ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 23, 2020 , 23:42:54

అంగన్‌వాడీ సరుకులు ఇంటివద్దకే..

అంగన్‌వాడీ సరుకులు ఇంటివద్దకే..

  • ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ‘టేక్‌ హోం రేషన్‌' 
  • పది రోజుల సరుకుల కోటా పంపిణీకి శ్రీకారం 
  • రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 1380 మెయిన్‌, 220 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 
  • 1380 కేంద్రాల్లో 51,123 మందికి అందజేత 
  • వికారాబాద్‌ జిల్లాలో 1106 అంగన్‌వాడీ కేంద్రాలు
  • 23,629 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు. వైరస్‌ సంక్రమణ ప్రభావాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఆ శాఖ అధికారులు టేక్‌ హోం రేషన్‌ ద్వారా పోషకాహారం అందించేందుకు ఏర్పాట్లుచేశారు. రోజూ అందించాల్సిన వేడి భోజనానికి బదులుగా 23 నుంచి 31 వరకు, మరో రెండు రోజులు అదనంగా ప్రీ స్కూల్‌ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించాలని ఆదేశించారు. సూపర్‌ వైజడ్‌ ఫీడింగ్‌ రూపంలో ఇస్తున్న ఆహారానికి సంబంధించిన సరుకులు 10 రోజులకు సరిపడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 

అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం

మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 27 మండలాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 1380 మెయిన్‌, 220 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 6 నెలల నుంచి ఆరేండ్ల పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అనుబంధ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, రేఫరల్‌ సర్వీస్‌, ఆహార ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య సేవలందిస్తున్నారు. వీరంతా జాగ్రత్తగా ఇద్దరు, ముగ్గురు చొప్పున సెంటర్‌కు వచ్చి సరుకులు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో గర్భిణులు 13,961, బాలింతలు 12,722, 3నుంచి 6 ఏండ్ల వయస్సు గల పిల్లలు 24,440 మంది చొప్పున 51,123 మందికి అందజేయనున్నారు.        

సరుకుల పంపిణీ

జిల్లాలో స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ అధికారులు ఆ దిశగా సోమవారం నుంచి ఏర్పాట్లు చేశారు. వీరికి కావాల్సిన బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, పాలు అంగన్‌ వాడీ కేంద్రాలకు వచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లారు. 

ఇంటికే సరుకులు ఫ్రీ -స్కూల్‌ పిల్లలు, తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల ఇంటి వద్దకు వెళి ‘టేక్‌ హోం రేషన్‌' సరుకులు ఇవ్వాల్సి ఉంది. ముందుగా బియ్యం, పప్పులను సూచించిన ప్రకారం ప్రీస్కూల్‌ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సాల్డర్‌ స్కేల్‌ సహాయంతో తూకం వేసి అందజేస్తారు. నూనె కూడా ఒక గ్లాస్‌లో కొలత చేసి మార్కు పెట్టుకుని ఇవ్వాలి. సరుకుల రవాణాలో భాగంగా బయోమెట్రిక్‌ విధానంలో వేలి ముద్రలు తీసుకోనవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీంలు ప్రతి లబ్ధిదారుడికి సరుకులు అందేలా చూడాలని ఆదేశాలు జారీచేశారు. సరుకులు ఇచ్చిన తర్వాత రిజిష్టర్‌లో 3వ నంబర్‌లో ఎంత ఇచ్చింది, ఇచ్చిన తేదీని అంగన్‌వాడీ టీచర్‌ నమోదు చేసి, లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకులు అందుబాటులో లేకపోతే డీడబ్ల్యూవోలు పంపిణీ దారులతో మాట్లాడి వెంటనే అన్ని సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన చోట అడిషనల్‌ కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.

వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 23,659 మంది ఉంన్నారు. వీరిలో గర్భిణులు 4058, బాలింతలు 3257, చిన్నారులు(3నుంచి ఆరేండ్లు) 16,314 మంది ఉన్నారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ దృష్ట్యా పది రోజులకు సరిపడా అంగన్‌వాడీ సరుకులను జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈనెలలో కాన్పు అయ్యే గర్భిణుల వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసింది. కాన్పుకు సమీపంలో ఉన్న మహిళలను దవాఖానకు తరలించేందుకు తేదీల ప్రకారం అంబులెన్సులను అందుబాటులో ఉంచేలా వైద్యారోగ్య శాఖ అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు.

సరుకుల పంపిణీ ప్రారంభం: జిల్లా సంక్షేమశాఖ అధికారి 

అంగన్‌వాడీ కేంద్రాలను మూసేసిన దృష్ట్యా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తున్నామని వికారాబాద్‌ జిల్లా సంక్షేమశాఖ అధికారి జ్యోత్స్న తెలిపారు. ఏ ఒక్క లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతామన్నారు. సోమవారం నుంచే సరుకుల పంపిణీ ప్రారంభించామన్నారు. మరోవైపు ఈనెలలో కాన్పు అయ్యే వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని, వారికి అవసరమైన సేవలు అందిస్తామని తెలిపారు. 


logo