గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Mar 21, 2020 , 22:52:35

జనతా కర్ఫ్యూ @ 24 గంటలు

జనతా కర్ఫ్యూ @ 24 గంటలు

 • జిల్లాలో సోమవారం కూడా  కలెక్టర్‌ పిలుపు
 • నేడు ఆర్టీసీ బస్సులు బంద్‌
 • అందుబాటులో అత్యవసర సేవలు
 • అత్యవసరాల కోసంప్రతి డిపోలో అందుబాటులో 5 బస్సులు
 • ప్రజలంతా గంటలపాటు ఇండ్లల్లోనే ఉండండి
 • అత్యవసరమైతేనే బయటకు రండి
 • సామాజిక దూరం పాటించాలి
 • కలెక్టర్‌ పౌసుమి బసు పిలుపు
 • జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 135 మంది 
 • పాజిటివ్‌ కేసులు నమోదైతే జిల్లాలోనే చర్యలు
 • జిల్లాలో 150 పడకల ఐసోలేషన్‌ దవాఖాన  

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా  తరిమికొట్టేందుకు  రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు నేడు జనతా కర్ఫ్యూ పాటించేందుకు జిల్లా ప్రజానీకమంతా సిద్ధమైంది.  అయితే రాష్ట్రవ్యాప్తంగా 24గంటలపాటు కర్ఫ్యూ కొనసాగుతుండగా.. జిల్లాలో 48 గంటల పాటు పాటించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప సోమవారం కూడా ప్రజలెవరూ బయటకు రావద్దని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ  జిల్లా వ్యాప్తంగా  దండోరా ద్వారా విస్తృత ప్రచారం చేశారు.  కర్ఫ్యూ దృష్ట్యా నేడు ఆర్టీసీ బస్సులు, పలు  బంద్‌ కానున్నాయి. వైద్య, అగ్నిమాపక ఇతర అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ప్రతి డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలాఉండగా నేడు, రేపు జనతా కర్ఫ్యూ దృష్ట్యా భేపజలు  నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో  మార్కెట్లు, దుకాణాలు కిటకిటలాడాయి.

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహామ్మారిని తరిమికొట్టేందుకుగాను దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూ పాటించేందుకు జిల్లా ప్రజానీకమంతా సిద్ధమయ్యారు. నేడు అత్యవసర సేవలు మాత్రమే పనిచేయనునన్నట్లు, మిగతా వారంతా ఎవరికీ వారు బాధ్యతగా స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే నేడు ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే అందుబాటులో ఉండేందుకుగాను ప్రతీ డిపోలో 5 బస్సులతోపాటు డ్రైవర్లు, కండక్టర్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, అగ్నిమాపక ఇతర అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలంతా బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తూ కర్ఫ్యూలో భాగస్వాములై ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే జిల్లాలో 48 గంటలపాటు కర్ఫ్యూ నిర్వహించేందుకు కలెక్టర్‌ నిర్ణయించారు. ఆదివారంతోపాటు సోమవారం కూడా జిల్లా ప్రజలెవరూ కూడా అత్యవసరమైతే తప్పా.. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని జిల్లా ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. అయితే కర్ఫ్యూ దృష్ట్యా జిల్లా ప్రజలంతా నిత్యావసర సరుకులు, కూరగాయలు తీసుకునేందుకు ఒక్కసారిగా రావడంతో కూరగాయల మార్కెట్లు, దుకాణాలు జనాలతో నిండిపోయాయి.

జిల్లాలో 48 గంటలు.. 

కరోనా వైరస్‌ను మరింత అరికట్టేందుకుగాను జిల్లాలో 48 గంటలపాటు కర్ఫ్యూ పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో ఎస్పీ నారాయణతో కలిసి జనతా కర్ఫ్యూపై పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు జిల్లా ప్రజలంతా బాధ్యతగా తీసుకొని ఇండ్లలోనే ఉండి కర్ఫ్యూ పాటించాలన్నారు. రెండు రోజులు జిల్లాలో కర్ఫ్యూ పాటించాలని, ఎక్కడ కూడా గుంపులు, గుంపులుగా తిరుగొద్దని సూచించారు. జిల్లా అంతటా ప్రతి ప్రాంతంలో సైరన్‌ ఇచ్చి కర్ఫ్యూ ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, లేదంటే ఇండ్లలోనే ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించడంతోపాటు కర్ఫ్యూ పాటిస్తూ ఇండ్లలోనే ఉండేలా ఆయా గ్రామాల సర్పంచ్‌లు బాధ్యత తీసుకోవాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో మాస్కులు పంపిణీతోపాటు మురుగు కాల్వలను శుభ్రం చేయించామన్నారు. ఎవరూ కూడా మొహన్ని, కళ్లను తాకరాదని, జన సమూహంలోకి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని కలెక్టర్‌ సూచించారు. నేడు, రేపు పెండ్లిండ్లున్నట్లయితే వాయిదా వేసుకోవాలని, వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో వంద మందితో మాత్రమే పెళ్లి నిర్వహించాలని, అంతేకాకుండా వంద మందితోపాటు క్యాటరింగ్‌ ఇతర కార్యక్రమాలు చేసే వారి ఫోన్‌నెంబర్లతోపాటు ఇతర వివరాలు తప్పక సేకరించాలని, నిబంధనలను మించి జనాలు వచ్చినట్లయితే కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 

విదేశాల నుంచి జిల్లాకు 135 మంది...

జిల్లాకు వివిధ దేశాల నుంచి 135 మంది వచ్చినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. వీరందరిని ఇండ్లలోనే క్వారెంటైన్‌లో ఉన్నారన్నారు. హోం క్వారెంటైన్‌ కేంద్రంలో ఉన్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకుగాను జిల్లాలో వైద్య, రెవెన్యూ, పోలీసు బృందంతో కూడిన 22 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సంబంధిత టీంలు రోజుకు రెండు సార్లు హోం క్వారెంటైన్‌లో ఉన్న వారిని పరీక్షించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేస్తున్నారన్నారు. అయితే విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు మరికొంత మంది ఉన్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం క్వారెంటైన్‌లో ఉన్న వారు ఎవరైనా బయట తిరిగినట్లయితే, విదేశాల్లో పర్యటించి వచ్చి ఎలాంటి సమాచారమివ్వని వారున్నట్లయితే, ఎవరైనా శుభకార్యాలు, సమావేశాలు నిర్వహిస్తే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌-08416-256998, 256996 నెంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు. అదేవిధంగా హరిత రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ఉన్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, 53 మంది క్వారెంటైన్‌కు తీసుకురాగా వారిలో ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నట్లు, మిగతా వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో వారి ఇండ్లకు పంపించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడైనా పాజిటివ్‌ కేసులు నమోదైతే జిల్లాలోనే వైద్యం అందించేందుకుగాను 150 పడకలతో కూడిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

కిక్కిరిసిన కూరగాయల మార్కెట్లు, నిత్యావసర దుకాణాలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  కరోనా వైరస్‌ను అరికట్టేందుకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించేందుకు జనం సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వికారాబాద్‌ పట్టణంలోని పలు దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా అన్ని వ్యాపార సముదాయాలు మూతపడనున్నాయి. అదే విధంగా జనాలు ఇండ్లలో నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను పాటించనున్నారు. జనాలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు కావాల్సిన నిత్యావసర సరుకులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. ఈ మేరకు పట్టణంలోని పలు దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా కూరగాయల దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. 


logo