శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Mar 15, 2020 , 00:52:10

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న సర్కారు.. నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలకు ప్రకటించింది. అలాగే, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించగా.. టెన్త్‌ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 250 బెడ్లను సిద్ధం చేశారు. నర్సులతోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ఏడు దేశాల నుంచి వచ్చేవారిని ఇక్కడికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని, తాండూరులోని జిల్లా దవాఖానలో చేసిన కరోనా ఐసోలేషన్‌ వార్డును ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం శనివారం సందర్శించింది. అలాగే, హరిత రిసార్ట్‌ను కలెక్టర్‌ పౌసుమి బసు, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్‌ పరిశీలించారు.

  • నేటి నుంచి విద్యాసంస్థలు, సినిమా హాళ్లు బంద్‌
  • ఈ నెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
  • ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు యథాతథం
  • వికారాబాద్‌ రిసార్ట్‌లో కేంద్రం ఏర్పాటు
  • 250 పడకలను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
  • కేంద్రాన్ని సందర్శించిన డబ్ల్యూహెచ్‌వో బృందం
  • ఏడు దేశాల నుంచి వచ్చేవారికి రిసార్ట్‌లో షెల్టర్‌
  • 14 రోజులపాటు అక్కడే..
  • అనుమానిత కేసులుంటే దవాఖానకు తరలించేందుకు ఏర్పాట్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు సెలవులు ప్రకటించారు. ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతోపాటు సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ కూడా మూసివేయనున్నారు. అదేవిధంగా ఇంటర్‌ పరీక్షలను యథాతథంగా నిర్వహించేందుకు నిర్ణయించడంతోపాటు పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేయకుండా యథావిధిగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోనూ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు 250 బెడ్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా క్వారంటైన్‌ కేంద్రంలో వైద్యులతోపాటు నర్సులను అవసరమైన మందులను కూడా హరిత రిసార్ట్‌లో అందుబాటులో ఉంచారు. మరోవైపు పది రోజుల క్రితం ఇటలీ నుంచి వికారాబాద్‌కు ఓ యువతి వచ్చినట్లు తెలిసింది. అయితే సదరు యువతి తండ్రి వికారాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యున్ని సంప్రదించగా, సదరు వైద్యుడు జిల్లా వైద్యాధికారులకు సమాచారమివ్వగా జిల్లా కలెక్టర్‌ వివరాలు ఆరా తీసి, వైద్య పరీక్షల నిమిత్తం యువతిని హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనసమూహంలోకి వెళ్లినట్లయితే మాస్క్‌లు వాడాలని, ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.


క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించిన డబ్ల్యూహెచ్‌వో బృందం...

వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సందర్శించింది. హరిత రిసార్ట్‌లో చేసిన ఏర్పాట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్నేహ ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. అనంతరం తాండూరులోని జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌ వార్డును ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పరిశీలించింది. అయితే క్వారంటైన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్‌లో 36 గదులుండగా 250 పడకలను సిద్ధం చేశారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఇటలీ, దక్షిణకొరియా, చైనా, ఇరాన్‌, హాంకాంగ్‌, ప్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల నుంచి స్వదేశీయులు, విదేశీయులను వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచనున్నారు. అయితే సంబంధిత దేశాల నుంచి రాష్ర్టానికి వచ్చే వారిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా వికారాబాద్‌కు తీసుకురానున్నారు. అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే కరోనా వైరస్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వికారాబాద్‌కు తరలించనున్నారు. 14 రోజులపాటు విడివిడిగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 14 రోజుల్లో క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చిన వారిలో కరోనా అనుమానిత కేసులున్నట్లయితే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా క్వారంటైన్‌ కేంద్రంలో ఉండే వారికి జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి లక్షణాలున్నట్లయితే వారికి అక్కడే ప్రాథమికంగా చికిత్స అందించేందుకు వైద్యులను, నర్సులను, అవసరమైన మందులను కూడా క్వారంటైన్‌ కేంద్రంలో అందుబాటులో ఉంచారు. శుక్రవారం రాత్రే ప్రభావిత ఏడు దేశాల నుంచి 14 మంది రాష్ర్టానికి వస్తున్నారని, వారిని వికారాబాద్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తారని అధికారులకు సమాచారం అందినప్పటికీ శనివారం రాత్రి వరకు ఎవరిని తీసుకురాలేరని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు క్వారంటైన్‌ కేంద్రంలో ఏర్పాట్లను ఆరుగురు తహసీల్దార్లకు అప్పగించారు. కేంద్రంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై తహసీల్దార్లపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దారి మూసివేత....

అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో కరోనా క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లా యంత్రాంగం పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ముందస్తు చర్యల్లో భాగంగా అనంతగిరి అనంతపద్మనాభస్వామి ఆలయం మీదుగా తాండూరు వెళ్లే దారిని మూసివేశారు. అనంతగిరి మీదుగా తాండూరు వెళ్లే దారితోపాటు వచ్చే దారిని కూడా మూసివేశారు. తాండూరు వైపు వెళ్లే వాహనాలను బుగ్గ రామేశ్వరం ఆలయం మీదుగా కెరెళ్లి నుంచి వెళ్లేలా దారి మళ్లించారు. మరోవైపు క్వారంటైన్‌ కేంద్రం వద్ద ఎవరూ ఆందోళన చెయకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వికారాబాద్‌ పట్టణంలో కూడా స్థానిక పోలీసులతోపాటు సీఆర్‌పీఎఫ్‌ బృందంతో ఎలాంటి ఆందోళనలు, రాస్తారోకోలు చేయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


logo