శుక్రవారం 29 మే 2020
Vikarabad - Mar 05, 2020 , 23:19:33

అక్రమ లేఅవుట్లపై కొరడా...

అక్రమ లేఅవుట్లపై కొరడా...
  • ‘పట్టణ ప్రగతి’లో వెంచర్ల గుర్తింపు
  • సర్కారుకు నివేదిక అందజేసిన
  • 4 మున్సిపాలిటీల పరిధిలో అనుమతుల్లేనివి 214
  • అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 117, 81
  • నిర్వాహకులకు త్వరలో నోటీసులు జారీ
  • అనంతరం తీసుకునే యోచన
  • జిల్లాలో 204 అధికారికలే అవుట్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ వెంచర్లపై కొరడా ఝులిపించేందుకు సర్కారు సిద్ధమైంది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు  చేపట్టిన ప్రభుత్వం..  లే అవుట్ల లెక్క తేల్చాలని ఆదేశించింది. దీంతో మున్సిపల్‌ కమిషనర్లు అనుమతిలేని లే అవుట్లను గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక   4 మున్సిపాలిటీల   అధికారిక లేఅవుట్లు ఉండగా.. అనుమతిలేనివి 214 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 117, వికారాబాద్‌లో 81 అక్రమ వెంచర్లు ఉన్నాయి. అక్రమ లేఅవుట్ల నిర్వాహకులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం చర్యలు తీసుకోనున్నారు. కాగా, అధికారిక లేఅవుట్లలో వికారాబాద్‌ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 128 వరకు అనుమతి పొందిన లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.


జిల్లాలోని ఆయా మున్సిపాలిటీ పరిధిలోని అనుమతిలేని లే అవుట్లపై కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని పక్కాగా అమలుచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రోజురోకూ పెరుగుతున్న అక్రమ వెంచర్లను గుర్తించి అక్రమ లే అవుట్లను తొలగించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జిల్లాలోని పాత మున్సిపాలిటీలతోపాటు కొత్త మున్సిపాలిటీల్లోని అక్రమ లే అవుట్ల వివరాలను అందజేయాలన్న ఆదేశాలతో ఆయా మున్సిపల్‌ కమిషనర్లు నాలుగు మున్సిపాలిటీల్లోని అనుమతిలేని లే అవుట్లను గుర్తించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పది రోజుల్లో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న అక్రమ లే అవుట్ల పూర్తి వివరాలను అధికారులు గుర్తించారు. సంబంధిత అక్రమ లే అవుట్ల వివరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ లే అవుట్ల నిర్వాహకులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం అక్రమ వెంచర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో అనుమతిలేని లే అవుట్లు 214 ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. అయితే సంబంధిత అక్రమ లే అవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న లే అవుట్లు మినహా మిగతా లే అవుట్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 204 అధికారిక లే అవుట్లు ఉన్నాయి, వీటిలో అత్యధికంగా వికారాబాద్‌లో 128 లే అవుట్లున్నట్లు, రాష్ట్రంలోని కామారెడ్డి మున్సిపాలిటీ తర్వాత వికారాబాద్‌ మున్సిపాలిటీ అధికారిక లే అవుట్లలో రెండో స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


