గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Mar 23, 2020 , 23:35:55

బయట తిరిగితే కేసులే..

బయట తిరిగితే కేసులే..

  • లాక్‌డౌన్‌ పాటించని పలువురిపై చర్యలు
  • పలు వాహనాలు స్వాధీనం
  • పట్టణాలు,గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్‌
  • సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీ బందోబస్తు
  • కదలని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు
  • ప్రభుత్వ సూచనతో ఇండ్లకే  జనం

కరోనా వైరస్‌ వ్యాప్తిని  ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ్ణపకటించింది.  బాధ్యతగా ప్రతిఒక్కరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.  మేరకు సోమవారం రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రైళ్లు రద్దయ్యాయి.  మద్యం దుకాణాలు, ప్రైవేటు వాహనాలు బంద్‌ అయ్యాయి. అయితే జనతా కర్ఫ్యూను వంద  పాటించిన ప్రజలు.. లాక్‌డౌన్‌ మొదటి రోజు కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగారు.  అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నా.. అత్యవసరం లేకున్నా కొందరు బయటకు వచ్చారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు పలు వాహనాలను సీజ్‌ చేశారు.  నెల 31 వరకు రాత్రి 7నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్లపైకి రావద్దని,  ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు   సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద  గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. రోజురోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశ ప్రధాని పిలుపునకు అనుగుణంగా జనతా కర్ఫ్యూను సంపూర్ణంగా పాటించిన ప్రజలు, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకుగాను సామాజిక బాధ్యతగా ఈనెల 31 వరకు ఇండ్ల నుంచి బయటకు రావద్దని లాక్‌డౌన్‌ ప్రకటించింది. జిల్లాలో కొందరు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతీ ప్రాంతంలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. అత్యవసరం ఉన్నవారు, కుటుంబంలో ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితిని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ఈనెల 31 వరకు ఇండ్లలోనే ఉండాలని జిల్లా ఉన్నతాధికారులు విన్నవిస్తున్నారు. నిర్లక్ష్యంగా తిరగడం వల్ల వారి ప్రాణాలకే కాదు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ ప్రతిఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచిస్తున్నారు. ఎవరైతే పట్టించుకోకుండా బయటకు వస్తారో సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

బయట తిరిగితే కేసులే...

లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో జిల్లా అంతటా ప్రజారవాణా వ్యవస్థతోపాటు వ్యాపార దుకాణాలు, మద్యం దుకాణాలు, ప్రైవేట్‌ వాహనాలు పూర్తిగా బందయ్యాయి. రెండో రోజు కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రైల్వే స్టేషన్‌ కూడా నిర్మానుష్యంగా మారింది. రైల్వేస్టేషన్‌ వద్దకు వెళ్లిన కొందరు ప్రయాణికులను రైల్వే పోలీసులు తిరిగి వెనక్కి పంపించారు. ఆదివారం జనతా కర్ఫ్యూను 100 శాతం పాటించిన ప్రజలు లాక్‌డౌన్‌ మొదటి రోజు మాత్రం అత్యవసరం లేకుండా బయటకు వచ్చారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు అవగాహన కల్పించడంతోపాటు పదే పదే సూచించినా వినకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు వాహనాలను సీజ్‌ చేశారు. వికారాబాద్‌ పట్టణంలో అవసరం లేకున్నా బయటకు వచ్చిన వారికి దండం పెట్టి ఈనెలాఖరు వరకు ఇండ్లలోనే ఉండాలని వికారాబాద్‌ పట్టణ సీఐ శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. అయితే ఎవరైతే మెడిసిన్‌, కూరగాయలు, పాల కోసం వచ్చే వారు మినహా మిగతా వారిని పోలీసులు సీరియస్‌గా హెచ్చరిస్తూ పలు వాహనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 86 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌ డీఎస్పీ పరిధిలో 26 వాహనాలు, పరిగి డీఎస్పీ పరిధిలో 8 వాహనాలు (6 ఆటోలు, కార్లు-2), తాండూర్‌ డీఎస్పీ పరిధిలో  52 వాహనాలను ( బైకులు-35, ఆటోలు-11, కార్లు-6) అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ సూచనల మేరకు మెజార్టీ ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ కరోనా కట్టడిలో మేము సైతం అంటూ స్ఫూర్తిగా నిలిచారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా బయటకు రావొద్దని కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లకు వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాత్రి 7 గంటల వరకు కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్‌, పెట్రోల్‌ బంకులకు అనుమతి ఉంటుందన్నారు. సొంత లేదా ప్రైవేట్‌ వాహనాలపై దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ప్రభుత్వం హెచ్చరించింది. ఎక్కడైనా ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగుడితే చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు యంత్రాంగం సూచించింది.  మరోవైపు జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 9 వరకు (మూడుగంటలు) మాత్రమే  కూరగాయలు, కిరాణ సామాన్లు తెచ్చుకోవాలని, ఆయా పట్టణాల పరిధిలో కేవలం ఒక పెట్రోల్‌ బంకు మాత్రమే తెరిచి ఉంటుందని కలెక్టర్‌ పౌసుమీ బసు ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నాటక సరిహద్దు మూసివేత..

తెలంగాణ-కర్నాటక సరిహద్దును మూసేశారు. తాండూర్‌ మండలంలోని కర్నాటక సరిహద్దు గ్రామమైన కొత్లాపూర్‌, రావులపల్లి, మైల్వార్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల్లో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కర్నాటక నుంచి ఏ ఒక్క వాహనం రాకుండా చర్యలు చేపట్టారు. నిత్యావసర వస్తువుల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. కర్నాటక నుంచి వచ్చే బస్సులు, లారీలు ఇతర వాహనాలను కూడా సరిహద్దు వద్ద పూర్తి కట్టడి చేశారు. పోలీసులతోపాటు రెవెన్యూ, వైద్య బృందాలు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ నారాయణ

ఈనెల 31 వరకు ప్రతీ ఒక్కరూ ఇండ్లలోనే ఉండాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు మినహా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని, సరిహద్దులను కూడా మూసివేశామన్నారు. నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పు, పాలు, మెడికల్‌ హాళ్లు మినహా మిగతా దుకాణ సముదాయాలను మూసివేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాల, కూరగాయల మార్కెట్ల వద్ద ప్రతీ ఒక్కరూ 3 అడుగుల దూరం పాటించాలని ఎస్పీ సూచించారు. 

తాజావార్తలు


logo