్‌లోనే ఉన్నట్లు మంత్రి తెలిపారు. జిల్లావ్యాప్తంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో 15వేలమంది ఉన్నారని, వారికి కావాల్సిన ఏర్పాట్లపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రికి వెళ్లే గర్భిణులు, ఇతరులు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలుంటే మహావీర్‌ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కంటికి కనపడని శత్రువుతో జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు ఇంకెవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం వారికి ఉచితంగా వైద్యమందిస్తుందన్నారు. గోప్యంగా ఉంటే వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదమన్నారు. ప్రజలు గుమిగూడకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్‌ పెంచాలని మంత్రి ఆదేశించారు. రోడ్లపై ఉమ్మడం, మాస్క్‌ లేకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. వైద్య, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ తదితర శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగి నుంచి కలెక్టర్‌ వరకు కష్టపడుతున్నారని కొనియాడారు. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని, వారి సేవలు గొప్పవని అన్నారు.

జమ అవుతున్న రూ.1500...

రేషన్‌ లబ్ధిదారులకు రూ.1500 ఆర్థిక సాయం అందుతున్నదని, ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ డబ్బుల కోసం వెంటనే బ్యాంకుల వద్దకు వెళ్లొద్దని, బ్యాంకుల వద్ద గుమికూడవద్దని సూచించారు. జిల్లాలో 2,34,983 రేషన్‌కార్డులపై 8,07,601 మంది లబ్ధిదారులకు 96,91,212 క్వింటాళ్ల బియ్యం పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో గుర్తించిన 6288మంది వలస కార్మికులకు 12 కిలోల చొప్పున 75,456 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారన్నారు. మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే సేకరిస్తామన్నారు. జిల్లాలో 211కొనుగోలు కేంద్రాల ద్వారా 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. 

రాజీవ్‌ గృహకల్పలో పర్యటన..

వికారాబాద్‌ మున్సిపాలిటీలోని రాజీవ్‌గృహకల్పలో మంత్రి సబితారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతోపాటు సామాజిక దూరం పాటించాలన్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సామాజిక దూరం ఒక్క టే కరో నా నియంత్రణకు మార్గమన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు, ఎస్పీ ఎం. నారాయణ, కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల ఉన్నారు. 


logo