శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 07, 2020 , 23:41:50

చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ. 56 కోట్లు

చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ. 56 కోట్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగు నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఈ వేసవిలో చేయాల్సిన పనులకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేశారు. జిల్లాలోని మెజార్టీ ప్రజానీకం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలను అధికంగా సాగు చేస్తారు. జిల్లాలోని మెజార్టీ రైతాంగం వర్షాధారంపైనే పంటలను సాగు చేస్తు వస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవనటైట్లెతే ఏడాదికి ఒక పంట కూడా అంతంతా మాత్రంగా వస్తుంది. జిల్లాలో కాగ్నా, కాకరవేణి, మూసీ, లఖ్నాపూర్‌ వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వం కూడా జిల్లా రైతాంగానికి సాగు నీరందించాలనే ఆలోచించకపోవడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వం జిల్లాలోని ప్రధానమైన వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించి పంటలకు సాగు నీరందించడమే కాకుండా బోర్లు, బావుల్లో భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయినట్లయితే 80శాతం రైతులు ఏడాదికి రెండు పంటలు పండించే ఆస్కారం ఉంటుంది.  జిల్లా లో 1207చెరువులు, 9ప్రాజెక్టులున్నాయి. వీటి కింద 77,580 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 2.25లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా 720చెరువుల పునరుద్ధరణకు రూ. 250కోట్లతో పనులు పూర్తి చేశారు.


5 చెక్‌డ్యాంల పనులు షురూ..

జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులతో పాటు లఖ్నాపూర్‌ ప్రాజెక్టుతో పాటు వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని ప్రధాన వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రూ. 116కోట్లతో 31చెక్‌డ్యాంలను నిర్మించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో 14చెక్‌డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం అనుమతులను మంజూరు చేసింది. తాండూర్‌ నియోజక వర్గానికి 5చెక్‌డ్యాంలు, పరిగి నియోజకవర్గానికి 4చెక్‌డ్యాం లు, కొడంగల్‌ నియోజకవర్గానికి రెండు, వికారాబాద్‌ నియోజకవర్గానికి రెండు, చేవెళ్ల నియోజకవర్గానికి ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన చెక్‌డ్యాంలలో ఇప్పటికే 5 చెక్‌డ్యాంలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతోపాటు పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 9చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించి ఈనెలాఖరు లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు జిల్లా ఇరిగేషన్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలాఖరులోగా మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 


ప్రభుత్వం మంజూరు చేసిన చెక్‌డ్యాంలలో రూ. 8.04కోట్లతో తాండూర్‌ మండలంలోని ఎల్మకన్నె సమీపంలోని కాగ్నా నదిపై, రూ. 6.47కోట్లతో తాండూర్‌ మండలంలోని చిట్టిఘణపూర్‌ వద్ద కాగ్నానదిపై, రూ. 3.50కోట్లతో పెద్దేముల్‌ మండలంలోని మాన్‌సాన్‌పల్లి వద్ద కాగ్నానదిపై, రూ. 8.74కోట్లతో బషీరాబాద్‌ మండలం జీవాన్గి వద్ద కాగ్నా నదిపై, రూ. 9.62 కోట్లతో యాలాల మండలంలోని కోకట్‌ వద్ద కాగ్నా నదిపై, రూ. 2.46 కోట్లతో పరిగి మండలంలోని లఖ్నాపూర్‌ వద్ద పెద్దవాగుపై, రూ. 1.57 కోట్లతో పరిగి మండలం చిగురాల్‌పల్లి వద్ద చిన్నవాగుపై, రూ. 2.06 కోట్లతో కుల్కచర్ల మండలం అంతారం వద్ద పెద్దవాగుపై, రూ. 1.75కోట్లతో కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌ వద్ద పెద్దవాగుపై, రూ. 2.10కోట్లతో నవాబుపేట్‌ మండలం గంగ్యాడ వద్ద మూసీ నదిపై, రూ. 2.69 కోట్లతో బొంరాస్‌పేట్‌ మండలం బొంరాసుపేట్‌ వద్ద కాకరవేణి వాగు పై, రూ. 3.14 కోట్లతో బొంరాసుపేట్‌ మండలం తుంకిమెట్ల వద్ద కాకరవేణి వాగుపై, రూ. 1.61 కోట్లతో ధారూర్‌ మండలంలోని దోర్నాల్‌ వద్ద పెద్దవాగుపై, రూ. 2.30కోట్లతో దోర్నాల్‌ వద్ద పెద్దవాగుపై చెక్‌డ్యాంలను నిర్మించనున్నారు. 


ఇప్పటికే తాండూర్‌ నియోజకవర్గంలోని కాగ్నానదిపై తాండూర్‌ మండలంలోని ఎల్మకన్నె, చిట్టిఘణపూర్‌ వద్ద, పెద్దేముల్‌ మండలంలోని మాన్‌సాన్‌పల్లి వద్ద, బషీరాబాద్‌ మండలం జీవంగి వద్ద, యాలాల మండలంలోని కోకట్‌ వద్ద కాగ్నా నదిపై నిర్మించే చెక్‌డ్యాంల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మిగతా పరిగి, కుల్కచర్ల, నవాబుపేట, ధారూర్‌ మండలాల్లో నిర్మించే చెక్‌డ్యాంల నిర్మాణ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పూర్తి చేసి ఈనెలాఖరు లోగా పనులు ప్రారంభించేందుకు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 


మే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం మంజూ రు చేసిన 14చెక్‌డ్యాంల నిర్మాణాలను మే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్య లు చేపడుతామని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి బి. సుందర్‌ తెలిపారు. ఇప్పటికే 5 చెక్‌డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభంకాగా, మిగతా పనులను త్వరితగతిన ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి రూ. 116 కోట్లతో 31చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలను పంపగా 14చెక్‌డ్యాంలకు అనుమతులు మంజూరైనట్లు వెల్లడించారు.

- బి. సుందర్‌, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి logo