గురువారం 04 జూన్ 2020
Vikarabad - Mar 27, 2020 , 22:54:36

దాతలు సాయం చేస్తుండ్రు..

దాతలు సాయం చేస్తుండ్రు..

  • సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ముమ్మరంగా ప్రజాప్రతినిధుల విరాళాలు
  • రూ.1.11 లక్షలు అందజేసి ముడిమ్యల్‌ సొసైటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి
  • తమవంతు సాయం అందజేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

కరోనా వైరస్‌ కట్టడికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి మద్దతుగా మేమున్నామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, సామాన్య ప్రజలు సైతం తమ వంతుగా సీఎం సహాయనిధికి విరాళం అందించి ఉదార స్వభావం చాటుకుంటున్నారు. అభాగ్యులను ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. 

తెలంగాణ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు, అన్నపూర్ణ సహిత విశ్వనాథ దేవాలయ అర్చకుడు వలివేటి వీరభద్ర శర్మ - రూ. 50,116, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌ కుమార్తె పుట్ట క్యాతి తాను దాచుకున్న డబ్బులు రూ. 22 వేలు, విశ్రాంత ఉద్యోగి తన నెల జీతంలో సగం రూ.18 వేలు, మాజీ కౌన్సిలర్‌ వైఎల్‌ఎన్‌ గౌడ్‌ - రూ.10 వేలు చెక్కుల రూపంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.

చర్లపల్లి: కరోనా బాధితులను ఆదుకునేందుకు హెచ్‌సీఎల్‌ మాజీ ఉద్యోగి, శివసాయినగర్‌ కాలనీవాసి దాసరి బుచ్చిరెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించి, శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి అందజేశారు.  

రూ. 2 లక్షల విరాళం

హన్మకొండ నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాధి నివారణకు చేపట్టిన చర్యలలో భాగంగా తన వంతు సహాయంగా కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు చెక్కును అందజేశారు. 

పారిశుధ్య నిర్వహణకు రూ.50 వేలు

మహాముత్తారం : గిరిజన గ్రామాల ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఎంపీటీసీ సభ్యుడు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెం ఎంపీటీసీ సభ్యుడు లక్కిరెడ్డి నర్సింహారెడ్డి తన వంతు సాయంగా రూ.50 వేలు ఎంపీడీవో పెద్ది ఆంజనేయులుకు నగదు రూపంలో శుక్రవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాముత్తారం మండలం గిరిజన, వెనుకబడిన మండలం అని, ఇక్కడి ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్లు , డెటాల్‌ వంటి వస్తువులు అందించాలనే ఉద్దేశంతో రూ.50 వేలు విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. 

- రేగులగూడెం ఎంపీటీసీ సభ్యుడు లక్కిరెడ్డి నర్సింహారెడ్డి 

సీఎం నిధికి జీతమిచ్చారు

మంచిర్యాల రూరల్‌(హాజీపూర్‌) : చెన్నూర్‌ అటవీ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ పొన్న మల్లయ్య-స్వప్న దంపతులు ఒక నెల వేతనం రూ.60,673, స్వప్న (ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌) తన నెల వేతనం రూ.10వేలు సీఎంఆర్‌ఎఫ్‌కు ఆన్‌లైన్‌లో పంపారు. 

తల్లాడ : తాను కిడ్డీ బ్యాంకులో పొదుపు చేసిన నగదును సీఎం సహాయనిధికి విరాళంగా అందజేసి ఔదర్యాన్ని కనబర్చాడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన 7వ తరగతి బాలుడు దుగ్గిదేవర శ్రీరఘునందన్‌. 46రోజుల నుంచి కిడ్డీ బ్యాంక్‌లో పొదుపు చేసిన రూ.2300 నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశాడు.  మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా శ్రీరఘునందన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దార్‌ గంటా శ్రీలత, మండల వైద్యాధికారి నవ్యకాంత్‌, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌ పాల్గొన్నారు. 

సీఎం సహాయనిధికి పెన్షన్‌ డబ్బులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన బండి వాసు అనే దివ్యాంగుడు కరోనా వైరస్‌ బాధితుల సాయం కోసం తన పింఛన్‌ రూ. 3016ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేశాడు. తన డెబిట్‌ కార్డు నుంచి రూ. 3016 సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమచేసిన వివరాలను మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇందుకు స్పందించిన కేటీఆర్‌ అద్భుతమని రీ ట్వీట్‌ చేసినట్లు వాసు తెలిపాడు. 

