బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Mar 27, 2020 , 23:00:31

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

  • కరోనాను కట్టడి చేస్తూనే..  పేదలకు సంక్షేమ కార్యక్రమాల అమలు
  • తెల్ల రేషన్‌ కార్డుదారులకు  12కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • ఖాతాలో రూ.1500 జమాకు సర్వం సిద్ధం 
  • అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 51,123 మందికి పౌష్టికాహారం
  • గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్రం ఆర్థిక ప్యాకేజీ
  • ఉపాధి వేతనం పెంపుతో 70,640 మందికి లబ్ధి
  • జిల్లాలో వృద్ధులు 58,579, వితంతువులు 78,936,  దివ్యాంగులు 27,345 మందికి రూ. 1000 అదనపు పింఛన్‌
  • రూ.2వేల చొప్పున 2,81,766 మంది రైతులకు లబ్ధి 
  • ఉజ్వల గ్యాస్‌ వినియోగదారులకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల అందజేత
  • ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసిన ఆర్బీఐ 

కరోనాపై యుద్ధం చేస్తూనే... లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేదలను బాసటగా నిలబడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఆపద కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెల్లరేషన్‌ కార్డున్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అదనంగా కార్డుదారుల ఖాతాల్లో రూ.1500లు చొప్పున జమ చేయనున్నారు. అలాగే, ఆహార ధాన్యాలు అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 33 ట్రేడర్లపై కేసులు నమోదు చేయగా, రూ.22 లక్షల విలువైన ఆహార ధాన్యాన్ని సీజ్‌ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు సూపర్‌మార్కెట్లనూ మూసి వేశారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద జిల్లాలో సుమారు 5.50 లక్షల మంది లబ్ధిపొందనున్నారు. రోజువారీ పనులు చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు అన్ని రకాల రుణాల ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐ ఆదేశాల జారీచేయడంతో రుణ చెల్లింపుదారులకు కాస్త ఊరట లభించింది.

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి,నమస్తే తెలంగాణ : తాజాగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ శుక్రవారం కీలక ప్రకటన జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించాల్సిన ప్రజలకు ఆర్బీఐ శుభవార్త అందించింది. బ్యాంకులతో పాటు అన్ని పైనాన్స్‌ సంస్థలు అన్ని రకల లోన్‌లపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించింది. రుణ చెల్లింపుదారులకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆహార ధాన్యాల ట్రెడర్లు సీజ్‌

రంగారెడ్డి జిల్లాలో ఆహార ధాన్యాలను నిల్వ చేసిన 33ట్రేడర్లపై కేసులు నమోదు చేశారు. అలాగే రూ. 22 లక్షల విలువైన ఆహార ధాన్యాన్ని సీజ్‌ చేయడం జరిగింది. రెండు సూపర్‌మార్కెట్లను కూడా సీజ్‌ చేశారు. 

కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు 

21రోజు లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదల కోసం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ లా సీతారామన్‌ పలు అంశాలను వెల్లడించారు. రానున్న మూడు నెలలకు ఒకొక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తామని ప్రకటించారు. వీటితో పాటు నేరుగా నగదు సాయం కూడా అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఉపాధి వేతనాలు రూ. 182 నుంచి రూ. 202కు పెంచుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో 18 మండలాల్లో 369గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల ద్వారా 70,640మందికి లబ్ధి చేకురనుంది. వీటన్నింటిని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాన్‌ పథకం కింద పేదలకు అందిచనున్నారు. ఆశ వర్కర్లు, శానిటేషన్‌, పారామెడికల్‌ సిబ్బందికి రూ. 50 లక్షల బీమా ప్రకటించారు. వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు రూ.1000ల అదనపు పెన్షన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ప్రభు త్వం ఇస్తున్నటువంటి పింఛన్‌కు అదనంగా ఈ ఆర్థిక సహాయం ప్రకటించారు. జిల్లాలో 1,64,860మంది ఉన్నారు. వీరిలో వృద్ధులు 58,579, వితంతువులు 78,936, వికలాంగులు 27,345 మంది ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అలాగే రైతులకు నేరుగా రెండు వేల రూపాయలను వారి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 2,81,766 మంది రైతులు జిల్లాలో ఉన్నారు. 

