బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Mar 01, 2020 , 23:31:22

నాపరాళ్ల అక్రమ దందా..

నాపరాళ్ల అక్రమ దందా..
  • గనుల్లో 50 అక్రమ తవ్వకాలే..
  • కరిగిపోతున్న మైనింగ్‌ సంపద
  • ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.10కోట్ల గండి
  • తాండూరు మండలంలో 500కు పైగా క్వారీలు
  • లీజు గడువు ముగిసినవి రెండొందలకు పైనే..
  • పట్టించుకోని మైనింగ్‌ శాఖ అధికారులు

తాండూరు నియోజకవర్గంలో  గనుల తవ్వకాలు, తరలింపు ఇష్టారాజ్యంగా మారింది. వ్యాపారులు నిబంధనలను తుంగలో   అక్రమార్జనకు తెగబడుతున్నారు. డ్రౌక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ  ప్రభుత్వానికి రాయల్టీ ఫీజు చెల్లించి  వెలికి తీసి  కానీ.. అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోవడంలేదు. 

 ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.10కోట్ల వరకు గండి పడుతున్నట్లు సమాచారం. ఒక్క తాండూరు మండలంలోనే 500కు పైగా క్వారీలు ఉండగా.. సుమారు రెండొందలకు పైగా క్వారీలకు లీజు అనుమతి గడువు ముగిసినట్లు తెలిసింది. కొన్నింటికి అసలు అనుమతులే  పరిస్థితి. విలువైన సంపద తరలిపోతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

- తాండూరు, నమస్తే తెలంగాణ


తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో నాపరాతి గనుల తవ్వకాలు, తరలింపు ఇష్టారాజ్యంగా మారింది. సర్కార్‌ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యాపారులు అక్రమార్జనకు తెగబడుతున్నారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 4వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో నాపరాళ్ల గనులు నిక్షిప్తమయ్యాయి. ఈ నాపరాళ్ల గనులన్ని బడాబాబులు, పెత్తందార్లు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. సర్కార్‌ భూముల్లో యథేచ్ఛగా నాపరాళ్లను వెలికి తీసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. మైన్స్‌ శాఖ అధికారులు చూసిచూడనట్ల వ్యవహరించడంతో అక్రమ నాపరాతి వ్యాపారానికి అడ్డుకట్టు లేకపోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు నాపరాతిని అమ్ముకొని ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. రాయల్టీని పరిశీలించేందు తాండూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాలుగు చెక్‌ పోస్టుల దగ్గర సిబ్బంది రూ. 300 నుంచి రూ. 600 మాములు వసూలు చేస్తు రాయల్టీ లేకున్న లారీలను వదిలి పెడుతున్నారు. 


ఎన్‌వోసీ లేకుండానే తవ్వకాలు...

ముఫ్పై సంవత్సరాలకు పైగా తాండూరు నియోజకవర్గంలో నాపరాళ్ల వెలికి తీత కొనసాగుతోంది. అయితే ఈ నాపరాళ్ల గనుల ద్వారా నియోజకవర్గంలోని పేదలు ఏ మాత్రం ప్రయోజనం పొందలేకపోతున్నారు. బషీరాబాద్‌ మండలం కొర్విచేడ్‌, మాసన్‌పల్లి, జీవన్గి, క్యాద్గీరా, ఎక్మాయి, తాండూరు మండలం సిరిగిరిపేట, కరన్‌కోట, ఓగీపూర్‌, మల్కాపూర్‌, కోటబాసుపల్లి గ్రామాల పరిధిలో అపారంగా నాపరాళ్లగనులు విస్తరించి ఉన్నాయి. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) పొంది లీజు అనుమతులు తీసుకున్న అనంతరం నిర్ణీత స్థలాలకు నాపరాళ్లను తరలించేందుకు ప్రభుత్వానికి రాయల్టీ ఫీజులు చెల్లిస్తూ నాపరాళ్లను వెలికి తీస్తూ తరలించాలి. కానీ తాండూరు నియోజకవర్గంలో సగానికిపైగా గనులకు నిబంధనల ప్రకారం ఉండవలసిన అనుమతులు ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు మండలంలో 500కు పైగా నాపరాళ్ల క్వారీలుండగా వీటిలో కనీసం 200వరకు క్వారీల్లో లీజు అనుమతుల గడువు పూర్తి కాగా మరికొన్నింటికీ ఆసలుకే అనుమతులు లేనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నాపరాళ్ల క్వారీ సొసైటీ ఉన్నప్పటికీ వాటిలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సొసైటీ పెద్దలుగా చలామణి అవుతున్న వ్యక్తులు విలువైన ప్రభుత్వ భూములను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సర్కార్‌ దక్కవలసిన ఆదాయాన్ని పెద్దలు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది.


ప్రభుత్వ ఆదాయానికి గండి... 

అక్రమ గనుల వ్యవహరం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతోంది. లీజు, రాయల్టీ రూపేణా సమకూరవలసిన ఆదాయానికి కూడా బడాబాబులు ఎసరు పెడుతున్నారు. తవ్వకాల లోతును బట్టి రాయల్టీని చెల్లించవలసి ఉంటుంది. అలాగే లీజు పన్నుల రూపేణా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. నాపరాళ్లను వెలికి తీసే ముందు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ ద్వారా అనుమతులు పొందాలి. ఇందుకు లీజు అనుమతులకు కలెక్టర్‌ ద్వారా ఎన్‌ఓసీ సర్టిఫికెటు పొందిన తరువాత రాయల్టీ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతులిచ్చే ముందు మైనింగ్‌ శాఖ అధికారులు స్థలాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని సవ్యంగా ఉంటేనే లీజు అనుమతులను ఓకే చేస్తారు. అయితే యజమానులు నిబంధలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో గౌతాపూర్‌, లక్ష్మినారాయణపూర్‌ చౌరాస్తా, విలేమూన్‌ సమీపంలో, ఖాంజాపూర్‌ గేటు సమీపంలో 4చోట్ల రాయల్టీని పరిశీలించేందుకు మైన్స్‌ శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బంది ప్రతి లారీని పరిశీలించి రాయల్టీ చూసి పంపాల్సి ఉంటుంది. ఒక లారీలో 20టన్నుల లోడ్‌కు రూ. 1900 రాయల్టీ ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. కానీ రాయాల్టీ ఎవరు కట్టకుండా లారీల నిర్వాహకులు ప్రతి లారీకి చెక్‌ పోస్టు దగ్గర రూ. 300చెల్లించి నేరుగా ఇతర ప్రాంతాలకు రాతిని తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రోజు లక్షల రూపాలు నష్టం వాటిల్లుతోంది. 


