సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 18, 2020 , 23:47:25

షికారీ పడలేదని.. గేదెదూడను కోసుకెళ్లాడు

షికారీ పడలేదని.. గేదెదూడను కోసుకెళ్లాడు

నవాబుపేట : మాంసాహారానికి అలవాటు పడి న వ్యక్తి అడవి పందుల వేట కోసం విద్యుత్‌ షాక్‌ ఏర్పాటు చేశాడు. అయినా వేట పడలేదు. దీంతో మాంసం కోసం జివ్వుమంటున్న నాలుకకు ఏదో ఒకటి అందించాలనుకున్నాడు కాబోలు. పక్కనే పశువుల పాకలో ఉన్న బర్రె దూడను తీసుకు వెళ్ళి కోసి మాంసాన్ని తీసుకుని వెళ్ళిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. మండల పరిధిలోని చించల్‌పేటలో రైల్వేస్టేషన్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ మంగళవారం వేట కోసం ఈ ప్రాంతంలో యత్నించిన విషయాన్ని పొలాల్లో పనులు చేస్తున్న కూలీలు గమనించారు. అనుమానితుడు శ్రీనివాస్‌ రాత్రి ఇతరుల వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్‌ వైర్లను తీసుకుని అడవి పందుల కోసం కరెంట్‌ షాక్‌ను ఏర్పాటు చేశాడు. అర్ధరాత్రి వెళ్లి చూడగా ఎలాంటి యాట పడకపోవడంతో పక్కనే రైతు మైపాల్‌రెడ్డి పశువుల పాక ఉంది. అందులో ఉన్న దాదాపు 8 నెలల వయసు ఉన్న బర్రె దూడ కనిపించింది. ఈ నేపథ్యంలో బర్రె దూడను శ్రీనివాస్‌ మూసీ నదిలోకి తీసుకు వచ్చి దానిని నాలుగు కాళ్ళు కట్టేసి దాని నుంచి మాంసాన్ని తీసుకువెళ్ళాడు. ఉదయం పశువుల పాక వద్దకు వచ్చిన రైతు మైపాల్‌రెడ్డికి దూడ కనిపించలేదు. దీంతో పరిసరాల్లో పరిశీలించగా మూసీ నదిలో దూడ మరణించి ఉన్న దృశ్యం కనిపించింది. దీనిని పరిశీలించి చూడగా కత్తితో దూడను శ్రీనివాస్‌ కోసి మాంసం తీసుకు వెళ్ళినట్లుగా ఉంది. దీంతో ఆందోళనకు గురైన రైతు రకరకాలుగా ఆలోచించారు. ఈ నేపథ్యంలో అనుమానం మొదలైయింది. ఈ తరుణంలో  మంగళవారం యాట కోసం యత్నించిన వ్యక్తి ఆయన గుర్తుకు వచ్చాడు. ఆ వ్యక్తి  ఈ చర్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వచ్చి రైతు మైపాల్‌రెడ్డి విషయాన్ని బుధవారం పోలీసులకు తెలిపారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.logo