బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Mar 26, 2020 , 23:41:42

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

  • అవసరమైతే పీడీ యాక్టులు పెడతాం
  • అందుబాటులో సరిపడా నిత్యావసరాలు
  • వ్యాపారులు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
  • అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి
  • ప్రతి ఏఈవో పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం
  • లాక్‌డౌన్‌, రేషన్‌ పంపిణీపై అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి సబితారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నిరోధానికి జిల్లాలో పాటిస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలోని 5.25 లక్షల తెల్ల రేషన్‌ కార్డుదారులకు గురువారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించిన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో కరోనా వైరస్‌పై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు, నిత్యావసరాలు, అత్యవసర సేవలు, మాస్కులు, ఉచిత బియ్యం, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్లు డాక్టర్‌ హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడికి ప్రకటించిన లాక్‌ డౌన్‌కు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రూ.1500లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో రేషన్‌ దుకాణంలో రోజుకు నలభై మందికి బియ్యం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని,  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కొన్ని మార్కెట్లలో గుర్తింపు కార్డులు లేనందున వర్కర్లు, పనులకు హాజరు కావడానికి విముఖత చూపిస్తున్నందున  వారందరికీ పోలీస్‌ శాఖ నుంచి ప్రత్యేక పాస్‌లు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిత్యావసర  సరుకుల కొరత రానియ్యమని చెప్పారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వ్యాపారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. 

క్వారంటైన్‌లో 121 మంది

జిల్లాలోని గచ్చిబౌలి క్వారంటైన్‌ కేంద్రంలో 57 మంది, రాజేంద్రనగర్‌లో 64 మంది ఉన్నారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా వారి ఇండ్లలోనే ఉండటం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. ధరలు పెంచడం, నిబంధనలు అతిక్రమించడం,  బయట దేశాల నుంచి వచ్చిన వారు బయట తిరుగుతున్న సంఘటనలపై డయల్‌ 100కు గానీ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కాలనీల్లోని క్లబ్‌హౌస్‌లను వెంటనే మూసేయాలని ఆదేశించారు. 

పశువుల దాణా కొరత రాకుండా ఏర్పాట్లు

జిల్లాలో పశువులకు దాణా కొరత రాకుండా తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ను ఆదేశించారు. జిల్లాలో ప్రతి ఏఈవో పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 

రూ. 22లక్షల విలువైన ఆహార ధాన్యాలు సీజ్‌: కలెక్టర్‌ 

ఈ సందర్భంగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఆహార ధాన్యాలను నిల్వ చేసిన 33 ట్రేడర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రూ. 22లక్షల విలువైన ఆహార ధాన్యాన్ని సీజ్‌ చేశామన్నారు. రెండు సూపర్‌మార్కెట్లను కూడా సీజ్‌ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు.

నాల్గవ రోజు ప్రజలు రోడ్డెక్కలేదు.!

కరోనా నివారణకు నాల్గవ రోజు ప్రజలు రోడ్డెక్కాలేదు. జిల్లాలోని ఐదు డివిజన్లలోని ప్రధాన రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆమలులో ఉంది. దీంతో ఉదయమే కూరగాయాలు, నిత్యావసర సరుకులు కోనుగోలు చేశారు. తప్పనిసరిగా ముసుగులు ధరించాలని కనిపించిన ప్రతిఒక్కరికీ పోలీసులు సూచించారు. ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి జిల్లాకు చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వారిని స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నారు. 

నిరుపేదలకు అండగా నిలువాలి..

గ్రామీణ ప్రాంతాల్లో రెక్కడితేగానీ డొక్కాడదు.. అలాంటి కుటంబాలను గుర్తించాలి. వాళ్లకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకురావాలి. ఇలాంటి వారి కోసం దాతలు ముందుకొస్తే ప్రభుత్వంతోపాటు మరింత మందికి ఊరట లభిస్తుంది. చేవెళ్ల మండలంలోని కమ్మెట మాజీ సర్పంచ్‌ పట్లోళ్ల హన్మంత్‌రెడ్డి తనవంతు సహాయంగా పేదలకు రూ.50 వేలు గురువారం ఆర్థిక సహాయం అందించారు 

 అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్‌ చర్యలు

  • ఎంకే రాథోడ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

కరోనా వైరస్‌ నివారణకు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో కూరగాయాలు అమ్మకం దారులు, కూరగాయాలను రైతు బజార్‌ రేట్లకు మాత్రమే విక్రయించి ధర పట్టికలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరా అధికారి ఎంకే రాథోడ్‌ తెలిపారు. అన్ని రకాల షాపుల యాజమానులు ఎంఆర్పీ ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించినట్లయితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ప్రతి రేషన్‌ కార్డు లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంన్నాం. ఎవరి కోటా వారికి వస్తుంది. వాడల వారీగా వచ్చేందుకు కూపన్లు ఇవ్వాలని, వాటిపై సమయం, తేదీ ఉంటుందని అన్నారు. 


logo