సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 02, 2020 , 23:43:07

అభివృద్ధిలో ముందుంచుతాం

అభివృద్ధిలో ముందుంచుతాం

నారాయణపేట, నమస్తేతెలంగాణ : వెనుకబడిన నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతామని, నారాయణపేట జిల్లా పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు హామీ ఇస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని ఈ సందర్భంగా అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018, పల్లె ప్రగతి కార్యక్రమాల నిరంతర అమలుపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని జీపీ శెట్టి ఫంక్షన్‌ హాల్‌ ఆవరణలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎక్సైజ్‌, జిల్లా ఇంచార్జి మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలన్నారు. గతంలో పాలమూరు జిల్లా ఏ విధంగా ఉండేది, నేడు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. పాలమూరు అంటేనే కరువు జిల్లాగా పేరుండేదని కానీ, నేడు ఆ పేరు లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.45వేల కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. గ్రామపంచాయతీల విషయానికి వస్తే సర్పంచ్‌లుగా గెలుపొందడం అదృష్టంగా భావించాలన్నారు. పంచాయతీకి వచ్చిన డబ్బులను గ్రామ పరిశుభ్రతకు, మొక్కలను పెంచేందుకు ఉపయోగించాలన్నారు. ఇక అభివృద్ధి పనులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.339 కోట్లను మంజూరు చేస్తుందని, వాటి ద్వారా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలను పెంచే బాధ్యత సర్పంచ్‌లు తీసుకోవాలని, ఒకవేళ నాటిన వాటిలో 85 శాతం మొక్కలు పెరగని పక్షంలో నూతన పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌లను పదవీ నుంచి తొలగిస్తామన్నారు. గ్రామాల్లో చదివిన పూర్వ విద్యార్థులను కమిటీగా ఏర్పాటు చేసుకొని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరాలన్నారు.  గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే సర్పంచ్‌లు, అధికారులను సస్పెండ్‌ చేయాలని ఈ విషయంలో తాము కాని, ఎమ్మెల్యేలుకాని జోక్యం చేసుకోరని, కలెక్టర్‌కు పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయన్నారు. గ్రామాల్లో గతంలో అవినీతికి ఆస్కారం ఉండేదని, నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదన్నారు. 

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్‌ భావించాడని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018, పల్లె ప్రగతి కార్యక్రమాల నిరంత అమలుపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ వ్యవస్థ బాగుపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన సీఎం కేసీఆర్‌ ముందుగా గ్రామాల్లో కార్యదర్శుల పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. సర్పంచ్‌లకు ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లకు గ్రామాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు జరిగింది, ఎలాంటి పనులు చేపట్టాలనే విషయాలు తెలుసుకోవాలని సూచించారు. త్వరలో మరోమారు సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశంలో ఏ సర్పంచ్‌ను అడిగినా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలు చెప్పే విధంగా అవగాహన ఉంచుకోవాలన్నారు.   కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయచంద్రకాంత్‌, వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌, ఏఎంసీ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


logo