బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Mar 21, 2020 , 23:01:15

కరోనా కట్టడికి సహకరించాలి

కరోనా కట్టడికి సహకరించాలి

  • జనతా కర్ఫ్యూ ప్రతిఒక్కరూ పాటించాలి 
  • స్వీయ నియంత్రణ, సామాజిక దూరం అవలంబించాలి
  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 

కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ  జనతా కర్ఫ్యూ   పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, స్వీయ నియంత్రణ అవలంబించాలని పేర్కొన్నారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం పరిశీలించిన ఆయన..   డిపో మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.

పరిగి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కోరా రు. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. శనివారం పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు స్వీయ నియంత్రణ పద్దతుల ద్వారా కరోనాను దరి చేరనివ్వరాదని పేర్కొన్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వం సైతం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, ఇతర సంస్థలు మూసివేసిందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి సహకరించడం ద్వారా మన కుటుంబాలను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందామని ఆయన కోరారు. రాబోయే పదిహేను రోజులు అత్యంత కీలకమైనవని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు 1మీ. దూరం పాటించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే స్వయంగా తెలియజేయాలని, ఏవైనా అనారోగ్య సమస్యలుంటేనే చికిత్స చేస్తారని, లేదంటే క్వారంటైన్‌లో ఉండాలన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను ఎవరు నమ్మరాదని ఎమ్మెల్యే సూచించారు. మన కోసం, మన కుటుంబాల కోసం ఆదివారం జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. 

బస్టాండ్‌ అనునిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి 

బస్టాండ్‌ ఆవరణ అనునిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి డిపో మేనేజర్‌కు సూచించారు. శనివారం పరిగిలోని బస్టాండ్‌ ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే బస్టాండ్‌లో ఎప్పటికపుడు శుభ్రం చేయించాలన్నారు. కార్యక్రమంలో దోమ, పరిగి జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి. హరిప్రియ, ఎంపీపీ కె. అరవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, పీఏసీఎస్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌లు ఎస్‌.భాస్కర్‌, వెంకటయ్య, కౌన్సిలర్లు వేముల కిరణ్‌, వారాల రవీంద్ర, బద్రుద్దీన్‌, వెంకటేశ్‌, నాయకులు, డిపో మేనేజర్‌ బద్రి నారాయణ, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి

కులకచర్ల : కరోనా మహామ్మారిని దరి చేరకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కామునిపల్లి గ్రామ సర్పంచ్‌ పాల మహిపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కామునిపల్లిలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రత, సబ్బుతో చేతులు కడుక్కునే పద్దతిని తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క రు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. చేతులు సబ్బు లేదా డెటాల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనాను అరికట్టవచ్చునని తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని తెలిపారు. కరోన వైరస్‌ను నిర్మూలించేందుకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంకటయ్య, చంద్రయ్య పాల్గొన్నారు. 

స్వేరోస్‌ ఆధ్వర్యంలో ....

కులకచర్ల మండల పరిధిలోని వివిద గ్రామాల్లో జిల్లా స్వేరోస్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కరోనాపై అవగాహణ కల్పించారు.

నివారణే మార్గం

పరిగిటౌన్‌ : కరోనా వైరస్‌ బారీన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పట్టణంలోని బోయవాడ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అంగన్‌వాడీ టీచర్‌, ఆరోగ్య కార్యకర్త మంజుల, శిరీష విద్యార్థులకు సూచించారు. చేతులను సబ్బుతో  శుభ్రంగా కడుక్కోవాలని కళ్లు, ముక్కు దగ్గర చేతులతో నలుపరాదని తుమ్మిన, దగ్గిన చేతి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలని వారు సూచించారు. 

మిట్టకోడూర్‌లో అవగాహన 

పరిగి రూరల్‌ : మండలంలోని మిట్టకోడూర్‌లో శనివారం స్వేరోస్‌ ఇంటర్‌నేషన్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌-19 పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వేరోస్‌ బృందం ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దగ్గేటప్పుడు, తుమ్మినప్పుడు, తువాలను అడ్డం పెట్టుకోవాలని వారు గ్రామస్తులకు తెలియాజేశారు. కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌. శ్రీనివాస్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ మాణి క్యం, గ్రామ పెద్దలు అనంత్‌రెడ్డి, నర్సింహులు, సీపీఎం నాయకులు వెంకటయ్య, స్వేరో నాయకులు రాజేందర్‌, రూఫ్‌సింగ్‌, నరేశ్‌, శ్రీనివాస్‌, ఆశవర్కర్లు నర్సమ్మ, అనురాధ పాల్గొన్నారు.

కరోనాపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

పూడూరు : కరోనాపై ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని మండల తహసీల్దార్‌ దీపక్‌, ఎంపీడీవో ఉషా లు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  పూడూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు వివరిస్తు కరోనా వైరస్‌ నివారణ కోసం దృష్టి పెట్టాలని కలెక్టర్‌ వివరించారు. నేడు జనతా కర్పూపై ప్రజలకు అవగాహన కల్పించి ఇండ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి పూర్తి వివరాలు సేకరించి వారిని 15రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా వైద్యుల పరీక్షల్లో ఉంచాలని కలెక్టర్‌ సూచించినట్లు తహసీల్దార్‌, ఎంపీడీవోలు తెలిపారు. ఆది, సోమవారం రెండు రోజుల పాటు జనత కర్పూ కొనసాగేలా అధికారులు గ్రా మాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో చాటింపు చేయించాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆదేశించినట్లు వారు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి కరోనా వైరస్‌ను అరికట్టేలా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల ప్రజలు కూడా గుంపులుగా ఉండకుండా అధికారులకు సహకరించాలని కోరారు. వీరితో పాటుగా వైద్యాధికారులు ఉన్నారు.


logo