శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Mar 02, 2020 , 23:46:53

లక్ష్యం దిశగా..

లక్ష్యం దిశగా..
  • గ్రామాల్లో పన్నుల వసూలు ప్రక్రియ వేగవంతం
  • నెలాఖరుతో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
  • రూ. 8.43 కోట్లు టార్గెట్‌.. ఇప్పటికి రూ. 5.89 కోట్లు వసూలు
  • పన్నుల చెల్లింపులో ముందంజలో బషీరాబాద్‌, పరిగి, కొడంగల్‌ మండలాలు
  • బకాయిలను వసూలు చేసి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం: డీపీవో రిజ్వానా

గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు ప్రక్రియ వేగం పుంజుకున్నది. ఈనెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అధికారులు టార్గెట్‌ను చేరే దిశగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అన్ని గ్రామాలకు కార్యదర్శులను నియమించిన దృష్ట్యా ఈఏడాది లక్ష్యం మేరకు వసూళ్లు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం రూ. 8.43 కోట్లు లక్ష్యంగా కాగా ఇప్పటివరకు 5.89 కోట్ల పన్నులు వసూలు చేశారు. మరో రూ. 2.53 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది రూ. 5.23 కోట్ల పన్నులు వసూలయ్యాయి. పన్నుల చెల్లింపులో బషీరాబాద్‌, పరిగి, కొడంగల్‌ మండలాలు ముందంజలో ఉండగా, తాండూరు, మోమిన్‌పేట, ధారూరు మండలాలు వెనుకబడ్డాయి. బకాయిలను వసూలు చేసి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా తెలిపారు. 

-వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ స్పీడందుకుంది. ఈనెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా పన్నుల వసూళ్లలో స్పీడ్‌ పెంచారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పన్నుల వసూలు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీకి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించిన దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ ప్రకారం పన్ను వసూళ్లు జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీ ఎన్నికలు, పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడంతో జనవరి వరకు పన్నుల వసూళ్లు జరుగలేదు, అయితే ఫిబ్రవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు ప్రక్రియలో వేగం పెంచారు. మరో 28 రోజులు మాత్రమే ఉండడంతో పెండింగ్‌లో ఉన్న పన్నుల బకాయిలను కూడా వసూలు చేయడంపై జిల్లా పంచాయతీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాకుండా పన్నుల వసూళ్లలో వెనుకబడిన మండలాల్లో ప్రక్రియ స్పీడందుకునేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు గతంలో ఎన్నడులేని విధంగా గ్రామ పంచాయతీల్లోని ప్రతి ఒక్కరూ పన్నుల చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.43 కోట్ల పన్నుల బకాయిలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.5.89 కోట్ల పన్నుల వసూలు పూర్తయింది. మరో రూ.2.53 కోట్ల పన్నుల బకాయిలను వసూలు చేయాల్సి ఉంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.23 కోట్ల పన్నుల వసూలు చేశారు. 


70 శాతం పన్నుల వసూలు పూర్తి...

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లకు సంబంధించి 70 శాతం పూర్తయింది. జిల్లాలో 565 గ్రామ పంచాయతీలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.43 కోట్ల పన్ను, పన్నేతర బకాయిలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు రూ.5.89 కోట్ల పన్నుల బకాయిలను వసూలు చేయగా, మరో రూ.2.53 కోట్ల పన్నుల బకాయిలు పెండింగ్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన పన్నుల బకాయిలకు సంబంధించి మొత్తం రూ.8.43 కోట్లుకాగా వీటిలో పన్ను బకాయిల లక్ష్యం రూ.7.72 కోట్లు, పన్నేతర బకాయిలు రూ.70.67 లక్షలుగా నిర్ణయించగా, ఇప్పటివరకు పన్ను(ఇంటి పన్ను) బకాయిలు రూ.5.52 కోట్లు, పన్నేతర(నీటి పన్ను, ఇంటి అనుమతి పన్ను, ఆస్తి మార్పిడి పన్ను, దుకాణ అనుమతి పన్ను తదితర పన్నులు) రూ.37.04 లక్షల బకాయిలను వసూలు చేశారు. అయితే పన్నుల వసూళ్లలో జిల్లాలోని బషీరాబాద్‌, పరిగి, కొడంగల్‌ మండలాలు ముందంజలో ఉండగా, తాండూరు, మోమిన్‌పేట, ధారూరు మండలాలు వెనుకంజలో ఉన్నాయి. అయితే ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పన్నుల బకాయిలు వసూలు చేసేందుకుగాను జిల్లా పంచాయతీ అధికారి చర్యలు చేపట్టారు. ఈనెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పన్ను బకాయిలను వసూలు చేసే విధంగా ముందుకెళ్తున్నారు. అయితే ఆయా మండలాల్లో వసూలు చేసిన పన్ను బకాయిలకు సంబంధించి... 


బషీరాబాద్‌ మండలంలో రూ.24.95 లక్షలకుగాను రూ.2.50 లక్షలు, పరిగి మండలంలో రూ.51.84 లక్షలకుగాను రూ.45. 69 లక్షలు, కొడంగల్‌ మండలంలో రూ.29.14 లక్షలకుగాను రూ.25.18 లక్షలు, నవాబుపేట మండలంలో రూ.46.37 లక్షలకుగాను రూ.37.05 లక్షలు, దోమ మండలంలో రూ.42.95 లక్షలకుగాను రూ.33.90 లక్షలు, బంట్వారంమండలంలో రూ.20.32 లక్షలకుగాను రూ.15.65 లక్షలు, వికారాబాద్‌ మండలంలో రూ.37.11 లక్షలకుగాను రూ.28.38 లక్షలు, దౌల్తాబాద్‌ మండలంలో రూ.29.81 లక్షలకుగాను రూ.22. 69 లక్షలు, పెద్దేముల్‌ మండలంలో రూ.43.58 లక్షలకుగాను రూ.32.36 లక్షలు, యాలాల మండలంలో రూ.49.42 లక్షలకుగాను రూ.36.68 లక్షలు, కులకచర్ల మండలంలో 68.36 లక్షలకుగాను రూ.50.12 లక్షలు, బొంరాసుపేట మండలంలో రూ.23.42 లక్షలకుగాను రూ. 17.07 లక్షలు, పూడూరు మండలంలో రూ.73.27 లక్షలకుగాను రూ.49.32 లక్షలు, కోట్‌పల్లి మండలంలో రూ.22.15 లక్షలకుగాను రూ.14.82 లక్షలు, మర్పల్లి మండలంలో రూ.45.80 లక్షలకుగాను రూ.30.47 లక్షలు, ధారూరు మండలంలో రూ.54.32 లక్షలకుగాను రూ.35.76 లక్షలు, మోమిన్‌పేట మండలంలో రూ.67.97 లక్షలకుగాను రూ.37.61 లక్షలు, తాండూరు మండలంలో 1.12 కోట్లకుగాను రూ.54.47 లక్షల పన్నుల బకాయిలను వసూలు చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో రూ.8.28 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.5.23 కోట్ల పన్నుల బకాయిలను వసూలు చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


100 శాతం వసూలు చేస్తాం..

- డీపీవో రిజ్వానా

వంద శాతం పన్నుల బకాయిలను వసూలు చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా తెలిపారు. మరో రూ.2.53 కోట్లు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయని, ఈనెలాఖరులోగా పెండింగ్‌లోని పన్నుల బకాయిలను కూడా వసూలు చేయడం పూర్తవుతుందన్నారు. పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రతి మండలానికి నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. మరోవైపు అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించిన దృష్ట్యా గతంలో ఎన్నడులేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల బకాయిలు వసూలు అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. 


logo