సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Mar 01, 2020 , 00:11:06

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి
  • ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి
  • తడి,పొడి చెత్తను వేరు చేయాలి
  • అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
  • వికారాబాద్‌ మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్‌ పరిధిలోని 13, 14, 22, 8, 7వ వార్డుల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, రోడ్లపై చెత్త వేయొద్దని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్‌ కార్మికులకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలను పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందని తెలిపారు. పరిశుభ్రంగా ఉంచితేనే ఆ నిధులు వినియోగించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ ఆలంపల్లిలోని ఎస్సీ వాడలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను తొలగించి వాటి స్థానంలో పార్కు నిర్మాణాలు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే మరో పార్కు స్థలంలో అక్రమంగా మున్సిపల్‌ అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణ పనులను చేపట్టడంపై కలెక్టర్‌ మున్సిపల్‌ సిబ్బందిపై మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదన్నారు. 


అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను నిలిపివేసి వెంటనే పార్కు నిర్మాణం చేపట్టాలన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను సరిచేయాలని, కల్వర్టులు, మురికి కాలువలు వంటి పనులను వెంటనే ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్లు, వెయిటింగ్‌ హాల్‌ వంటి సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టెండర్లు పూర్తయిన పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ శివారెడ్డిపేట్‌ చెరువును పరిశీలించారు. చెరువు సమీపంలో మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేసేందుకు, పార్కు నిర్మాణ పనులపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలంపల్లిలో మురికినీరు శుద్ధీకరణ ప్లాంటు ను పరిశీలించారు. ప్లాంటు పనిచేసే విధానాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంటు సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఎక్కువ మొత్తంలో మొక్క లు నాటాలని, కూరగాయలు పండించాలని సూచించారు.  కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్మన్‌ మంజూల రమేశ్‌, కౌన్సిలర్లు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo