శుక్రవారం 29 మే 2020
Vikarabad - Mar 04, 2020 , 00:44:51

‘రూర్బన్‌' పనులను పూర్తి చేయాలి

‘రూర్బన్‌' పనులను పూర్తి చేయాలి

తాండూరు రూరల్‌: రెండేండ్లు గడుస్తున్నా 60 శాతం అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం ఏంటని, నిధులు ఉన్నా అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం పై డీఆర్‌డీవో కృష్ణన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో రూర్బన్‌ పథకం కింద అల్లాపూర్‌(ఎస్‌) క్లస్టర్‌ పరిధిలోని పలు గ్రామాలకు కేటాయించిన  రూ.30 కోట్ల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా  కేటాయించిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరై రెండేండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మండలానికి మంజూరైన ఇండోర్‌ స్టేడియం, ఆడిటోరియం పనులు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా చిన్నచిన్న అభివృద్ధి పనుల్లో పురోగతిలేకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 కోట్ల నిధుల్లో ఇప్పటి వరకు రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశారన్నారు. అంగన్‌వాడీలకు, స్కూల్స్‌కు గ్యాస్‌ పంపిణీ చేయగా, 60 అంగన్‌వాడీ కేంద్రాల గ్యాస్‌ సిలెండర్‌తోపాటు స్టౌవ్‌లు పంపిణీ చేశారని అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ తెలిపారు. ఏజెన్సీ వారు కేవలం గ్యాస్‌ సిలెండర్లు ఇచ్చి, స్టౌవ్‌లు వెనక్కి తీసుకెళ్లారని అధికారుల దృష్టికి తెచ్చారు. అదేవిధంగా సోలార్‌, పాఠశాలల్లో బ్యాటరీలు పని చేయడంలేదని కొంత మంది సమావేశంలో ప్రస్తావించారు. అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో కృష్ణనన్‌  మాట్లాడారు. వచ్చే మూడు నెలల్లో రూర్బన్‌ పథకం కింద చేపట్టిన పెండింగ్‌ అభివృద్ధి పనులన్నీంటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. డీఈఈ, ఏఈలు ఇతర అధికారులతో సమీక్షలో సంబంధిత అధికారులు కొంత మంది మార్చి, మరి కొంత మంది ఏప్రిల్‌, మే ( మూడు నెలల్లో) అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పనులు చేసేందుకు ముందుకు రాని చోట మరోసారి టెండర్లు వేయిస్తామన్నారు. ప్రధానంగా రూ.2 కోట్లతో ఇండోర్‌ స్టేడియం, రూ.1.50 కోట్లతో ఆడిటోరియం పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులు కూడా వేగంగా చేయించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించామన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్ర శాలలు, మీ సేవ కేంద్రాల నిర్మాణాలు, సీసీ రోడ్లు, హెల్త్‌ సెంటర్ల నిర్మాణాలు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలుంటే రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలన్నారు.  పనుల్లో   నాణ్యత పాటించాలని, మరో సారి సమీక్ష నిర్వహించే నాటికి అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలన్నారు.  సమావేశంలో డీఈఈలు రాజు, వెంకట్‌రావు,  ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి   ఉన్నారు.  

నర్సరీల నిర్వహణపై పీడీ ఆగ్రహం

యాలాల:  నర్సరీల నిర్వహణ సక్రమంగా లేదని డీఆర్‌డీవో(ఇన్‌చార్జి)పీడీ కృష్ణన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని కోకట్‌, రాఘవాపూర్‌ నర్సరీలను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్‌ అతిథి గృహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మండల పరిషత్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణన్‌ మాట్లాడారు. నర్సరీల్లో ఏ ఒక్క గడ్డి పోచ కూడా ఉండకూడదన్నారు. కలుపు మొక్కలను ఎప్పటి కప్పుడు తీసివేసి నర్సరీలును శుభ్రంగా ఉంచాలన్నారు. మొక్కలకు రోజూ నీళ్లు పట్టాలని, ప్యాకెట్లలోని మట్టి ఆరకుండా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు.  ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో జనార్దన్‌, సూపరింటెండెంట్‌ భాగ్యవర్ధన్‌ పాల్గొన్నారు.


logo