మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 18, 2020 , 23:48:59

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు షురూ..

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు షురూ..

  • నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు షురూ..
  • గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి
  • ఐదు నిమిషాలకు పైగా  ఆలస్యమైతే నో ఎంట్రీ 
  • పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • హాజరుకానున్న14,948 మంది విద్యార్థులు 
  • కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు 

పరిగి, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షలు నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్‌వాష్‌ను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు 5 నిముషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. గురువారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.  జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,948 మంది విద్యార్థులు  పరీక్షలకు హాజరుకానుండగా వారిలో 13,768 మంది రెగ్యులర్‌, 1,180 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులలో 6,880 మంది బాలికలు, 6888 మంది బాలురు ఉన్నారు. 159 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 8,007 మంది విద్యార్థులు, 2 ఎంపీహెచ్‌ఎస్‌కు సంబంధించి 48 మంది, 17 కేజీబీవీలకు చెందిన 762 మంది, 9 మోడల్‌ స్కూళ్లకు చెందిన 819 మంది, 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 459 మంది, 4 సాంఘిక సంక్షేమ గురకులాలకు చెందిన 333 మంది, 3 మైనార్టీ గురుకులాలకు చెందిన 156 మంది, 6 ఎయిడెడ్‌ పాఠశాలలకు చెందిన 245 మంది, ఒకటి బీసీ బాలుర గురుకులానికి చెందిన 72 మంది, 4 ఆశ్రమ పాఠశాలలకు చెందిన 234 మంది, 2 డీఎస్‌ఆర్‌ఈఐ (బాలికలు) చెందిన 142 మంది, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు చెందిన 76 మంది, 68 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 2,415 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 61 పరీక్షా కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 67 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, కస్టోడియన్‌లు ఇరువురు, రూట్‌ ఆఫీసర్లు ఆరుగురిని , ఇన్విజిలేటర్లుగా 735 మందిని నియమించారు.  

5 నిమిషాల దాటితే నో ఎంట్రీ 

పదోతరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను అనుమతించేందుకు అధికారులు నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలకు కనీసం గంట ముందు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి సంబంధించి నాలుగు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఈవో, ఎస్‌ఐలు సభ్యులుగా ఉంటారు. అలాగే సీ సెంటర్లుగా గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి రెండు సిట్టింగ్‌ స్కాడ్‌లు ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ విద్యార్థులు పట్టుబడితే సంబంధిత గదిలో ఇన్విజిలేషన్‌ విధులు నిర్వర్తించే వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.  జిరాక్స్‌, కంప్యూటర్‌ సెంటర్‌లు ఉదయం 8.30  నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి వేయనున్నారు. 

కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యలు...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా పదోతరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులను ప్రత్యేక గదులలో పరీక్ష రాయిస్తారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్‌వాష్‌, శానిటైజర్లు పరీక్ష కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు మాస్కులు ధరించి వచ్చినా అనుమతిస్తారు. ఇంటి నుంచి విద్యార్థులు తాగునీటి బాటిల్‌ తెచ్చుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారిని ఆ స్థానంలో నియమిస్తారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యసిబ్బందిని నియమించి మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతారు. పరీక్ష కేంద్రాలలో డ్యుయెల్‌ డెస్క్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు  సదుపాయాలు కల్పించడంతో పాటు పరీక్ష కేంద్రంలోని గదులలో తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

విద్యార్థులు భయపడొద్దు 

విద్యార్థులు భయపడొద్దు. కరోనా గురించి అవసరమైన జాగ్రత్తలు పాటించాలి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్‌వాష్‌లు అందుబాటులో ఉంచాం. నీరసంగా ఉండే విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 

-రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి 


logo