శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 29, 2020 , 00:32:09

పట్టణ ప్రగతి జోరుగా..

పట్టణ ప్రగతి జోరుగా..
  • మున్సిపాలిటీల్లో పనులు
  • వార్డుల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటన
  • సమస్యలు గుర్తించి, పరిష్కారానికి ప్రణాళికలు
  • ఆయా మున్సిపాలిటీల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు

మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమం  జోరుగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. శుక్రవారం వికారాబాద్‌ మున్సిపాలిటీలోని పలు  స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీలో  పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి  అలాగే, తాండూరులో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, పరిగి మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పాల్గొన్నారు.


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి కార్యాక్రమాల్లో భాగంగా మౌలిక వసతుల మెరుగు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మున్సిపాలిటీ పాలకవర్గానికి సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల పర్యటించారు. గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, రిక్షా కాలనీ, బుడగజంగం కాలనీ, మారుతినగర్‌, ఎన్నెపల్లి కాలనీల్లో పర్యటించి  సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడి పని చేసి వికారాబాద్‌ మున్సిపాలిటీని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దేలా పని చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సాగాలని, ప్రజలు సైతం మమేకమై పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. వార్డుల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాభివృద్ధికి పాటుపడాలని కాలనీ వాసులకు సూచించారు.   ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ బాధ్యతయుతంగా వ్యవహరించినప్పుడే పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయన్నారు. కాలనీల్లో చెత్త చెదారం పేరుకుపోకుండా కౌన్సిలర్లతో పాటు కాలనీవాసులు బాధ్యత వహించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలిగించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. 


పార్కింగ్‌ స్థలాలను గుర్తించి అక్రమణకు గురికాకుండా బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యంపై అధికారులు శ్రద్ధ వహించి విధిగా బ్లీచింగ్‌ ఫౌడర్‌, దోమల నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పనుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఆర్డీవోను ఆదేశించారు. అదే విధంగా వికారాబాద్‌ బస్‌ డిపోను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు పరిశీలించారు. డిపో ఆవరణలో చెత్త చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపో మేనేజర్‌కు సూచించారు. సమయానుగుణంగా బస్సులు నడిపించేలా చూడాలని, పరిగి నుంచి వికారాబాద్‌కు ఉదయం 5:30 గంటల నుంచే బస్సులు నడపాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. అనంతరం  స్థానిక హర్టికల్చర్‌ కేంద్రంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. వివిధ రకాల మొక్కలను పెంచాలని, పార్కు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, తహసీల్దార్‌ రవీందర్‌, మున్సిపల్‌ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo