శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 00:44:51

గ్రామాల వారీగా కందులు కొనుగోలు చేయాలి

గ్రామాల వారీగా కందులు కొనుగోలు చేయాలి

ధారూరు : మండలంలోని అన్ని గ్రామాల రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. ధారూరు మండల కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేసి, తూకాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్రానికి వచ్చిన ప్రతి రైతు నుంచి కందులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఒక రోజు ముందుగానే గ్రామాల వారీగా దండోర వేయించి రోజువారీగా రైతుల కందులను కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా సరైన విధంగా తూకాలు వేయాలని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను వెంటవెంటనే ప్రత్యేక వాహనాల్లో గోదాములకు తరలించాలని సూచించారు. ప్రతి రోజూ కందుల తూకాలను ఉదయం నుంచే ప్రారంభించాలని, నిత్యం 1500 బస్తాలకు తగ్గకుండా తూకం చేయాలని అన్నారు. తూకానికి ముందురోజే రైతులకు సంబంధిత అధికారులు టోకెన్లు అందజేస్తారన్నారు. వారి వెంట జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, ధారూరు మండల వ్యవసాయాధికారి జ్యోతి, విస్తీర్ణ అధికారి సంజీవ్‌రాథోడ్‌ ఉన్నారు. 
logo