బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Apr 05, 2020 , 00:28:16

బియ్యం పంపిణీకి గడువు లేదు..

బియ్యం పంపిణీకి గడువు లేదు..

  • ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు
  • నిత్యావసర సరుకులకు ఆర్థిక సాయం జమా
  • రేషన్‌ దుకాణాల వద్ద గుమికూడవద్దు
  • రోజుకు 50 మందికి బియ్యం పంపిణీ
  • సాంకేతిక లోపముంటే మ్యానువల్‌గా పంపిణీ చేయాలని కమిషనర్‌ ఆదేశం
  • మూడు రోజుల్లో 18,425 క్వింటాళ్ల బియ్యం పంపిణీ
  • ఈ-కుబేర్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1500 అందజేత

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం కరోనా నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన పేదల ఆకలి తీరుస్తోంది. ఈ మేరకు జిల్లాలో మూడు రోజులుగా బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని 588 రేషన్‌ దుకాణాల్లో ఆహార భద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 15 వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారని ప్రచారం జరుగడంతో ప్రజలు రేషన్‌ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పలు రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం కూడా పాటించకుండా గుమిగూడుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు 50 మందికి కూపన్లు అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి ఎలాంటి గడువు నిర్ణయించలేదని, ఈ నెలాఖరు వరకు పంపిణీ ప్రక్రియ జరుగుతుందని, అంతేకాకుండా చివరి లబ్ధిదారుడికి పంపిణీ చేసే వరకు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా జిల్లాలో పలు దుకాణాల వద్ద ఈ-పాస్‌ యంత్రాలు మొరాయించడంతో ప్రజ లు రోజంతా ఉచిత రేషన్‌ బియ్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ-పాస్‌ యంత్రాలు మొరాయించినైట్లెతే మ్యానువల్‌గా బియ్యం పంపిణీ చేయాలని, ఏ ఒక్క లబ్ధిదారుడిని కూడా రేషన్‌ దుకాణాల వద్ద ఇబ్బందులు కలిగించొద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కలెక్టర్లకు సూచించారు. దీంతో శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఈ-పాస్‌ యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తినా.. బియ్యం పంపిణీ ప్రక్రి య మాత్రం కొనసాగింది. మూడు రోజులుగా జిల్లాలో 20 శాతం మేర ఉచిత బియ్యం పంపిణీ చేశారు. మరోవైపు నిత్యావసర సరుకుల నిమిత్తం ప్రభుత్వం మరో రెండు, మూడు రోజు ల్లో ఈ-కుబేర్‌ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1500లను జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 

మూడు రోజుల్లో 18,425 క్వింటాళ్ల బియ్యం పంపిణీ

జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 18,425 క్వింటాళ్ల బియ్యా న్ని పంపిణీ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా 2,35,001 ఆహార భద్రత కార్డులుండగా 8.07లక్షల ఆహారభద్రత లబ్ధిదారులున్నా రు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున ఇప్పటివరకు 54, 656 రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. మరో 1,80,327మంది కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 9650 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించగా, ఇప్పటివరకు జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు 9వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయగా, మిగ తా బియ్యాన్ని జిల్లాలో అందుబాటులో ఉంచేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా కరోనా వ్యాప్తి  దృష్ట్యా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించే విధంగా రేషన్‌ దుకాణాల వద్ద జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒకేసారి అందరూ  రేషన్‌ దుకాణాలకు చేరుకొని గుమిగూడకుండా సీరియల్‌ నంబర్‌ ప్రకారం రోజుకు 50 మందికి చొప్పున రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే కొంద రు కూపన్లు లేకున్నా రేషన్‌ దుకాణాలకు చేరుకొని బియ్యం కోసం క్యూ లైన్లలో నిల్చుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చొనే విధంగా స్థానిక వీఆర్వోలు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ఎవరైతే మూడు నెలలుగా వరుసగా రేషన్‌ బియ్యం తీసుకోలేరో వారి వేలిముద్రలు మాత్రమే సేకరించి, మిగతా లబ్ధిదారులకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్వో, వీఆర్‌ఏ, సర్పంచ్‌, వార్డు సభ్యుల్లో ఎవరో ఒకరి వేలి ముద్రలతో రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్క రేషన్‌ దుకాణం వద్ద శానిటైజర్‌, సబ్బు, నీరు, టవాల్‌ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.  

ఈ-కుబేర్‌ ద్వారా ఆర్థిక సాయం...

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు నిర్ణయించింది. ఆర్థిక సహాయాన్ని నేరుగా పంపిణీ చేయకుండా ఈ-కుబేర్‌ ద్వారా రూ. 1500ల చొప్పున ఒక్కొ తెల్లరేషన్‌ కార్డుదారుడికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఆర్థికసాయం జమ అవుతాయ న్నారు. రెండు, మూడు రోజుల్లో ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

లబ్ధిదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేస్తాం

ఉచిత బియ్యం పంపిణీకి ఎలాంటి గడువు లేదు. లబ్ధిదారులందరూ బియ్యం తీసుకువెళ్లే వరకు పంపిణీ చేస్తాం.  ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే 12కిలోల ఉచిత బియ్యం అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడైనా ఈ-పాస్‌ యంత్రాలు మొరాయించినట్లయితే మ్యానువల్‌గా బియ్యం పంపిణీ చేయనున్నాం. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని రేషన్‌ డీలర్లకు సూచించాం.

- అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌


logo