సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 23:36:41

అద్దె బకాయిలు రూ. కోటి 32లక్షలు

అద్దె బకాయిలు రూ. కోటి 32లక్షలు
  • పోటీపడి పెంచిన వ్యాపారులు
  • చెల్లింపులలో అలసత్వం
  • నోటీసులు ఇచ్చినాస్పందించకపోవడంతో దుకాణాల సీజ్‌
  • బకాయిలు చెల్లిస్తేనే దుకాణాలు తెరిచేందుకు అనుమతులు

పరిగి, నమస్తే తెలంగాణ : సాధారణంగా వ్యాపార సంస్థ, గృహాలలో అద్దెకు ఉండేవారు అడ్వాన్సు రూపంలో చెల్లించినది పోను ప్రతినెల అద్దె చెల్లిస్తేనే సంబంధిత స్థలంలో ఉండాలి, అలాంటిది ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా నెలల తరబడి అద్దె చెల్లించకుండా దుకాణాలలో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఆర్జించడం తప్ప చెల్లింపులు లేని వైనమిది. అద్దె చెల్లించాలని పలుమార్లు మున్సిపల్‌ సిబ్బంది, మున్సిపల్‌ కమిషనర్‌ స్వయంగా వెళ్లి అడిగినా కాలయాపన చేయడం తప్ప అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో తడిసిమోపెడైన అద్దె డబ్బులు అక్షరాల కోటి ఇరవై లక్షలు. అద్దెల వసూలు విషయంలో అధికారులు సైతం ఇంతకాలం వేచి చూసే ధోరణి సరికాదని, వారి అడ్వాన్సు డబ్బులు సరిపోగానే ఖాళీ చేయిస్తే బాగుండేదని, బకాయిలు పేరుకుపోయినంత వరకు చూస్తూ ఊరుకోవడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే పరిగి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 2018 ఫిబ్రవరి 20వ తేదీన 27దుకాణాలకు బహిరంగ వేలం పాట ద్వారా అద్దెకు ఇచ్చారు. అతి తక్కువగా నెలకు అద్దె రూ. 18,600, అతి ఎక్కువగా రూ. 31,700లకు వేలం ద్వారా దక్కించుకున్నారు. ఈ లెక్కన నెలకు పరిగి గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీకి రూ. 6,32,900 ఆదాయం రావాల్సి ఉండగా అద్దెలు చెల్లించకపోవడంతో రూ. కోటి 32లక్షలు బకాయిలు పేరుకుపోయాయి. 2018ఆగస్టు 2వ తేదీన పరిగి మున్సిపాలిటీ ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా అద్దెల వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు దారితీసిందని చెప్పవచ్చు. 

 తడిసి మోపెడైన అద్దె బకాయిలు..

ప్రతినెల అద్దె చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. పరిగిలోని మున్సిపాలిటీ దుకాణాల సముదాయంలో అద్దెకు ఉంటున్న వ్యాపారులు యధావిధిగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు తప్ప అద్దె చెల్లించడం లేదు. బహిరంగ వేలం పాట సమయంలో వద్దని వారించినా వినకుండా ఇష్టాను సారంగా వేలంలో అద్దె పెంచారు. ఒక దశ లో వేలంపాట నిర్వహించిన అధికారి సైతం ఆలోచించి వేలం పాటలో పెంచాలని, ఒక్క నెలతో కాకుండా ప్రతినెల అద్దె చెల్లించాల్సి ఉంటుందని చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా పెంచడం జరిగింది. దీంతో అద్దెల రూపంలో ప్రతినెల రూ. 6.32లక్షలు అదనపు ఆదాయం వస్తుందని భావించగా ఆసలుకే ఎసరు వచ్చినట్లు తయారైంది. వాస్తవానికి 11నెలలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉన్నది. ప్రతినెల అద్దె చెల్లిస్తేనే రెన్యువల్‌ చేసే వీలుండగా అద్దెలు చెల్లించనప్పుడు ఇంతకాలం దుకాణాలలో ఎలా ఉండనిచ్చారన్నది ప్రశ్న. దుకాణదారులు రూ. 2లక్షలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉండ గా కొందరు లక్ష రూపాయలే చెల్లించడం గమనార్హం. డిపాజిట్‌ డబ్బులు అద్దె కిందకు వసూలు చేసినా దుకాణదారులు చెల్లించిన డిపాజిట్‌ పోను, అంతకంటే ఎక్కువ అద్దె బకాయిలు ఉండడం గమనార్హం. అద్దెల బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు చివరకు ఈ నెల 11వ తేదీన సీజ్‌ చేశారు. అద్దె బకాయిలు చెల్లిస్తే గానీ దుకాణాలు తెరవనిచ్చేది లేదని మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తమకు అద్దెలు ఎక్కువయ్యాయని, వాటి ని తగ్గించాలని దుకాణదారులు కోరుతున్నారు. బహిరంగ వేలంలో దుకాణాలు దక్కించుకోగా అద్దె ఎలా తగ్గిస్తారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మున్సిపాలిటీ దుకాణాల అద్దెలు పెరగడంతో ఆ ప్రభా వం పట్టణంలోని వాణిజ్య దుకాణాల అద్దెలపై పడింది. దుకాణాల యజమానులు ఒక్కసారిగా అద్దెలు పెంచడంతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ దుకాణాల అద్దె తగ్గిస్తే మళ్లీ వేలంపాట ద్వారా దుకాణాలు కేటాయించాలన్నది పలువురి వాదన.

అద్దె బకాయిలు చెల్లించాలి 

అద్దె బకాయిలు చెల్లించనందునే దుకాణాలు సీజ్‌ చేయడం జరిగింది. బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేయగా అద్దె అధికంగా ఉందని, తగ్గించాలని వారు కోరారు. బహిరంగ వేలంపాట ద్వారా అద్దెకు తీసుకున్నందున, వేలంపాటలో పాడిన మేరకు అద్దె చెల్లించాల్సిందే. అద్దె డబ్బులు తగ్గించడం కుదరదు. అద్దె బకాయిలు చెల్లిస్తే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తాం. 

- తేజిరెడ్డి, కమిషనర్‌, పరిగి మున్సిపాలిటీ


logo