మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Apr 03, 2020 , 01:31:56

159మంది శాంపిల్స్‌ సేకరణ

159మంది శాంపిల్స్‌ సేకరణ

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మొన్నటి వరకు అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మర్కజ్‌ మసీద్‌కు వెళ్లొచ్చిన వారు జిల్లాలో కూడా ఉన్నారని బయటపడడంతో ఒక్కసారిగా జిల్లా అంతటా టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. ఢిల్లీ వెళ్లొచ్చినప్పటికీ పలువురు అధికారులకు సమాచారమివ్వకుండా ఇంట్లోనే ఉండడంతో కరోనా సోకిందా లేదా అనే భయాందోళన జిల్లా ప్రజల్లో నెలకొంది. గత రెండురోజులుగా మర్కజ్‌ మసీదుకు వెళ్లొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్‌, ఎస్పీ వెళ్లొచ్చినవారితోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని వికారాబాద్‌ హరిత రిసార్ట్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ వచ్చిన సంఘటనలు ఉండడంతో గురువారం ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 159మంది శాంపిల్స్‌ను సేకరించారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించనున్నారు. రెండు, మూడురోజుల్లో ఫలితాలు రానున్నాయి. జిల్లా నుంచి ఢిల్లీకి 25మంది వెళ్లగా ఆరుగురు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఉండగా జిల్లాకు 19మంది తిరిగొచ్చినట్లు గుర్తించారు. వీరిలో దోమ మండలానికి చెందిన ఒకరికి తీవ్ర దగ్గు ఉండడంతో ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో 18మందిని క్వారంటైన్‌ చేశారు.

సెకండ్‌ కాంటాక్ట్స్‌ ఎందరో...

ఢిల్లీ వెళ్లొచ్చిన వారితోపాటు వారి కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారనే దానిపై జిల్లా యంత్రాంగం పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో ఉంది. ప్రార్థనల్లో పాల్గొన్న వారితోపాటు వారి కుటుంబ సభ్యులు యథేచ్ఛగా మార్కెట్లతోపాటు నిత్యవసర దుకాణాలు తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఎవరెవరితో దగ్గరగా మెలిగారనే వివరాలను సేకరిస్తున్నారు. వారిచ్చే సమాచారంతోపాటు ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సెకండ్‌ కాంటాక్ట్స్‌ను కనుక్కొనే పనిలో ఉన్నారు. సెకండ్‌ కాంటాక్ట్స్‌ సంఖ్య పెద్దమొత్తంలో ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు 141 మందికాగా, సెకండ్‌ కాంటాక్ట్స్‌ను 266మందిగా ప్రాథమికంగా గుర్తించారు. మరో రెండు, మూడురోజుల్లో సెకండ్‌ కాంటాక్ట్స్‌ సంఖ్యపై స్పష్టత రానుంది. 

ఇండ్లకే పరిమితమైన జనం... 

జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో నిన్న, మొన్నటి వరకు కాస్త బయట కనపడిన జనం గత రెండు రోజులుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు జిల్లాలో కూడా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఒకవేళ మార్కెట్లకు, నిత్యావసర సరుకులను కొనేందుకు వచ్చినప్పటికీ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటిస్తున్నారు. జిల్లాలోని 99 శాతం ప్రజానీకం గురువారం ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు అనవసరంగా బయటకు వచ్చే ఆకతాయిలపై పోలీసులు లాఠీ ఝలిపిస్తున్నారు.

సామాజిక దూరం పాటించాలి : కలెక్టర్‌ పౌసుమిబసు 

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. ఢిల్లీలోని ప్రార్థనలకు హాజరైన పరిగికి చెందిన ఇరువురు వ్యక్తులను బుధవారం రాత్రి వికారాబాద్‌లోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించగా గురువారం కలెక్టర్‌ వారి ఇండ్లను సందర్శించి, కుటుంబ సభ్యులతో మా ట్లాడారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇండ్లల్లోనే ఉంటూ వైరస్‌ వ్యాప్తి కట్టడికి సహకరించాలన్నారు.


logo