శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Apr 11, 2020 , 02:26:32

మరో 4 పాజిటివ్‌ కేసులు

మరో 4 పాజిటివ్‌ కేసులు

  • వికారాబాద్‌లో ఇద్దరు, తాండూరు, పరిగిలో ఒక్కొక్కరు..
  • హరిత రిసార్ట్‌ నుంచి గాంధీ దవాఖానకు తరలింపు
  • జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు
  • 8మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే
  • అష్టదిగ్బంధంలో  9 కంటైన్‌మెంట్‌ జోన్లు 

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాలకు చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్‌ రాగా, వికారాబాద్‌ పట్టణ పరిధిలోని ఆలంపల్లికి చెందిన 65ఏండ్ల వృద్ధుడికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇతడు గత వారంరోజుల తీవ్ర జ్వరంతో గురువారం హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యుల సూచనతో గాంధీ దవాఖానకు వెళ్లాడు. పరీక్ష చేయగా పాజిటివ్‌ రావడంతో వైద్యాధికారులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించిన వైద్యులు పీ-3 (పీ-2 నుంచి వ్యాప్తి) కేసుగా గుర్తించారు. మొదటి ముగ్గురు ఇప్పటికే వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో క్వారంటైన్‌లో ఉండగా శుక్రవారం ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ముగ్గురు కూడా ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిగా గుర్తించారు. వీరికి మొదట నెగెటివ్‌ వచ్చి, తాజాగా పాజిటివ్‌ రావడంతో హరిత రిసార్ట్‌లో ఉన్నవారికి మళ్లీ పరీక్షలు చేయనున్నారు. 

జిల్లాలో 10కి చేరిన పాజిటివ్‌ కేసులు...

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఒకరు, మధు కాలనీకి చెందిన ఇద్దరు, బీటీఎస్‌ కాలనీలో ఒకరు, ఆలంపల్లిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పరిగి పట్టణంలో ఇద్దరు, తాండూరు పట్టణంలో ఇద్దరు, మర్పల్లి మండల కేంద్రంలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబ సభ్యులతోపాటు ఇప్పటికే సెకండ్‌ కాంటాక్ట్స్‌ను గుర్తించడంతో శుక్రవారం రక్త నమూనాలను సేకరించారు. నేడు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్షల నిమిత్తం పంపించనున్నారు. పాజిటివ్‌ వచ్చి న మధుకాలనీకి చెందిన వ్యక్తి గుజరాత్‌ నుంచి జిల్లాకు వచ్చిన 13మందిని కూడా కలిసినట్లు ఇచ్చిన సమాచారంతో వికారాబాద్‌లో ఉన్న 13మంది గుజరాతీల శాంపిల్స్‌ సేకరించి, పరీక్షల నిమిత్తం పంపనున్నారు. కాగా జిల్లాలో కంటైన్‌మెంట్‌ జోన్‌ ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ, మధుకాలనీ, బీటీఎస్‌ కాలనీ, ఆలంపల్లి, పరిగి హౌసింగ్‌బోర్డు కాలనీతోపాటు మరో కాలనీని, తాండూరు పట్టణంలో ఇందిరమ్మ కాలనీతోపాటు మరో కాలనీని, మర్పల్లి మండల కేంద్రాన్ని కంటైన్‌మెం ట్‌ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాలకు రాకపోకలు నిషేధించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులను ఆయా కాలనీలకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు.

సమాచారం ఇవ్వండి..

జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన వారందరినీ గుర్తించాం. వారిని ఇంకెవరైనా కలిసుంటే సమాచారమివ్వాలి. చెప్పకపోతే మీతోపాటు మీ కుటుంబానికే ప్రమాదం. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి లో నెగెటివ్‌ వచ్చిన వారి శాంపిల్స్‌ మరోసారి పరీక్షల నిమి త్తం పంపుతున్నాం. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చేవరకు ఎవరూ ఇల్లు దాటొద్దు.

- మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌ 

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

  • ఎస్పీ నారాయణ

పరిగి/కొడంగల్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రతి ఒక్క రూ బాధ్యత గా వ్యవహరించాలని ఎస్పీ నారాయ ణ సూచించారు. శుక్రవారం ఆయన పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భం గా కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నివాసముండే సాయిబాబా కాలనీకి వెళ్లే రోడ్లు పరిశీలించిన ఎస్పీ వాటికి బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తం గా 128 కేసులు నమోదు కాగా, కొందరిని కోర్టులో హాజరుపరిచామని, 990 మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo