గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 23:52:45

పరిశుభ్రత కొనసాగించాలి

పరిశుభ్రత కొనసాగించాలి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం పట్టణాలను పచ్చదనం-పరిశుభ్రతతో పాటు మిగతా అన్నింటిలోనూ ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత నెల 24 నుంచి ఈ నెల 4వరకు జిల్లాలోని మున్సిపాలిటీల్లో సాగిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎంతో మార్పు వచ్చింది. మున్సిపాలిటీల్లో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పట్టణ ప్రగతి కార్యక్రమంతో పరిష్కరించారు. మున్సిపాలిటీల్లోని మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు ముళ్ల పొదలను తొలగించడం, హరితహారంలో భాగంగా మొక్కలను పెంచడం, పాడుపడిన బావులను, పాత భవనాలను కూల్చివేయడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం వంటి పనులు చేపట్టారు. విద్యుత్‌ సమస్య పరిష్కారం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణాలను, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం వంటి పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తి చేయనున్నారు. పది రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావడంతో ఆయా మున్సిపాలిటీల్లోని ప్రజలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని ప్రతీ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపుదిద్దుకున్నాయి. పది రోజులపాటు జరిగిన పట్టణ ప్రగతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్‌ రెడ్డి, మహేష్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి, ఆనంద్‌లు పాల్గొన్నారు. పట్టణాల ప్రగతికిగాను ప్రభుత్వం జిల్లాలోని వికారాబాద్‌, తాండూ ర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలకుగాను రూ.1.56 కోట్ల నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 


పట్టణాల్లో ఎంతో మార్పు...

గత పది రోజులుగా ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఎంతోమార్పు కనపడుతుంది. నాలుగు మున్సిపాలిటీల్లో కలెక్టర్‌ పౌసుమి బసు ఆకస్మిక పర్యటనలు చేసి పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 17 లక్షలను విడుదల చేయగా పలు పనులను చేపట్టారు. ఏడాది రోజులుగా అన్ని వార్డుల్లో ప్రత్యేకాధికారులు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొని వార్డుల్లో చెత్త, మురుగు కాలువలను శుభ్రం చేశారు. ఏళ్లుగా పేరుకుపోయిన మురికిని ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంతో శుభ్రం చేయడం జరిగింది. అదే విధంగా విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణ, కొత్త స్తంభాల ఏర్పాటు చేపట్టారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలో పది రోజుల్లో 282ఖాళీ స్థలాలు, ప్రైవేట్‌ స్థలాల్లో ముళ్ల పొదల తొలగింపు, 18 పాడుపడిన బావుల గుర్తించి ఇప్పటివరకు 10 పాడుబడిన బావుల పూడ్చివేశారు. చెత్త చెదారాన్ని తొలగించడంతోపాటు 115 చెత్త వేసే ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా పరిగి మున్సిపాలిటీలోని ప్రధానమైన 5మురుగుకాల్వలను జేసీబీలతో శుభ్రం చేశారు. గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 20వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. డంపింగ్‌యార్డు ఏర్పాటుకుగాను స్థల సేకరణ, పరిగి మున్సిపాలిటీలో 15శ్మశానవాటికలుండగా రెండింటిలో దహనవాటికలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో భాగంగా 34విరిగిన స్తంభాలను గుర్తించిన అధికారులు ఇప్పటివరకు ఆరు స్తంభాలను ఏర్పాటు చేశారు. 125 వంగిపోయిన స్తంభాలను గుర్తించి ఇప్పటివరకు 15కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. 


తాండూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా వార్డుల్లో పారిశుధ్యం పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పదిరోజుల పట్టణ ప్రగతిలో 36 వార్డుల్లో మురుగు కాలువలు, చిలుక వాగు కాలువ పూడికతీత, తడి, పొడి చెత్తపై అవగాహన, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, పాత నిర్మాణాల కూల్చివేత, ముళ్ల పొదల తొలగించారు. రూ. 59.10లక్షల్లో రూ. 45లక్షలు ఖర్చు పెట్టగా మిగిలిన రూ. 14.10 లక్షలతో తాగునీటి కోసం చేతి పంపులు, పైపులు వేయడం, నర్సరీల ఏర్పాటు చేసి ప్రజలకు మొక్కలు అందించడం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలు, బ్రిడ్జి సుందరీకరణ, చిన్న చిన్న మురుగు కాలువల నిర్మాణాలను చేపట్టారు. తాండూరు మున్సిపాలిటీకి వచ్చిన నిధులు రూ. 59.10లక్షలను విడుదల చేయగా... రూ. 10లక్షలు పారిశుధ్య పనిముట్లు, రూ. 10లక్షలు లెబర్స్‌ చార్జీలు (వార్డుల్లో రోడ్లు ఉడ్చడం, మురుగు, ముళ్లపొదలు తీయుటకు), రూ. 5 లక్షలు బ్లీచింగ్‌ పౌడర్‌, లైనింగ్‌ పౌడర్‌, రూ.20 లక్షలు జేసీబీ, టాక్టర్లు (మురుగు, ముళ్ల పొదళ్ల శుభ్రతకు) ఖర్చు చేశారు. 


ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి కార్యక్రమం లో పట్టణాలు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తాయని, సుందరంగా మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం వికారాబాద్‌లోని జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్ల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి స్థానికం గా నెలకొన్న సమస్యలను గుర్తిస్తున్నారని అన్నారు. ఆ పాదయాత్రలో గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తు వెళ్లాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పట్టణాలను గ్రీన్‌సిటీలకు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. మరుగుదొడ్లు, షీ టాయిలెట్స్‌ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. వార్డులలో మురికి కాలువల పరిశుభ్రత, రోడ్ల ప్రక్కల పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి, వాటిని భ్రతికించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణా ప్రాంతాల్లో పల్లె  ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. దీంతో గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయన్నారు. అలాగే పట్టణప్రగతి కేవలం 10రోజులు అని కాకుండా నిరంతరం ప్రజలు భాగస్వాములై పరిసరాలను  శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 


వార్డుల్లో పర్యటించి...

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గల్లీల్లో పాదయాత్ర చేశారు. సమస్యలు తిష్టవేసి ఉన్న ప్రాంతాలకు నడిచివెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలి సి మూడు గంటల పాటు ఆమె బస్తీ బాట పట్టారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజూల, కలెక్టర్‌ పౌసుమి బసులతో కలిసి ఆమె పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు బస్తీల్లో తిరిగారు. మున్సిపల్‌ పరిధిలోని 15,17,19,34, 23 వార్డుల్లో పర్యటించారు. స్థానికులు మంత్రికి తమ సమస్యలను విన్నవించారు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే వాటిని బాగు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డుల్లో చెత్తబుట్టలు, చేతి సంచులు కాలనీవాసులకు పంపిణీ చేశారు. అనంతరం ఆలంపల్లిలోని దర్గా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజూల, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషద్‌బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo