శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Mar 16, 2020 , 23:39:02

సొంతింటి కల సాకారం దిశగా..

సొంతింటి కల సాకారం దిశగా..

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకుప్రభుత్వం కృషి చేస్తున్నది. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతుండగా.. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పేదల కోసం పట్టణాల్లో రూ.5.30లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04లక్షల ఖర్చుతో జీప్లస్‌ 2 పద్ధతిలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నది. అలాగే మౌలిక సదుపాయాల కోసం పట్టణాల్లో రూ.1.25లక్షలు, రూరల్‌ ఏరియాల్లో రూ.75వేలు ఖర్చు చేస్తున్నది. ఈ క్రమంలో జిల్లాకు 4323 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా.. కులకచర్ల మండలాల్లో 1086 ఇండ్ల నిర్మాణం కొనసాగుతుంది. 2714 ఇండ్ల జిల్లా అధికారులు టెండర్లు ఆహ్వానించగా.. కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తయింది. పనులు నెల రోజుల్లో 450 ఇండ్ల నిర్మాణం పూర్తి కానుంది.

  • స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌రూం ఇంటికి సాయం
  • ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు..
  • జిల్లాకు 4323 ‘డబుల్‌' ఇండ్లు
  • 2714 ఇండ్ల టెండర్ల ఆహ్వానం
  • 856 ఇండ్లకు టెండర్లు పూర్తి
  • ఇప్పటివరకు 1086 ఇండ్ల నిర్మాణం ప్రారంభం
  • తుది దశకు చేరిన 450 నిర్మాణాలు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గూడులేని ప్రతి ఒక్క పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చే దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సొంత స్థలం ఉన్నట్లయితే డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే సంబంధిత లబ్ధిదారులకు అందించనుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అంతేకాకుండా బడ్జెట్‌లోనూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అయితే ప్రస్తుతానికి జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు తాండూరు, కులకచర్ల మండలాల్లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా మండల కేంద్రాల్లో జి ప్లస్‌ 2 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్లను ఆహ్వానించడంతోపాటు పలు మండల కేంద్రాల్లో పనులు ప్రారంభమయ్యాయి. జి ప్లస్‌ 2 ఇండ్ల నిర్మాణంతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించే కాంట్రాక్టర్లకు నష్టం జరిగే అవకాశం లేదని భావించిన జిల్లా ఉన్నతాధికారులు మండల కేంద్రాల్లో జి ప్లస్‌2 ఇండ్ల నిర్మాణానికిగాను టెండర్లను కూడా ఆహ్వానించారు. మండల కేంద్రాల్లో జి ప్లస్‌2 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో ప్రభుత్వం అందించే యూనిట్‌ ధరలో కాంట్రాక్టర్లకు ఎంతోకొంత లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించేందుకుగాను కాంట్రాక్టర్లు పోటీ పడే అవకాశాలున్నాయి. మరోవైపు జిల్లాకు 4,323 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకాగా ఇప్పటివరకు 1086 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

వివిధ దశల్లో 1,086 ఇండ్ల నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 4,323 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటివరకు 1,086 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని కోకట్‌, పరిగి నియోజకవర్గంలోని ఇప్పాయిపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో నెలరోజుల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటివరకు 2,714 ఇండ్ల నిర్మాణానికిగాను టెండర్లను ఆహ్వానించగా, మరో 856 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు తుది దశలో ఉన్నాయి. అయితే తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాలకు వెయికిపైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. తాండూరు నియోజకవర్గానికి 1,761 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకాగా గ్రామీణ ప్రాంతానికి 760, పట్టణ ప్రాంతానికి 1,001 మంజూరయ్యాయి. అయితే  ఇప్పటివరకు 600 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరో 40 ఇండ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. అదేవిధంగా వికారాబాద్‌ నియోజకవర్గంలో 1,001 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకాగా గ్రామీణ ప్రాంతానికి 600, పట్టణ ప్రాంతానికి 401 మంజూరయ్యాయి. అయితే ఇప్పటివరకు 156 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. మరో 20 ఇండ్ల నిర్మాణానికి గాను టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. పరిగి నియోజకవర్గంలో 740 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఇప్పటివరకు 260 ఇండ్లకు టెండర్లను ఆహ్వానించగా, 40 ఇండ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా మరో 30 ఇండ్ల నిర్మాణాలు తుది దశలో కొనసాగుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గానికి 593 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకాగా ఇప్పటివరకు 300 ఇండ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్‌ మండలానికి 228 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకాగా 60 ఇండ్లకు టెండర్లను ఆహ్వానించడం జరిగింది. అయితే జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న రెండు పడుకల గదుల ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. రెండు నెలల్లో యాలాల మండలంలోని కోకట్‌లోని 420 ఇండ్లు, కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్‌లో 30  ఇండ్ల నిర్మాణం నెల రోజుల్లోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి పేదవారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా ఉన్నతాధికారులు ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికిగాను అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్‌ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూనిట్‌ కాస్ట్‌తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలను, అర్బన్‌ ప్రాంతంలో రూ.75 వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతులకుగాను ప్రభుత్వం అందజేయనుంది.

నెలరోజుల్లో 450 ఇండ్ల నిర్మాణాలు పూర్తి

జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

జిల్లాలో కొనసాగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను నెలరోజుల్లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు. యాలాల మండలంలోని కోకట్‌లో 420, కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్‌లో 30  డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. సొంత స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. 


logo