అక్రమ గనులపై చర్యలు శూన్యం...

తాండూరు, బషీరాబాద్‌ మండలాల పరిధిలో నాపరాళ్ల అక్రమ గనుల్లో అక్రమ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. దీంతో బడాబాబుల దౌర్జన్యం మరింత పెరిగి ప్రభుత్వ భూముల్లో ఎలాంటి లీజు అనుమతులు లేకుండానే నాపరాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. తాండూరు మండలం ఓగీపూర్‌ సర్వే నెంబరు 129, మల్కాపూర్‌ సర్వే నెంబర్‌ 15, కోట్‌ బాసుపల్లి సర్వేనంబర్‌ 116లో అక్రమంగా విలువైన నాపరాళ్ల తవ్వకాలను భారీ ఎత్తున కొనసాగించారు. అదే విధంగా బషీరాబాద్‌ మండల పరిధిలోని పలు గ్రామాల్లోని నాపరాళ్ల గనుల్లో కూడ అక్రమ దందానే నడుస్తొంది. కొంత కాలంగా తవ్వకాలను నిలిపిన వ్యాపారులు ఇటీవల మళ్లీ జోరుగా అక్రమ తవ్వకాలను చేపట్టారు. దీంతో విలువైన నాపరాళ్ల సంపద కరిగిపోతోంది. ఎలాంటి లీజు అనుమతులు లేకుండానే నాప రాళ్లను తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీ గండి పడుతోంది. ఈ అక్రమ గనులవల్ల ఏటా ప్రభుత్వానికి కనీసం రూ. 10కోట్ల ఆదాయానికి నష్టం వాటిల్లుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తూతూ మంత్రంగా అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా కొనసాగుతన్న గనులకు నోటీసులు ఇచ్చి విద్యుత్‌ కట్‌చేసి మోటర్లు తీసుకువచ్చినా.. అక్రమాలకు అలవాటు పడిన వ్యాపారులు గనుల తవ్వకాలను నిలపకపోవడం గమనర్హం. అధికారుల చేతి వాటం ఉండడంతోనే దర్జాగా వ్యాపారులు అక్రమ త్రవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


భూముల ధరలకు రెక్కలు..

తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌, మాసన్‌పల్లి, జీవన్గి, క్యాద్గీరా, ఎక్మాయి, తాండూరు మండలం సిరిగిరిపేట, కరన్‌కోట, ఓగీపూర్‌, మల్కాపూర్‌, కోటబాసుపల్లి తదితర గ్రామాల పరిధిలోని నాపరాళ్ల గనులకు మంచి విలువ ఉండడంతో గనులున్న భూములకు ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఎకరానికి రూ. 30 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది. ఈ భూములను కొనుగోలు చేసి కొన్నాళ్లకు తిరిగి విక్రయించి లాభాలు గడిస్తుంటే మరికొందరు నాపరాళ్లను విక్రయించి లాభం పొందుతున్నారు. అయితే నాపరాళ్లకు ఉన్న డిమాండును దృష్టిలో వుంచుకొని కొందరు వ్యాపారులు కబ్జా పరమైన ప్రభుత్వ భూములను కూడా కొనుగోలు చేస్తున్నారు. 40 అడుగుల లోతు నుంచి 50అడుగుల లోతు వరకు నాపరాళ్లు లభిస్తుండడంతో కోట్ల విలువైన నాపరాళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో పెట్టుబడులతో సమానంగా ఆదాయం వస్తుండడంతో వ్యాపారులు కూడా పెట్టుబడులు పెట్టెందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరానికి కోట్లల్లో లాభాలు వస్తుండడంతో వ్యాపారులు నాపరాళ్ల పరిశ్రమ పట్ల ఆకర్శితులవుతున్నారు. ఎక్కువగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చి వ్యాపారాలు సాగిస్తుండడం గమనార్హం.


చర్యలు తీసుకుంటాం..

తాండూరు నియోజకవర్గం లో అనుమతులు లేకుండా నాపరాతిని వెలికితీస్తున్న పలువురికి నోటీసులు అందజేసి అక్కడ విద్యుత్‌ను తొలగిం చడం జరిగింది. అందుకు తాం డూరు నియోజకవర్గంలో మైన్స్‌శాఖ ఆధ్వర్యంలో (గౌతాపూర్‌, లక్ష్మీనారాయణపూర్‌ చౌరాస్తా, పెద్దెముల్‌ మార్గంలోని వైట్‌ ప్యాలస్‌ సమీపంలో, హైదరాబాద్‌ రోడ్‌ ఖాంజాపూర్‌ మార్గంలో) నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాము. లారీలను పరిశీలించి రాయల్టీ చూస్తున్నాము. రాయల్టీ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. అక్రమ తవ్వకాలు చేపట్టిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరిస్తాం. 

- డి. రవి మైన్స్‌ ఏడీ తాండూరు


logo