బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 23:26:49

పది పరీక్షలకు సన్నద్ధం

పది పరీక్షలకు సన్నద్ధం

పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల 19నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరుగనున్న పరీక్షల పకడ్బందీ చేపట్టారు. ఉన్నత పాఠశాలలుండగా, 14,948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్వహణకు 67 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇద్దరు కస్టోడియన్లు, రూట్‌ ఆఫీసర్లు, 735 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. నిరోధానికి నాలుగు ఫ్లయింగ్‌ స్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను నియమించిన అధికారులు.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నారు

  • పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • ఈ నెల 19 నుంచి ఏప్రిల్‌ 4వరకు..
  • జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలు
  • హాజరు కానున్న 14,948 మంది
  • ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు..
  • కేంద్రాల్లో సౌకర్యాల కల్పన

పరిగి, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను విద్యాశాఖ అధికారులు చేపట్టారు. ఈనెల 19వ తేదీ గురువారం పదో  తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఏప్రిల్‌ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,948 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానుండగా వారిలో 13,768 మంది రెగ్యులర్‌, 1,180 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులలో 6,880 మంది బాలికలు, 6,888 మంది బాలురు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 282 ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిలో 204 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 69 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, 9 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 61 పరీక్షా కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 67 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, కస్టోడియన్‌లు ఇరువురు, రూట్‌ ఆఫీసర్లు 6 మందిని నియమించడం జరిగింది. పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా 735 మందిని నియమించారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పదో తరగతి పరీక్షలు మరింత సమర్థవంతంగా నిర్వహించడం, మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి చర్యలలో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఇదిలావుండగా పరీక్షలు జరిగే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ముందు జాగ్రత్తగా జిరాక్స్‌ సెంటర్‌లు, కంప్యూటర్‌ సెంటర్‌లు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి వేయనున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పరీక్షా సమయం కంటే గంట ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా సమయానికి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో ప్రత్యేకంగా ఆర్టీసీ వారు బస్సుల సదుపాయం కల్పించనున్నారు. పరీక్షల అనంతరం మళ్లీ విద్యార్థులు గ్రామాలకు తిరిగి వెళ్లడానికి కూడా బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తారు. పరీక్షా కేంద్రాలలో సైతం విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై విద్యాశాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. పరీక్షా కేంద్రాలలో డ్యూయెల్‌ డెస్క్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయలు కల్పించడంతోపాటు పరీక్షా కేంద్రంలోని గదులలో తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరుగుతుంది. ఎండలు ముదురుతున్న తరుణంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతోపాటు ప్రథమ చికిత్స అందించేందుకు ఏఎన్‌ఎంలను నియమించడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి చర్యలు

పదో తరగతి పరీక్షలలో మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి సంబంధించి నాలుగు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో బృందంలో తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఈవో, ఎస్‌ఐలు సభ్యులుగా ఉంటారు. అలాగే సీ సెంటర్లుగా గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి రెండు సిట్టింగ్‌ స్కాడ్‌లు ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ విద్యార్థులు పట్టుబడితే సంబంధిత గదిలో ఇన్విజిలేషన్‌ విధులు నిర్వర్తించే వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరీక్షల కోసం అవసరమైన ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లకు చేరుకున్నాయి. వాటిని పోలీస్‌ స్టేషన్‌ల్లో భద్రపరిచారు. పరీక్షల రోజు పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. 

ఉత్తమ ఫలితాలపై దృష్టి

జిల్లాలో ఈసారి పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు మూడు నెలల నుంచే ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సిద్ధం చేసే విధంగా ప్రణాళికాబద్దంగా చదవడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నియోజకవర్గాల స్థాయిలో పదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలను అప్పటి కలెక్టర్‌ నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పౌసుమి బసు సైతం పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈసారి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌లు, కేజీబీవీ, గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యాబోధన చేయడంతోపాటు పరీక్షల విధానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారు.  

పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టాం..

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాం. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు పలు సదుపాయలు కల్పించడం జరుగుతుంది. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 

- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి logo