మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Mar 19, 2020 , 23:31:08

పది పరీక్షలు షురూ

పది పరీక్షలు షురూ

  • మొదటిరోజు పరీక్ష రాసిన 13,785మంది విద్యార్థులు 
  • 45మంది గైర్హాజరు
  • పలు కేంద్రాలను పరిశీలించిన డీఈవో రేణుకా దేవి
  • చేతులు కడుక్కుని పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లిన విద్యార్థులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : 10వ తరగతి పరీక్షలు జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, పార్శియన్‌, అరబిక్‌, ఉర్దూ  పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంటకు ముందుగానే చేరుకున్నారు. సమయానికి ముందుగా చేరుకొని ప్రశాంతంగా  పరీక్ష హాలులోకి వెళ్లి పరీక్షలను  రాశారు. మొదటి రోజు పరీక్షకు జిల్లాలో 13,830 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,785 మంది విద్యార్థులు హాజరయ్యారు.  కేవలం 45 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యూలర్‌ విద్యార్థులు 13762 మంది విద్యార్థులకుగాను 13,728 మందిహాజరు కాగా, 34 మంది గైర్హాజరయ్యారు. 68మంది ప్రైవేటు విద్యార్థులకు గాను 57మంది విద్యార్థులు హాజరు కాగా, 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుండగా, కరోనా నేపథ్యంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు ఐదు నిమిషాలు పొడిగించి 9:35 వరకు విద్యార్థులను అనుమతించారు. విద్యార్థులు  8 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకొని వారి వారి హాల్‌టికెట్‌ నంబర్లను  బోర్డుపై చూసుకొని ఎక్కడ రూమ్‌లో పడ్డాయో తెలుసుకున్నారు.విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి పరీక్షలకు ఆర్టీసీ బస్సులలో 10వ తరగతి హాల్‌టికెట్స్‌ చూపించి  ఉచితంగా   పరీక్ష కేంద్రాలకు వచ్చారు. మరి కొంత  మంది విద్యార్థులు వారి వారి తల్లితండ్రులు వాహనాలపై తీసుకొచ్చి పరీక్షల హాలులోకి పంపించారు. దూర ప్రాంత విద్యార్థులు డీసీఎంలలో పరీక్ష కేంద్రాలకు వచ్చారు. మొదటి రోజు పరీక్షలను ఫ్లైయింగ్‌ స్వాడ్స్‌, సిట్టింగ్‌స్వాడ్స్‌ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను జిల్లా విద్యాధికారి  రేణుకాదేవి తిరిగి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బందీగా 144 సెక్షన్‌ విధించి చుట్టు పక్కల జిరాక్స్‌ సెంటర్లను  మూసివేయించారు. ఉంచుకొని తాగునీటి వసతి, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. 

చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రాల్లోకి..

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు హ్యాండ్‌వాష్‌తో తమ చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అడుగుపెట్టారు. కేంద్రాలకు రాగానే హ్యాండ్‌ వాష్‌తో విద్యార్థులు తమ చేతులు శుభ్రం చేసుకునేలా నీటిని, లిక్విడ్‌ సోప్‌, సబ్బులు సిద్ధంగా ఉంచారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు పరీక్ష ప్రారంభమయ్యే సమయాన్ని ఐదు నిమిషాలు పొడిగించారు.  విద్యార్థుల్లో కొందరు మాస్క్‌లు, చేతి రుమాలు ధరించి వచ్చారు. కరోనాకు దూరంగా ఉండేందుకు  కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. 


logo