ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 16, 2020 , 23:58:20

హరిత రిసార్ట్స్‌కు 30 మంది

హరిత రిసార్ట్స్‌కు 30 మంది

వివిధ దేశాల నుంచి వచ్చిన 30 మందిని హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడి ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరిని వేర్వేరు గదుల్లో 14రోజులపాటు ఉంచనున్నారు. వచ్చినవారిలో గ్రీస్‌ నుంచి ఇద్దరు, ఫ్రాన్స్‌ నుంచి 17మంది, జర్మనీ నుంచి ఆరుగురు, చైనా నుంచి నలుగురు, మెక్సికో నుంచి ఒకరు ఉన్నారు. మన రాష్ర్టానికి చెందినవారే. ళ్రుక్టర్‌ పౌసుమి బసు సోమవారం క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉండగా, కరోనా అనుమానితుల కోసం వికారాబాద్‌ టీబీ దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బెడ్లు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు.

  • విదేశాల వచ్చిన ప్రయాణికుల తరలింపు
  • 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో..
  • రిసార్ట్స్‌ను సందర్శించిన కలెక్టర్‌ పౌసుమి బసు
  • టీబీ శానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాపించకుండా చేయడంలో భాగంగా ప్రభుత్వం వికారాబాద్‌ అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి మొత్తం 30 మంది ప్రయాణికులను అధికారులు తరలించారు. ఆదివారం రాత్రి 22 మంది ఆయా దేశాల నుంచి వచ్చిన మన రాష్ట్ర ప్రయాణికులను ఇక్కడి తీసుకొచ్చి వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం మరో 8 మందిని ఓ  బస్సులో ఇక్కడి తరలించి గదుల్లో ఉంచారు. వీరిలో గ్రీస్‌ నుంచి 2, ఫ్రాన్స్‌ నుంచి 17, జర్మనీ నుంచి 6, చైనా నుంచి 4, మెక్సికో నుంచి ఒకరు ఇలా మొత్తం 30 మందిని అధికారులు ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచారు. అందరికి తల ఒక్క రూమ్‌ ఇచ్చిన అధికారులు ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు ఉండడంతో వారిని ప్రత్యేకంగా ఒక రూంలో ఉంచారు. ఇదిలా ఉంటే అందులో ఓ వ్యక్తి ఎన్ని రోజులు ఉంచిన పర్వాలేదు నాకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని అధికారులను కోరినట్లు తెలిసింది.  హరిత రిసార్ట్స్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎవరిని కలువనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం క్వారంటైన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పౌసుమి బసు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళను అక్కడికి తరలించడంతో ఆ మహిళ అన్నయ్య రిసార్ట్స్‌కు చేరుకుని మా చెల్లిని చూపించాలని, లేదా మాట్లాడించాలని అధికారులను కోరాడు. మా తండ్రికి హర్ట్‌ ప్రాబ్లమ్‌ ఉందని, తను ఏ విధంగా ఉందో చూస్తామని కోరినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. వారిని 14 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణకు వచ్చిన తరువాతే పంపిస్తామని అధికారులు తెల్చి చెప్పారు. 

టీబీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

టీబీ ఆసుపత్రిలోని వార్డుల్లో వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని ముందుగా వికారాబాద్‌ తరలించే ఆలోచన ఉన్న అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిత రిసార్ట్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు టీబీ ఆసుపత్రిలోని వార్డుల్లో కొత్తగా బెడ్లు వేసి వైద్యానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. 


logo