శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Mar 07, 2020 , 03:50:27

భవన నిర్మాణ అనుమతులు సులభతరం

 భవన నిర్మాణ అనుమతులు సులభతరం
  • ఏప్రిల్‌ 2నుంచి నూతన విధానం అమలు
  • పైలట్‌ ప్రాజెక్టుగా వికారాబాద్‌ మున్సిపాలిటీ ఎంపిక
  • కొనసాగుతున్న ట్రయల్‌ రన్‌
  • భవన నిర్మాణాలకు అన్ని అనుమతులు ఒకేచోట

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పరిశ్రమల అనుమతుల కోసం టీఎస్‌-ఐపాస్‌ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌ బీ-పాస్‌ను అమల్లోకి తీసుకురానుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకు ఏప్రిల్‌ 2నుంచి టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్టుగా తొలుత నాలుగు మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని ట్రయల్‌ రన్‌గా అమలు చేస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపాలిటీతో పాటు మహబూబ్‌నగర్‌, జనగామ, మంచిర్యాల మున్సిపాలిటీలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. తదనంతరం ఏప్రిల్‌ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే అనుమతినిచ్చే నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 


సొంతింటి కలను నిజం చేసుకునే వారికి మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు పొందడమంటే చాలా కష్టమైన వ్యవహారం. అన్ని పత్రాలతో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా... మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎదో ఒక కొర్రీలు పెట్టి అధికారుల నుంచి సిబ్బంది వరకు ఎంతో కొంత డబ్బులు ముట్ట జెప్పితేనే భవన నిర్మాణ అనుమతులు వచ్చే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా అవినీతిమయం కావడంతో లంచమిస్తేనే అనుమతులిచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సంబంధం లేకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణ అనుమతులిచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని తీసుకురానుంది. 


దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు...

భవన నిర్మాణ అనుమతులు ఇకపై మరింత సులువు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న టీఎస్‌-బీపాస్‌తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు కానున్నాయి. ఇకపై భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చాలు క్షణాల్లో స్వీయ ధృవీకరణ(సెల్ఫ్‌ సర్టిఫికెట్‌) పత్రం జారీ అవుతుంది. సంబంధిత స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపట్టవచ్చు. గతంలోనూ భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ విధానంలోనే జారీ అవుతున్నప్పటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న అనంతరం 21రోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనలున్నప్పటికీ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేయాల్సి ఉండేది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిర్ణీత సమయానికి రాకపోవడం, ఒకవేళ వచ్చినా ఎదో ఒక కొర్రీలు పెట్టి లంచం డి మాండ్‌ చేయడం వంటివి జరుగుతుండేది. ఇకపై భవన నిర్మా ణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల భాగస్వామ్యం లే కుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందవచ్చు. 


75 గజాలలోపు నిర్మాణాలకు ఒక్క రూపాయి

టీఎస్‌-బీపాస్‌ విధానం ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయిని చెల్లిస్తే సరిపోతుంది. ఆ వెనువెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. అదే 75చదరపు గజాల నుంచి 200 చదరపు గజాల వరకు స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టే వారు బిల్డింగ్‌ ప్లాన్‌ను టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు మంజూరవుతాయి. తదనంతరం కలెక్టర్‌ నియమించే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించనున్నారు. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మానాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతో పాటు సంబంధిత భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకోనున్నా రు. అదే విధంగా 500చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మించే భవన నిర్మాణాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా 21రోజుల్లో అనుమతులు పొందనున్నారు.  


240చదరపు గజాల కంటే ఎక్కువ, 500చదరపు గజాల వరకు ఉండే భవనాలకు స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా స్వాధీన ధృవీకరణ పత్రాన్ని తక్షణమే అందజేయనున్నారు. అదే విధం గా 500చదరపు గజాలపైగల భవనాలకు స్వీయ ధృవీకరణ దరఖాస్తు ఆధారంగా 15రోజుల్లో స్వాధీన ధృవపత్రం జారీ చేయనున్నారు. సంబంధిత స్వాధీన ధృవీకరణ పత్రాలను కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షించనున్నారు. గతంలో మాదిరిగా అగ్నిమాపక, నీటి పారుదల తదితర శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా టీఎస్‌-బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు ఒకేచోట అన్ని అనుమతులు జారీ కానున్నాయి. అన్ని ధృవీకరణ పత్రాలు సరిగ్గా ఉండి దరఖాస్తు చేసుకున్నా 21రోజుల్లో అనుమతి రానట్లయితే 22వ రోజున అనుమతిచ్చినట్లుగా సమాచారం సదరు భవన నిర్మాణదారుడికి పంపించనున్నారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ భవన నిర్మాణ అనుమతులను పర్యవేక్షించనుంది. వాస్తవాలను తప్పుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్లయితే భవనాలను కూల్చివేయడంతో పాటు భవన యజమాని నుంచి కూల్చివేత ఖర్చులు వసూలు చేయనున్నారు. 


అదే విధంగా రిజిస్ట్రేషన్‌ విభాగం ద్వారా నిర్ణయించిన స్థలం, భవన క్యాపిటల్‌ విలువలో 25శాతం వరకు జరిమానా విధించనున్నారు. 50 శాతం కంటే తక్కువ కాకుండా జరిమానా విధించడంతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అదే విధంగా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లాస్థాయి కమిటీ చట్ట విరుద్ధమైన భవన నిర్మాణాలను గుర్తించి, పర్యవేక్షించి సంబంధిత నిర్మాణాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సమాచారమిచ్చే వారిని ప్రోత్సహించడంతోపాటు ఏడు రోజుల్లోగా చర్యలు తీసుకోనున్నారు. అదే విధంగా నూతన విధానం ప్రకారం కేవలం పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించే ప్రాంతాన్ని పార్కింగ్‌కు కాకుండా వేరోక విధంగా వాడుకున్నట్లయితే నిబంధనల ఉల్లంఘన కింద యాజమానికి స్థలం విలువతోపాటు భవన క్యాపిటల్‌ విలువలో 25శాతం జరిమానా విధించడం జరుగుతుంది. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్‌ ఉల్లంఘనలను గుర్తించడంతోపాటు పర్యవేక్షించి నియంత్రించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించనున్నారు. 


కొత్త విధానం ప్రకారం ప్రతీ లేఅవుట్‌లో పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. లేఅవుట్‌ పూర్తైన తర్వాత ఖాళీ స్థలాలను రోడ్లకు కేటాయించిన భూమికిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే లేఅవుట్‌ ఆమో ద కమిటీ తాత్కాలిక లేఅవుట్లను పరిశీలించి సరిగ్గా ఉన్నట్లయితే సంబంధిత కమిటీ శాశ్వత అనుమతిని ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. అదే విధంగా ఆస్తిపన్నుకు సంబంధించి 75చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో నిర్మించే జి, జీప్లస్‌1 నివాస భవనాలకు ఆస్తి పన్ను మినహాయించనున్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్‌పై మ్యూటేషన్‌ తక్షణమే చేయనున్నారు. భవన యజమాని తప్పుడు వివరాలిచ్చినట్లయితే ఆస్తిపన్ను 25రేట్లు జరిమానా (వన్‌టైం ఫెనాల్టీ)ను విధించనున్నారు.


logo