అంగన్‌వాడీలు మూత

కరోనా దెబ్బకు అంగన్‌వాడీలు మూత పడ్డాయి. నాలుగు రోజులుగా జిల్లాలో గర్భణులకు, బాలింతలకు, చిన్నారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కేంద్రాల వద్దకు వచ్చి 10రోజులకు సంబంధించిన సరుకులు తీసుకెల్లారు. జిల్లాలోని 27మండలాల్లో 51,123మందికి లబ్ధి చేకూరింది. గుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ సిబ్బంది గర్బణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందజేస్తున్నారు. 

రేషన్‌ బియ్యం పంపిణీ వాయిదా

రంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల క్రితం రేషన్‌ పంపిణీ ప్రారంభించారు. అయితే అనివార్య కారణాలతో మూడు రోజు లు రేషన్‌ పంపిణీ నిలిపివేశారు. సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలతో ఈ-పాస్‌ ద్వారా రేషన్‌ కార్డులపై 12కిలోల బియ్యం అందజేశారు. జిల్లాలో 5.25లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఉచితంగా బియ్యం అందజేయడంతో పాటు కుటుంబానికి రూ. 1500 లను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం గ్యాస్‌ ఖాతాల్లో ఈ నగదును జమ చేయనున్నారు. 

 ఉజ్వల గ్యాస్‌ వినియోగదారులకు ఉచితంగా వంట గ్యాస్‌ 

ఉజ్వల పథకంలో వంట గ్యాస్‌ కలెక్షన్‌ కలిగిన వినియోగదారలకు కేంద్రప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. జిల్లాలోని దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు మాత్రమే ఉజ్వల పథకంలో వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇచ్చారు. ఉజ్వల పథకంలో వంట గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వారికి వచ్చే నెల నుంచి మూడు నెలల అంటే మూడు గ్యాస్‌ రీఫిల్‌ సిలిండర్లు ఉచితంగా అందించనన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. జిల్లాలో 24,926 ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి.

పలు కాలనీల్లో మందు పిచికారి

కరోనా వైరస్‌ బారీ నుంచి బయట పడేందుకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది పలు ప్రాంతాల్లో పిచికారీ చేశారు. కొన్ని కూడళ్లలో వైరస్‌ జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లాలో రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలోని 29 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జనతా కర్ఫ్యూ మొదలు జిల్లాలో పోలీస్‌ రహదారులపై రాకపోకలను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు 

ప్రజాప్రతినిధులు సైతం రంగంలోకి దిగి కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలకు ఉపక్రమించారు. ప్రజల్లో కూడా అవగాహన రావడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. శుక్రవారం నిత్యవసరాల కోసం మాత్రమే జనం రోడ్డెక్కారు. వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై నివేదిక రూపొందిస్తోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చి వారు ఐసోలేషన్‌లో ఉన్న వారి గురించి ఆరా తీస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రజాప్రతినిధులు రెండు రోజులగా వారీ వారీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి సబితారెడ్డి కలెక్టరేట్‌లోని సమీక్ష సమావేశం ఏర్పా టు చేసి శాఖల వారీగా రివ్యూ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వారి ప్రాంతాల్లో పర్యటించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. 

నిబంధనలు అతిక్రమించి బయట దేశాల నుంచి వచ్చిన వారు బయట తిరుగుతున్న సంఘటనలపై డయల్‌ 100కు గానీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని 560 గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తుండటంతో రోడ్లన్నీ నిర్మానూష్యంగా మారాయి. అత్యవసర పనులున్న వారు మాత్రమే వాహనాలపై బయట కనిపించారు. ఇక కొన్ని విభాగాలకు కొవిడ్‌-19పేరుతో జిల్లా యం త్రాంగం పాస్‌లు జారీ చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్‌ శాఖ తదితర శాఖల వారికి పాస్‌లను అందజేశారు. కొన్ని చోట్ల రైతులకు కూడా పాస్‌లను ఇచ్చారు.

ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన వ్యక్తి పాస్‌పోర్ట్‌ స్వాధీనం

కడ్తాల్‌ : మండల పరిధిలోని బట్టర్‌ైప్లె సిటీ వెంచర్‌కు రెండు వారాల క్రితం ఫ్రాన్స్‌ దేశం నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. రెండు వారాలుగా తన స్నేహితుడితో కలిసి వెంచర్‌లోని ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ వైద్యురాలు శ్వేత, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, స్థానిక సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డిలు, శుక్రవారం వెంచర్‌లోని విల్లాకి వెళ్లి ప్రాన్స్‌ నుంచి వ్యక్తితో పాటు అతడి స్నేహితుడి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని, వారిని 20రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించిన్నట్లు అధికారులు తెలిపారు.


logo