మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Mar 25, 2020 , 23:21:05

ఇల్లే రక్ష

ఇల్లే రక్ష

  • మరో 20రోజులు స్వీయ నియంత్రణ తప్పనిసరి
  • రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి రేషన్‌ పంపిణీ

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఇల్లే శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం  మరో 20రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అత్యవసరమైతేనే వాహనాలను అనుమతిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్వ్యూను, ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు 144సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పల్లెల్లో గ్రామస్తులు ముళ్లకంపలు వేసి తమ గ్రామంలోకి బయటివారు రాకుండా చూసుకుంటున్నారు. మరోవైపు బుధవారం ఉగాది పండుగను ఇల్లు దాటకుండానే జరుపుకున్నారు. పంచాంగ శ్రవణాన్ని టీవీల్లో వీక్షించారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులను పంపిణీ చేశారు. కాగా రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రభుత్వం ఆధార్‌ కార్డు లింక్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో  రూ. 1500 జమ చేయనుంది.

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో 20 రోజులపాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని దేశ ప్రధాని  మోదీ ప్రకటించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్‌ 14 వరకు ఇండ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సూచిస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అంతటా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసింది. కర్నాటక సరిహద్దుతో పాటు జిల్లా అంతటా పెట్రోలింగ్‌ చేస్తూ ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం గ్రామాల్లో తిరుగుతూ, సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ ఒక్కొ మీటరు దూరం పాటిస్తూ క్యూలో వచ్చి కూరగాయలు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 

జిల్లాలో 144 సెక్షన్‌ అమలు

జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ సమయంలో ఎవరూ బయటకు రావొద్దని, గుమికూడవద్దని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరిస్తున్నది. కలెక్టర్‌తోపాటు ఎస్పీ జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ లాక్‌డౌన్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

కదిలిన ప్రజాప్రతినిధులు...

కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని ఊరంతా చాటింపు వేయిస్తూ, ఆటోల్లో  ప్రచారం చేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే పోలీసులకు సమాచారమివ్వాలని, మీకు సహాయం చేస్తారని, అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఒక కుటుంబం నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని పిలుపునిస్తున్నారు. 

చైతన్యంలో గ్రామాలు

పల్లెల్లో కరోనాను కట్టడి చేయాలని గ్రామ సరిహద్దులు మూసివేస్తున్నారు. మంగళవారం నాటికి 72 గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు ఎవరూ రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పొలిమేరల్లో అడ్డుకట్ట వేసి రాకపోకలను నిలిపివేస్తున్నారు. 

ఇండ్లకే పరిమితమైన జనం

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, తండాలు బుధవారం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. బయటకొస్తే పోలీసులు లాఠీ రుచి చూపిస్తుండడంతో ఎవరూ తిరగడంలేదు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. రోడ్లపై తిరిగే వారి వివరాలు తెలుసుకుని నమ్మశక్యంగా ఉంటేనే పంపడం లేదంటే సదరు వాహనాలను స్వాధీనం చేసుకోవడం చేస్తున్నరు. పట్టణాలు, గ్రామాలు, తండాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయలు, కిరాణ సామాన్లు తెచ్చుకోవాలని అధికారులు సూచించడంతో వాణిజ్య, వ్యాపార కేంద్రాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.  ఆయా పట్టణాలు, మండలాల పరిధిలో ఒక పెట్రోల్‌ బంకు మాత్రమే తెరిచి ఉండడంతో వాహనాదారులు క్యూలో ఉంటున్నారు.


logo