గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Mar 20, 2020 , 23:53:55

99 రైతు వేదికలు

99 రైతు వేదికలు

  • క్లస్టర్‌కు ఒకటి చొప్పున నిర్మాణం
  • బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించిన సర్కారు
  • ఒక్కోదానికి రూ. 12 లక్షలు
  • దాతల సహకారంతో స్థలసేకరణకు నిర్ణయం
  • ఒక్కచోటే విరాళం                 
  • మరో 10-15చోట్ల స్థలాలను గుర్తించిన అధికారులు
  • రైతు సమావేశాలు, అధునాతన మెళకువలు అందించడమే లక్ష్యం

వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో రైతన్నలకు అండగా నిలిచిన సర్కారు.. రైతువేదికల నిర్మాణం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించింది. త్వరలో నిర్మాణానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. రెండుమూడు గ్రామాలకు ఒక క్లస్టర్‌ చొప్పున జిల్లా పరిధిలో 99 వేదికలను నిర్మించనున్నారు. ఒక్కోదానికి రూ. 12 లక్షలు ఖర్చు చేయనున్నారు. దాతల నుంచి స్థలాన్ని విరాళం కోరగా జిల్లాలో ఒక్కచోటే స్థలం ఇచ్చారని, మరో 10నుంచి 15చోట్ల స్థలాలను గుర్తించామని అధికారులు తెలిపారు. రైతులకు అధునాతన సాగు విధానాలను తెలిపేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రైతువేదికలు ఉపయోగపడనున్నాయి.

పరిగి, నమస్తే తెలంగాణ: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పలు రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తద్వారా దేశం చూపంతా తెలంగాణపై పడింది. రైతులను సంఘటితం చేస్తూ వారు పండించే ధాన్యానికి మద్దతు ధర లభించేలా చూడడం, క్రాప్‌ కాలనీల ఏర్పాటు, ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం చేపట్టారు. వ్యవసాయ పద్ధతులలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు సూచనలు చేస్తూనే, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడికి సర్కారు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ రైతులందరూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా  ‘రైతు వేదిక’లు నిర్మాణం చేపట్టడానికి సంబంధించి రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయించగా ఈసారి బడ్జెట్‌లో రూ.350కోట్లు కేటాయించారు. త్వరలోనే రైతువేదికల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. 5వేల ఎకరాల భూమికి ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం చేపట్టడంతో గ్రామీణ స్థాయిలో ఏఈవోలు రైతులకు మరింత దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్నారు. వారు రైతులతో ప్రతి సీజన్‌లో తరచుగా సమావేశాలు నిర్వహించాల్సి రావడంతో ఇలాంటి రైతు వేదికల నిర్మాణం మరింత ప్రయోజనకరంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకుగాను సుమారు రూ.350కోట్లు వెచ్చించనున్నది. ఈసారి బడ్జెట్‌లో రైతు వేదికల నిర్మాణానికి నిధులు కేటాయించడంతో రాబోయే సంవత్సరానికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఒక్కో రైతు వేదికను సుమారు రూ.12లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 

క్లస్టర్‌కు ఒక ‘రైతు వేదిక’ 

