బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Mar 09, 2020 , 02:24:40

‘పాలమూరు-రంగారెడ్డి’తో ప్రతి ఎకరాకు నీరు

‘పాలమూరు-రంగారెడ్డి’తో ప్రతి ఎకరాకు నీరు
  • కాళేశ్వరం తరహాలోనే పాలమూరును పూర్తి చేస్తాం
  • సీఎం కేసీఆర్‌ విజన్‌ ఉన్న వ్యక్తి
  • రూ.25 వేలలోపు రుణాలు ఈనెలాఖరులో మాఫీ
  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

బొంరాస్‌పేట : కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఏర్పుమళ్లలో రూ.1.39 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును, గౌరారంలో రూ.13.50 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటికను, కంపోస్ట్‌ షెడ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోత పథకాన్ని పూర్తిచేసి రైతుల కలను సాకారం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తిచేసి 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని భూములకు కూడా సాగునీరు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ ఉన్న వ్యక్తి అని రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం అయితే బడ్జెట్‌ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లను కేటాయించామన్నారు. రూ.25 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, ఈనెలాఖరులోగా ఈ సహాయాన్ని రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తామని, 5.83 లక్షల మంది రైతులకు దీనివల్ల లబ్ధి కలుగుతుందని అన్నారు. రూ.లక్షలోపు ఉన్న రుణాలను నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఐదు వేల మంది రైతులకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి రూ.12 లక్షలతో రైతు వేదికలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, బడ్జెట్‌లో వీటి కోసం రూ.350 కోట్లను కేటాయించారని పేర్కొన్నారు. 


రైతులు సాగు చేయగా వచ్చిన పంట దిగుబడిని ధరలు లేకపోతే నిల్వచేసి అమ్ముకునేందుకు రూ.వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. కొత్తగా పట్టాపాస్‌ బుక్కులు వచ్చిన వారికి కూడా రైతుబంధు సహాయం అందించాలని కేబినెట్‌లో నిర్ణయించామని అన్నారు. 

ఇంటిజాగా ఉన్న వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది లక్ష బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పించన్లను ఏప్రిల్‌ నెల నుంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయని అన్ని రంగాల్లో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. ఏవర్గానికి ఏ విధంగా సహాయం చేయాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని, కులవృత్తులకు ప్రోత్సాహం అందించి ఆదుకుంటున్నారని అన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా మార్చామని, పారిశుద్ధ్యం కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను ఇచ్చామన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని వేగిరపర్చేందుకు జిల్లాకు ఒక అదనపు కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించిందని అన్నారు. 


*మహిళాభివృద్ధే సీఎం లక్ష్యం

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించారని అన్నారు. మహిళా శక్తి ఎప్పటికీ ముందుంటుందని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను మహిళలకు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సబిత పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండే పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలువడం ప్రజల అదృష్టమని, ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే శక్తిని ఎమ్మెల్యేకు ఇవ్వాలని మంత్రి ప్రార్థించారు. 

*  జూనియర్‌ కళాశాలలను మంజూరు చేస్తాం..

కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో జూనియర్‌ కళాశాలలను సీఎంతో చర్చించి మంజూరు చేస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. బొంరాస్‌పేట మండలంలోని యూపీఎస్‌లను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని, కొత్త పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

*  నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం:ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి


కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. తాండూరులోని గనుల నుంచి వచ్చే ఆదాయంలో నియోజకవర్గానికి రూ.3 కోట్లను విడుదల చేశారని ఈ నిధులలో రూ.1.50 కోట్లను ట్రాక్టర్ల కొనుగోలు కోసం ఇస్తున్నామని అన్నారు. మిషన్‌ భగీరథ అసంపూర్తి పనులను నెలాఖరులోగా పూర్తిచేసి ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇప్పించి తాగునీటిని అందిస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని దీనిని సత్వరం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఏర్పుమళ్లలో గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సర్పంచ్‌లకు అందజేశారు. గ్రామానికి చెందిన బోయిని చంద్రయ్యకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.1.50 లక్షల చెక్కును మంత్రి పంపిణీ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, డీఆర్‌డీవో క్రిష్ణన్‌, ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీలు చౌహాన్‌ అరుణాదేశు, మైపాల్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ మహేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, పార్టీ నాయకులు కవిత, రమణారెడ్డి, రామక్రిష్ణ, నరేశ్‌గౌడ్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo