బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Mar 21, 2020 , 00:02:43

నియంత్రణ అందరి బాధ్యత

నియంత్రణ అందరి బాధ్యత

  • విదేశాల నుంచి ఎవరైనా వస్తే సమాచారం అందించాలి
  • వ్యాధిపై నిర్లక్ష్యం, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు 
  • మత సంఘాల సమావేశంలో ఎస్పీ నారాయణ

తాండూరు టౌన్‌: అందరి సహాకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ నారాయణ కోరారు. శుక్రవారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్‌ మత సంఘాలతో కరోనా నియంత్రణపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ మహమ్మారి కరోనా నియంత్రణపై దేశ ప్రధాని , రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించడంలో వ్యాధి తీవ్రత గురించి ఆలోచించాలన్నారు. అన్ని మతాల వారు జాతరలు, ఉత్సవాలు, పెళ్లిండ్లు, సభలు, సమావేశాలు రద్దు చేసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి ఎవరైనా తమ ప్రాంతాలకు వస్తే పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా సామాజిక మాద్యమాలతో పాటు ఇతర పద్దతుల్లో కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కావున అందరూ కరోనా నియంత్రణకు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ రసీద్‌, తాండూరు డిఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రవికుమార్‌, రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, వివిధ మత సంఘాల పెద్దలు, ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. 


logo