214 అక్రమ లే అవుట్లు

జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో 214 అనుమతిలేని లే అవుట్లు ఉన్నట్లు పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే జిల్లాలో అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో అక్రమ లే అవుట్లు  సంబంధిత మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలా వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వెలిసినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పరిగి మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా 117 అక్రమ లే అవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ లే అవుట్లలో ఎక్కువగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బురుగుచెట్టు ఏరియాలోని సర్వేనెంబర్‌-262లోని 9 ఎకరాల్లోని 100 ప్లాట్లు, సాయిరాంనగర్‌లోని సర్వే నెంబర్‌ 20, 21, 22లోని 16 ఎకరాల 7 గుంటల్లో 316 ప్లాట్లు చేసిన లే అవుట్‌, శ్రీ శ్రీనివాసనగర్‌లోని సర్వేనెంబర్‌ 37,47,48,49, 50లోని 7.75 ఎకరాల్లో 204 ప్లాట్లు చేసిన లే అవుట్‌, మల్లేనోనిగూడ దారిలో సర్వే నెంబర్‌ 40లో 1.75 ఎకరాల్లో 42 ప్లాట్లు చేసిన లే అవుట్‌, జేఎన్‌టీ నగర్‌లోని సర్వే నెంబర్‌ 20,21,22లోని 16.28 ఎకరాల్లో 316 ప్లాట్లు చేసిన లే అవుట్‌, కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ సమీపంలోని సర్వే నెంబర్‌ 424/ఏ/1 నుంచి 424/ఏ/2/2 లో 3 ఎకరాల్లో చేసిన 164 ప్లాట్ల లే అవుట్‌, టీచర్స్‌ ఆపరేటివ్‌ సొసైటీలోని సర్వే నెంబర్‌ 271, 272, 273, 275లోని 11 ఎకరాల్లో చేసిన 152 ప్లాట్ల లే అవుట్‌, వికారాబాద్‌ వెళ్లే దారిలో కుడివైపు సర్వే నెంబర్‌ 39లోని 13.93 ఎకరాల్లో చేసిన 258 ప్లాట్ల లే అవుట్‌, మల్లెనోనిగూడ దారిలో సర్వే నెంబర్‌ 25u/ 25/a/1లోని 7.5 ఎకరాల్లో చేసిన 138 ప్లాట్ల లే అవుట్‌, మన్నెగూడ దారిలో సర్వేనెంబర్‌ 217ee/ 218a/218aa/ 218e/218u లోని 9 ఎకరాల్లో చేసిన 144 ప్లాట్ల లే అవుట్‌, ఎర్రగడ్డపల్లి రోడ్డులోని సర్వే నెంబర్‌ 389, 390లోని 16.85 ఎకరాల్లో 276 ప్లాట్లు చేసిన లే అవుట్‌, బాలాజీనగర్‌లోని సర్వేనెంబర్‌ 291, 295లోని 15 ఎకరాల్లో చేసిన 293 ప్లాట్ల లే అవుట్లతోపాటు బాలాజీనగర్‌, టీచర్స్‌ కాలనీ, తిరుమల కాలనీ, కొప్పుల అనంత్‌రెడ్డి కాలనీ, బస్‌స్టాండ్‌ ఎదురుగా, శ్రీనివాసనగర్‌ కాలనీ, వికారాబాద్‌ రోడ్డు, మన్నెగూడ రోడ్డు, పద్మావతినగర్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, శ్రీశ్రీనివాస హిల్స్‌, ఎన్‌టీఆర్‌నగర్‌ సమీపంలో, పల్లవి కాలేజీ సమీపంలో, లక్ష్మీనగర్‌, సిద్ధాంతి కాలనీ, అస్మ మజీద్‌ ఏరియా, భవానీనగర్‌, మినీ స్టేడియం పక్కన, తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర, అయ్యప్ప ఆలయం ఏరియా, విద్యానగర్‌ కాలనీ, కొడంగల్‌ రోడ్డు, ఆర్‌టీసీ కాలనీ ఏరియా, మధురానగర్‌, సాయిరాంనగర్‌ తదితర ప్రాంతాల్లో వెలిసిన పలు లే అవుట్లకు ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 81 లే అవుట్లు అక్రమ లే అవుట్లు ఉన్నట్లు అధికారులు పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించారు. అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలోని కోర్టుకు ఎదురుగా ఉన్న ఏరియాలో చేసిన లే అవుట్లు, దన్నారం, ఎన్నెపల్లిలో పలు లే అవుట్లకు అనుమతులు లేనట్లుగా అధికారుల సర్వేలో తేలింది. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలో 11 అక్రమ లే అవుట్లు, కొడంగల్‌ మున్సిపాలిటీలో 5 లే అవుట్లకు అనుమతిలేకుండానే ప్లాట్లు చేసి విక్రయించినట్లు గుర్తించారు.


మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం 

జిల్లాలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఆయా మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే అవుట్లు అడ్డగోలుగా వెలిసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అక్రమ వెంచర్లపై మున్సిపల్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో అనుమతిలేని వెంచర్లు అడ్డగోలుగా వెలిశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే లే అవుట్లు వేసి అనుమతులు పొందినట్లుగా ప్రచారం చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు రియల్టర్లు చెరువులు, కుంటలను కబ్జా చేసి మున్సిపాలిటీల అనుమతి లేకుండా ప్లాట్లు చేసినట్లు పట్టణ ప్రగతిలో భాగంగా సంబంధిత అధికారులు గుర్తించారు. అయితే మున్సిపల్‌ అధికారులు ఇప్పటివరకు సంబంధిత అక్రమ లే అవుట్లకు సంబంధించి ఎలాంటి వివరాలను సేకరించకుండా తెలిసినా గోప్యంగా ఉంచుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సహకరించినట్లు పట్టణ ప్రగతిలో భాగంగా వెలువడిన అక్రమ లే అవుట్లను చూస్తే తెలుస్తుంది. అయితే మున్సిపాలిటీల పరిధిలోని వందల ఎకరాల్లోని వ్యవసాయ భూములను రియల్‌ వ్యాపారులు వెంచర్లుగా మార్చారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకుగాను తప్పనిసరిగా రెవెన్యూ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఎవరూ ఈ నిబంధనను పట్టించుకోకుండా అధికారుల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా లే అవుట్‌ నిబంధన ప్రకారం రోడ్డు, మురుగునీటి కాలువలు, వీధి దీపాల స్తంభాలు ఏర్పాటుతోపాటు రోడ్లు, మురుగునీటి కాలువలకు కేటాయించిన స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను ఎవరు కూడా పాటించకుండానే లే అవుట్లను ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే సంబంధిత అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 


logo