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పుట్ట ముఖేశ్‌, సివిల్‌ కాంట్రాక్టర్‌ మందల మల్లారెడ్డి రూ. 50వేల విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించారు.  శుక్రవారం మంథని తహసీల్దార్‌ అనుపమరావుకు చెక్కును అందజేశారు. 

సీఎం సహాయనిధికి రూ.లక్ష విరాళం

అయిజ : అయిజ జెడ్పీటీసీ పుష్పమ్మ, ఇన్‌చార్జి ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డిలు సీఎం సహాయనిధికి రూ.లక్ష చెక్కును  పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్‌ యాదగిరికి శుక్రవారం అందజేశారు. 

 రూ.1.50 లక్షల శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల సౌదీ సంఘం ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు ఇంటింటికీ పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు తూం రవీందర్‌ శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రూ లక్ష 50 వేల రూపాయల శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. గ్రామంలోని 600 ఇండ్లకు హ్యాండ్‌ వాష్‌ స్ప్రే బాటిల్‌, 5 మాస్కులు ఇచ్చారు. ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శంకర్‌, మండల వైద్యాధికారి మసూద్‌ హైమద్‌, ఎంపీఓ సుధాకర్‌, సర్పంచ్‌ అల్లూరి మానస, ఉప సర్పంచ్‌ చంద రాజేశం, నాయకులు ఉన్నారు.

ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంటలో సర్పంచ్‌ కల్వకుంట్ల వనజ, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు పిలుపు మేరకు గ్రామస్తులు రూ.96,516 విరాళాలు అందించారు. గ్రామంలోని పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, దినసరి కూలీలు, భిక్షాటకులకు చేయుతనివ్వాలని పంచాయతీ పాలక వర్గం, గోపాల్‌రావు ఇచ్చిన పిలుపునకు స్పందించి అందజేశారు. 

మెదక్‌ : మెదక్‌లో వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు పిప్పిరి రవీందర్‌ తనవంతు సహాయంగా రూ.5వేల చెక్కును మున్సిపల్‌ చైర్మన్‌ చందపాల్‌కు అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి కోరారు.

పెగడపల్లి: కరోనా వైరస్‌ నిర్మూలనకు సీఎం సహాయనిధికి జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జాల వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వానికి రూ.50 వేల విరాళం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. సౌత్‌ ఆఫ్రికాలో స్థిరపడ్డ కరోనా వైరస్‌ కట్టడికి తన వంతు సాయంగా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకంటించారు. వేణుగోపాల్‌రెడ్డి సోదరులు పెగడపల్లి మాజీ సర్పంచ్‌ జాల తిరుపతిరెడ్డి, అశోక్‌రెడ్డి శుక్రవారం ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, తాసిల్దార్‌ రాజమనోహర్‌రెడ్డికి స్థానిక తాసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ పేరున రూ.50 వేల చెక్కును అందజేశారు.

శానిటైజేషన్‌కు వినియోగించాలని..

జగిత్యాల అర్బన్‌ : పారిశుధ్య కార్మికుల అవసరాలకు రూ.50వేల చెక్కును రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు పల్లపు మొగిలి అందజేశారు. గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సమక్షంలో మున్సిపల్‌ కమిషనర్‌కు చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శానిటైజేషన్‌ అవసరాలకు వినియోగించాలని కమిషనర్‌ను కోరారు.   

దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డులో  ప్రజలు ఇబ్బందులు పడకుండా కౌన్సిలర్‌ పాండాల అనురాధ యాదగిరి గౌడ్‌ కూరగాయల షాపును ఏర్పాటు చేశారు. దమ్మాయిగూడ 12వ వార్డు కౌన్సిలర్‌ పాండాల అనురాధ యాదగిరి గౌడ్‌ తన ఒక సంవత్సరం గౌరవ వేతనాన్ని కరోనా నియంత్రణకు ఉపయోగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ విజయలక్ష్మిని కోరారు. 

నెల వేతనం విరాళంగా..

ఘట్‌కేసర్‌: కరోనా వ్యాధి నివారణకు మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ తన నెల వేతనాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు చెక్కు రూపంలో అందజేశారు.  

బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి స్థానిక నాయకుడు పొన్నం తరుణ్‌ కరోనా వైరస్‌ నియంత్రణకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.


logo