శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 18, 2020 , 23:47:24

దాహం తీర్చే సాసర్లు

దాహం తీర్చే సాసర్లు

  • వణ్యప్రాణుల దాహార్తికి అటవీశాఖ చర్యలు
  • జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 119 సాసర్‌ పిట్‌ల ఏర్పాటు
  • ట్యాంకర్లతో నీటిని నింపనున్న సిబ్బంది
  • చెక్‌డ్యాంలు, ఇరిగేషన్‌ ట్యాంకుల వద్ద కూడా నీటి వసతి
  • అనంతగిరితోపాటు ధారూరు అటవీ ప్రాంతాల్లో అందుబాటులో  సోలార్‌ బోర్లు
  • మరోవైపు దామగుండం ఫారెస్ట్‌లో యధేచ్ఛగా సాగుతున్న  వేట

వేసవి ప్రారంభం కావడంతో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వికారాబాద్‌తోపాటు జిల్లాలోని అన్ని రేంజ్‌లలో 119 సాసర్‌ పిట్‌లను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా సాసర్లలో నీటిని నింపుతున్నారు. పలుచోట్ల బోర్ల నుంచి కూడా సాసర్లకు నీటిని అందిస్తున్నారు. వీటితోపాటు ఇరిగేషన్‌ ట్యాంకులు, చెక్‌డ్యాంల వద్ద కూడా వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరితోపాటు ధారూరు అటవీ ప్రాంతంలో సోలార్‌ బోర్ల ద్వారా జంతువుల దాహార్తిని తీర్చుతున్నారు. మరోవైపు దామగుండం అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల వేట యధేచ్ఛగా సాగుతున్నది. వారాంతపు రోజుల్లో అడవి తుపాకీ చప్పుళ్లతో మారుమోగుతున్నదని స్థానిక గ్రామాల ప్రజలు అంటున్నారు. పలు ఫాంహౌజ్‌లకు చెందినవారు జింకలను వేటాడి, విందులు చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు అనేకచోట్ల రోడ్డు ప్రమాదాల్లోనూ మూగజీవులు చనిపోతున్నాయి.  

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వేసవి కాలం ప్రారంభమైన దృష్ట్యా వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రోజురోజుకు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వణ్యప్రాణులకు ప్రాణాపాయం లేకుండా జిల్లాలోని వికారాబాద్‌తోపాటు మిగతా అన్ని రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తగు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 119 సాసర్‌ పిట్‌లను ఏర్పాటు చేశారు. ఎండలు మండతున్న దృష్ట్యా అనంతగిరితోపాటు మిగతా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు విలవిలలాడకుండా సాసర్‌ పిట్‌ల ఏర్పాటు చేసి నీటిని నింపి వణ్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. అయితే గతంలో వణ్యప్రాణులు దాహం తీర్చుకునేందుకుగాను పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలోకి దిగి మృతిచెందిన సంఘటనతోపాటు అదే మండలంలోని దామగుండం కోనేరులో పడి జింకలు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరుగకుండా జిల్లా అటవీ శాఖ అధికారులు జిల్లాలోని అటవీ ప్రాంతంలో సాసర్‌ పిట్‌ల ఏర్పాటు చేయడంతోపాటు వాటిలో ఎప్పటికప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా 119 సాసర్‌ పిట్‌లను ఏర్పాటు చేయగా వికారాబాద్‌ రేంజ్‌ పరిధిలోని అనంతగిరి, దామగుండం, కండ్లపల్లి, జైదుపల్లి, గట్టుకొండాపూర్‌, మోత్కుపల్లి, ఎక్‌మామిడిలోని అటవీ ప్రాంతాల్లో 31 సాసర్‌పిట్‌ల ఏర్పాటు చేశారు. వణ్యప్రాణులకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నెలకు 4 ట్యాంకర్ల చొప్పున నీటిని సాసర్‌ పిట్‌లలో నింపుతున్నారు. అంతేకాకుండా పలు అటవీ ప్రాంతంలో ఉన్న బోర్లతోపాటు 7 సోలార్‌ బోర్స్‌ ద్వారా కూడా సాసర్‌ పిట్‌లకు నీరందిస్తూ వణ్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు సాసర్‌పిట్‌లతోపాటు ఇరిగేషన్‌ ట్యాంకులు, చెక్‌డ్యాంలు, సహజ నీటి లభ్యత కేంద్రాలను కూడా బోర్లు, వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. మరోవైపు జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో 35-40 జింకలుండగా, దామగుండం అటవీ ప్రాంతంలో 100కుపైగా జింకలున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఆగని వణ్యప్రాణుల వేట, రోడ్డు ప్రమాదాలు...

మరోవైపు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఓ వైపు వేటగాళ్ల రూపంలో మూగజీవుల ప్రాణాలు తీస్తుండగా, మరోవైపు రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలోని దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో వేటగాళ్లు తమ సరదా కోసం వన్యప్రాణులను బలి తీసుకుంటున్నారు. జిల్లాలోని పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నారు. వీకెండ్‌ వస్తే చాలు తమ సరదాల కోసం జింకలను వేటాడుతూ ప్రాణాలను తీస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతానికి సమీపంలో భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకున్న కొందరు వారంతపు సెలవుల్లో రాత్రి సమయాల్లో జింకలను వేటాడుతూ దామగుండం ఫారెస్ట్‌లోనే గడుపుతున్నట్లు తెలిసింది. రానురాను కనుమరుగవుతున్న వన్యప్రాణులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వేటగాళ్లు మాత్రం వన్యప్రాణులను లేకుండా చేస్తున్నారు. వీకెండ్‌ వస్తే చాలు దామగుండం ఫారెస్ట్‌ అంతా రాత్రి సమయాల్లో తుఫాకీ చప్పుళ్లతో మారుమ్రోగుతుందంటన్నారు సమీప గ్రామాల ప్రజలు. అంతేకాకుండా వేటాడిన జింకలను తీసుకువచ్చి వాటి మాంసంతో ఫాంహౌస్‌లలో పార్టీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. జింకలను వేటాడడమే పెద్ద నేరమని తెలిసినా,..వాటిని వేటాడడంతోపాటు వాటి మాంసాన్ని భుజించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దామగుండం ఫారెస్ట్‌లో జింకల వేటాడుతున్నట్లు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఉండడంతో వేటగాళ్లను పట్టుకునే పనిలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకుగాను సంబంధిత అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి రాత్రి సమయంలో అటవీ శాఖ అధికారులతోపాటు సిబ్బంది అంతా వేటగాళ్లను పసిగట్టేందుకుగాను చర్యలు చేపట్టారు. అయితే గతంలోనూ దామగుండం ఫారెస్ట్‌లో జింకలను వేటాడుతు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి.  ఏదేమైనా వన్యప్రాణులను కాపాడేందుకుగాను జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

దాహార్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు

జిల్లాలోని అటవీ ప్రాంతంలోని వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్‌ తెలిపారు. అనంతగిరితోపాటు మిగతా అన్ని అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు సాసర్‌ పిట్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. వణ్యప్రాణుల తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మరోవైపు వణ్యప్రాణుల వేటకు సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టామని, నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని డీఎఫ్‌వో హెచ్చరించారు. 

- డీఎఫ్‌వో వేణుమాధవ్‌


logo