గురువారం 02 జూలై 2020
Vikarabad - Mar 27, 2020 , 23:39:17

చేతులు జోడించి చెప్తున్నా..

చేతులు జోడించి చెప్తున్నా..

  • ఎవరూ బయటకు రావొద్దు
  • ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలి
  • జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు
  • అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • పేదల ఆకలి తీర్చేందుకు 12 కిలోలఉచిత రేషన్‌ బియ్యం
  • అంగన్‌వాడీ సరుకులు నేరుగా ఇంటికే.. 
  • రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోళ్లు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • వికారాబాద్‌ కలెక్టరేట్‌లో సమీక్ష 

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో కరోనా వైరస్‌ వ్యా ప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ చేతులు జోడించి చెబుతున్నా అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని, మీ కోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం ఇండ్లలోనే ఉండాలని  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారంటే ఎంత ప్రమాదం ఉందనేది గుర్తించాలని, మనకు మనం రక్షించుకునేందుకు మరో 20రోజులు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారితోనే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అదే విధంగా జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, ఒకవేళ పాజిటివ్‌ కేసు నమోదైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో హోం క్వారంటైన్‌లలో ఉన్న వారి పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా సరిహద్దుల్లో కూడా కర్నాటక గుండా వచ్చే వాహనాలను జిల్లాలోకి ప్రవేశించకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచులు మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో భాగస్వాములను చేయాలన్నారు. రోజువారీ కూలీల ఆకలి తీర్చేందుకు ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున ఉచిత రేషన్‌ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం రూ.1500లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయడంతో నేరుగా ఇంటింటికి వెళ్లి అంగన్‌వాడీ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  అదే విధంగా కాన్పుకు దగ్గరగా ఉన్న వారి వివరాలను, డయాలసిస్‌ రోగుల వివరాలను సేకరించి, వారికి అత్యవసర సేవలందించాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి కాలినడకన జిల్లాకు వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జిల్లాలో 6ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదన్నారు. 

రైతులు ఆందోళన చెందవద్దు...

జిల్లాలోని ఏ ఒక్క రైతు ఆందోళన చెందవద్దని, నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే రైతులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకురావాల్సిన అవసరం లేదని, గ్రామ స్థాయిలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తాండూర్‌లో ఉల్లి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనడం తమ దృష్టికి వచ్చిందని, ఉల్లి రైతులు ఇబ్బందులు పడకుండా పోలీసుల ద్వారా ప్రత్యేకంగా పాసులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

లక్షణాలు కనిపిస్తే దవాఖానలో చేరండి

  • చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి

విదేశాల నుంచి, వివిధ రాష్ర్టాల నుంచి గ్రామాలకు వచ్చే వారు జాగ్రత్త వహిస్తూ, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానలో చేరాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి సూచించారు. ఇటలీ, స్పెయిన్‌లాంటి దేశాలు నిర్లక్ష్యంతో కట్టడి చేయలేకపోయాయని, ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచిదని, అందరూ మరో 20రోజులు బయటకు రావొద్దన్నారు. ప్రభుత్వ సూచనలను పాటించడం మన అందరి బాధ్యతని, కరోనా వ్యాప్తిని అరికడితేనే విజయవంతమవుతామన్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దని, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు అప్రమత్తమయ్యే సమాచారాన్ని మాత్రమే పంపించాలని ఎంపీ రంజిత్‌ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పి. సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, కలెక్టర్‌ పౌసుమి బసు, జిల్లా ఎస్పీ ఎం. నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.


logo