ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 25, 2020 , 23:21:06

కట్టడి చేస్తాం...

కట్టడి చేస్తాం...

  • మహమ్మారిని నిలువరించేందుకు 
  • శ్రమిస్తున్న యంత్రాంగం
  • శాఖలవారీగా సమన్వయం..
  • నేతృత్వం వహిస్తున్న కలెక్టర్లు 
  • డివిజన్లవారీగా ఆర్డీవోల సమావేశం
  • విదేశాల నుంచి వచ్చి ఉంటున్న వారి వివరాలు అందించాలి : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కరోనా కట్టడికి పలు ప్రభుత్వశాఖల అధికారులు శ్రమిస్తున్నారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెపల్లెనూ జల్లెడపడుతూ ఎవరైనా అనుమానితులు ఉంటే గుర్తించడం, వారికి కౌన్సెలింగ్‌ చేయ డం, అవసరమైతే ఐసోలేషన్‌ కేంద్రాలకు, గాంధీ దవాఖానకు తరలించడం వంటి చర్యలు చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు సమన్వయం చేసుకుని ముందడుగు వేసేలా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆదేశాలు జారీచేస్తున్నారు. 

జిల్లా వైద్యారోగ్యశాఖ... 

జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మొదలు పలు ప్రాంతాల నుంచి వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి ప్రాథమికంగా వారిని సమీక్షిస్తున్నారు. పరిస్థితిని అనుసరించి నేరుగా అనుమానితులను దవాఖానకు తరలిస్తున్నారు. గ్రామీణ జిల్లా వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్లు, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌ వేశారు. అలాగే ఆర్బీఎస్కే నుంచి 10బృందాలు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన 50బృందాలు మొత్తం 60 బృందాలకు పైగా జిల్లాలో అవగాహన కల్పిస్తూ సర్వే చేస్తున్నారు. గడిచిన రెండురోజుల క్రితం నుంచి శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో కరోనా కేసులు పాజిటివ్‌ నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరింత అలర్ట్‌ అయ్యారు. సిటీ పరిధిలో 1, అర్బన్‌ ప్రాంతంలో 3, గ్రామీణంలో 7కిలో మీటర్ల చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 1నుంచి ఆయా ప్రాంతాలకు విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు సేకరిస్తూ 14రోజుల హోం క్వారంటైన్‌ ఉండాలని హోం స్టిక్కర్‌ వేసి అబ్జర్వేషన్‌ పెడుతున్నారు.

విదేశాల నుంచి వచ్చి నివసిస్తున్న వారి వివరాలు అందించాలి : కలెక్టర్‌

విదేశాల నుంచి వచ్చి మీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి సంబంధించిన సమాచారం అందించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జిల్లా ప్రజలను కోరారు. సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌, పంచాయతీ కార్యదర్శికి వెంటనే సమాచారం అందించాలన్నారు. అన్ని వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చి మీ ప్రాంతాల్లో నివసిస్తున్న, ఏ వ్యక్తి గురించైనా సమాచారం వస్తే వెంటనే చెప్పాలన్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చి జ్వరం, దగ్గు, తలనొప్పి తదితర ఏవైనా లక్షణాలు కనిపిస్తే .. చేతిపై క్వారంటైన్‌ స్టాంప్‌ ఉన్న ఎవరైనా ఇంటి నుంచి బయట తిరుగుతుంటే ఈ సమాచారాన్ని వెంటనే స్థానిక అధికారులకు తెలియజేసి మీ క్రియాశీల సహకారం, సహాయాన్ని కోరుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

డివిజన్లవారీగా ఆర్డీవోల సమావేశం

జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్లవారీగా బుధవారం ఆర్డీ వో కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్‌ అధికారులు, ఎంపీవోలు, తహసీల్దార్లు, వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, ఎస్సై, సీఐలు,పోలీస్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లవారీగా దేశ, విదేశాల నుంచి మార్చి 1తర్వాత ఎంతమంది వచ్చారు.. వారు ఎక్కడ ఉన్నారు.. ఎంతమంది 14 రోజుల హోంక్వారంటైన్‌లో ఉన్నారు.. ఇలా మండలాలవారీగా జాబితా సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారు లు జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. విదేశాల నుంచి మండలాలవారీగా ఎంతమంది వచ్చారనే జాబితాను జిల్లా ఉన్నతాధికారులు అందించారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది కూడా వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుకున్నారు. వీరందరి నుంచి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా జాబితా చూస్తే చాంతాడంత ఉండడంతో అధికారులే నివ్వెరపోతున్నారు. ఇక నుంచి వారి బాధ్యత ‘హోం క్వారంటైన్‌' స్థానిక అధికారులదేనని స్పష్టమైన ఆదేశాలు అందాయి.

నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అధిక ధరలకు కిరణాషాపులు, కూరగాయల షాపుల యజమనులు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు. ఆయా షాపుల్లో ధరల పట్టికలను ఏర్పాటుచేసి అమ్మకాలు చేయాలని ఆర్డీవోలు, పోలీస్‌, రెవెన్యూ, ఎండీవో, ఎంపీవో, మున్సిపల్‌, వైద్యం, పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్లు, వీర్వోలు తదితర శాఖల అధికారులకు సూచించారు. అధికారు లందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యా యి. విదేశాల నుంచి వచ్చినవారి జాబితా పక్కా సిద్ధం చేసుకోవాలి. వారికి పరీక్షలు నిర్వహించి, పాస్‌పోర్ట్‌లను సీజ్‌ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించి కరోనా వైరస్‌ నివారణకు చర్యలు తీసుకోవాలి. 21రోజుల లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వాహనాలు రోడ్డెక్కుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి వాహనాలు సీజ్‌ చేయాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు అందాయి.


logo