జిల్లా పరిధిలో 2.24 లక్షల మంది రైతులన్నారు. 1.98లక్షల మంది రైతులకు రైతుబంధు కింద లబ్ధి చేకూరేందుకు అర్హులుగా గుర్తించడం జరిగింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు కింద 1.62లక్షల మంది రైతులకు రూ.220కోట్లు, రబీలో 1.41లక్షల మందికి రూ.200కోట్లు పెట్టుబడి సాయంగా అందించారు. ఈ పథకం కింద మొదట్లో ఎకరాకు ఒక పంటకు రూ.4వేలు, రెండు పంటలకు రూ.8వేలు అందించగా గత ఖరీఫ్‌ నుంచి ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.10వేలు అందించడం జరుగుతుంది. రైతు బీమా కింద జిల్లాలో 900 మంది నామినీల ఖాతాలలో రూ.5లక్షల చొప్పున జమ చేయబడ్డాయి. ఒక్కో రైతుకు ప్రీమియం కింద రూ.2,271.50 బీమా సంస్థకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 920 పైచిలుకు మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా 900 మందికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున బీమా డబ్బులు వారు సూచించిన నామినీల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉన్నారు. ఇందులో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ మిగతావారు తమ సేవలు అందజేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 99 మంది ఏఈవోలుండగా 99  క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. ప్రతి ఏఈవో క్లస్టర్‌లో ఒకటి చొప్పున రైతు వేదికల నిర్మాణానికి  ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్లస్టర్‌లలో రెండు నుంచి మూడు గ్రామాలు ఉంటాయి. పెద్ద గ్రామాలైతే ఒకే గ్రామం ఉంటుంది. భూమి విస్తీర్ణం ఆధారంగా ఈ క్లస్టర్‌ల ఏర్పాటు జరుగడంతో ఆయా క్లస్టర్‌లలో ఒకచోట ఈ భవనాల నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేయనున్నారు. రూ.12లక్షలు వెచ్చించి ఈ భవనాల నిర్మాణం చేపడతారు. ఇదిలావుండగా మొదటి విడుతలో రైతువేదికల నిర్మాణం పూర్తి చేసి మరోవైపు నియోజకవర్గ కేంద్రాలలో ఈ భవనాలకు అదనంగా సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణాధికారి చాంబర్‌లతోపాటు సమావేశపు మందిరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన, మండల కేంద్రాలలో మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణాధికారి చాంబర్‌లతోపాటు సమావేశం మందిరాలు, ఏఈవో క్లస్టర్‌లలో ఏఈవో చాంబర్‌, సమావేశం మందిరం నిర్మాణం చేపట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. తద్వారా పర్యవేక్షణాధికారుల కార్యాలయాలు పక్కనే ఉండడంతో మరింత అనువుగా, అధికారులు అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామాలలోనే ఈ రైతు వేదికల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకుగాను గ్రామాలలో దాతల ద్వారా స్థల సేకరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ స్థలాల్లోనే మంజూరైన నిధులతో సమావేశం మందిరాలు నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 99 రైతువేదికల నిర్మాణం చేపట్టనుండగా ప్రభుత్వం దాతల నుంచి భూమి విరాళంగా కోరగా జిల్లాలో ఒకచోటనే విరాళంగా అందజేసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు సైతం కొన్నిచోట్ల స్థలం పరిశీలించి కేటాయించినట్లుగా తెలిసింది. రైతు వేదికల నిర్మాణానికి కనీసం 500 చదరపు గజాల స్థలం అవసరమున్నది. జిల్లాలో 10 నుంచి 15 రైతువేదికలకు స్థలం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా వాటి కోసం స్థల సేకరణ చేపట్టనున్నారు. రైతువేదికల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన వెంటనే స్థలాల సేకరణ జరిపి సాధ్యమైనంత త్వరగా వాటి నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 

రైతువేదికలలో సదుపాయాలు..

క్లస్టర్ల వారీగా నిర్మాణం చేపట్టేబోయే రైతు వేదికలలో రైతులకు, వ్యవసాయ విస్తరణాధికారులకు సదుపాయాలు కల్పించనున్నారు. వివిధ పంటల సాగులో రోజురోజుకు వస్తున్న అధునాతన విధానాలను రైతులకు తెలియజేయడం, క్రాప్‌కాలనీల ఏర్పాటుతో ఆయా పంటలు సాగు చేసిన రైతులకు విడివిడిగా తరచుగా సమావేశాలు నిర్వహించడం, పంటలపై వచ్చే చీడపీడలు గుర్తించి, నివారణ చర్యలు తెలియజేయడం తదితర అంశాలకు సంబంధించి రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు ఈ రైతువేదికలు ఉపయోగకరంగా మారనున్నాయి. మరోవైపు సమావేశ మందిరాలలో మైకు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు  చేయనున్నారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులతోపాటు ఆయా గ్రామాల రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశాలు సైతం రైతువేదికలలోనే నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేస్తారు. రైతులకు ఎప్పటికప్పుడు పంటల సాగుపై సూచనలు, శిక్షణా కార్యక్రమాలకు తోడుగా రైతు అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశపు మందిరాలు ఉపయోగిస్తారు. ఇన్నాండ్లు రైతుల కోసం అమలుచేసే పథకాలపై అవగాహన కరువైంది. ఆయా గ్రామాలలోనే సమావేశపు హాల్‌ల నిర్మాణంతో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రభుత్వం అమలుచేసే రైతాంగ సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల వరకు చేరడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి. తద్వారా రాబోయే కాలంలో క్లస్టర్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. 

రైతాంగానికి చాలా ఉపయోగం..

రైతువేదికల నిర్మాణం ద్వారా రైతాంగానికి చాలా ఉపయోగం. పంటల సాగులో వస్తున్న అధునాతన విధానాలు, పంటలపై వచ్చే చీడపీడలు, నివారణ చర్యలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం, ఇతర సమావేశాలకు వేదికలుగా నిలువనున్నాయి. సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ‘రైతు వేదిక’ల నిర్మాణం చేపడుతుండడం అత్యంత ప్రయోజనకరం. తద్వారా వ్యవసాయాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి. 

- మేడిద రాజేందర్‌  (పరిగి మండల  రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌)logo