సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:52:12

కొనుగోలు కేంద్రాలకు భారీగా కందులు

కొనుగోలు కేంద్రాలకు భారీగా కందులు
  • ఆన్‌లైన్‌లో పేరు లేకున్నా అధికారుల సంతకంతో కొనుగోళ్లు
  • సడలిన నిబంధనలతో కొనుగోలు కేంద్రాలకు భారీగా కందులు
  • పరిమితి తొలగించాలంటున్న రైతులు
  • 15రోజుల్లోపు రైతు ఖాతాల్లో డబ్బులు

తాండూరు, నమస్తే తెలంగాణ : కందుల కొనుగోళ్లపై ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుల కొనుగోళ్లపై ఆన్‌లైన్‌లో పేరు లేకున్న వీఆర్వో, ఏఈవో, ఏవో అనుమతితో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో డీసీఎంఎస్‌ ద్వారా రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన తాండూ రు మార్క్‌ఫెడ్‌ కేంద్రానికి కందులు భారీగా వస్తున్నాయి. ఒక్కొ రైతు నుంచి పది కి్ంవటాళ్లు మాత్రమే పరిమితి విధించడంతో ఎక్కువ భూమి ఉన్న రైతులకు కాస్త ఇబ్బందులు తెలత్తుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రతి రైతు నుంచి ఒక ఎకరాకు ఖచ్చితంగా 5 క్వింటాళ్ల కందులు తీసుకుంటే రైతులకు మేలు జరిగేదని రైతులు అంటున్నారు.

విక్రయానికి భారీగా వస్తున్న కందులు..

ఆన్‌లైన్‌లో చాలమంది రైతుల పేర్లు లేకపోవడంతో నెల రోజుల పాటు కందుల విక్రయాల కోసం వేచి చూస్తున్న రైతులకు కొంత ఊరట కలిగింది.  ప్రసుత్తం ఆన్‌లైన్‌లో పేరు లేకున్న అధికారులు పట్టా పాసుపుస్తకంపై రైతు తన సొంత పొలంలోనే కందులు పండించాడని రాసివ్వడంతో కేంద్రంలో రైతులకు మద్ధతు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నారు. కందులు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో రైతులు తాము పండించిన కందులను కొనుగోలు కేంద్రంలో అమ్మడానికి భారులు తీరారు. దీంతో జనవరి 5నుంచి ఇప్పటి వరకు తాండూరు కేంద్రంలో 15వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాలకు రైతులు కందులను మద్ధతు ధర కేంద్రానికి జోరుగా తీసుకువస్తున్నట్లు సమాచారం. 

మద్దతు ధర కేంద్రంలో క్వింటాళుకు రూ. 5800

రైతులకు మద్దతు ధరను క్వింటాళుకు నాఫేడ్‌, మార్క్‌ఫేడ్‌ వారు రూ. 5800ను కేటాయించారు. రైతులకు వ్యాపార సముదాయాల్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో కందుల కొనుగోలు కేంద్రాల వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రారంభంలో ప్రతి రైతు నుంచి ఎకరానికి 2.5 క్వింటా ళ్లు కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దీంతో రైతులకు ఇబ్బంది కలుగడంతో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులను కలిసి ప్రతి రైతు నుంచి ఒక ఎకరాకు కచ్చితంగా 5క్వింటాళ్లు తీసుకోవాలని కోరుతు వినతి పత్రం అందజేయడంతో ప్రభుత్వ సహకారంతో ఎకరానికి 5క్వింటాళ్లు తీసుకోవడం జరిగింది. తాజా గా ఒక రైతు దగ్గర ఎంతభూమి ఉన్నప్పటికీ కేవలం 10 క్వింటా ళ్ల కందులు మాత్రమే తీసుకుంటామని అధికారులు తెలుపడం తో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. 

తగ్గిన దిగుబడులు...

గతంతో పోలిస్తే తాండూరు వ్యవసాయ మార్కెట్‌తో పాటు ఇతర కందుల కొనుగోలు కేంద్రాలకు ఈ ఏడాది 25నుంచి 30శాతం ఉత్పత్తుల రాక తగ్గముఖం పట్టడం గమనార్హం. గతే డాది క్రితం వరకు నియోజకవర్గంలో కనీసం 30నుంచి 40వేల హెక్టార్లలో కంది పంటను సాగు చేసిన రైతులు ఈ ఏడాది 20 నుంచి 25వేల హెక్టార్లలోనే కంది సాగు చేసినట్లు సమాచారం. సకాలంలో వర్షాలు కురవక పంట సాగు తగ్గిందన్నారు.


కందుల విక్రయానికి అనుమతులు 

తాండూరు రూరల్‌ : రైతుల వద్ద నిల్వ ఉన్న కందుల ను డీసీఎంఎస్‌లో విక్రయించుకునేందుకు గురువారం తాండూరు ఏడీఏ కార్యాలయంలో వ్యవసాయాధికారు లు అనుమతులు రాసి ఇచ్చారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ లో పేర్లు ఉన్న రైతుల వద్ద నుంచే డీసీఎంఎస్‌ అధికారులు కందులను కొనుగోలు చేసే వారు. రైతుల వద్ద నిల్వ ఉన్న కందులను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ కారణంగా గతంలో కందు లు సగం కూడా అమ్ముడు పోలేదు. ఇంకా సగం కంటే ఎక్కువగానే రైతుల వద్ద కందులు నిల్వ ఉన్నాయి. రైతుల వద్ద నిల్వ ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. రైతులు నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు తీసుకొచ్చి కందు లు విక్రయించేందుకు వ్యవసాయాధికారులకు చూయి స్తే డీసీఎంఎస్‌ అధికారులకు లేఖ రాస్తున్నారు. దీని ద్వారా రైతులు కందులను డీసీఎంఎస్‌లో విక్రయించుకొచ్చు. వ్యవసాయాధికారులు రాసి ఇచ్చిన లేఖను డీసీఎంఎస్‌ అధికారులకు చూయిస్తే కందులు కొనుగోలు చేస్తారు.లిస్టులో పేరులేకున్నా కొనడం సంతోషం

నా సొంత భూమిలో పండించిన కందులను తాండూరులో కొనుగోలు కేంద్రానికి అమ్మడానికి తీసుకుపోతే లిస్టులో పేరు లేదని కొనలేదు. బయట అమ్ముదామనుకుంటే కళ్లముందు చూస్తూండగానే క్వింటాలుకు రూ. 800 నుంచి రూ. 1400 తక్కువగా ధర పలుకుతుంది. దీంతో రైతుల మొర విన్న ప్రభు త్వం ఆన్‌లైన్‌లో పేరు లేకున్న వ్యవసాయశాఖ అధికారుల సంతకంతో కందులు తీసుకోవడం సంతోషంగా ఉంది. తూకం చేసేప్పుడు అమాలీలు కందులు ఎక్కువగా కింద పారబోయకుండా చూడాలి. సీసీ కెమరాల నిఘాలో తూకాలు చేస్తే బాగుంటుంది. 

- మొగులప్ప బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌


షరతులు లేకుండా కందులు కొనాలి

ఆన్‌లైన్‌లో పేరు లేకపోయిన కందులు తీసుకోవడం బాగుం ది. ఒక్కొ రైతు నుంచి పది క్వింటాళ్లు విక్రయానికే పరిమితి విధించడం బాధకరం. షరతులు లేకుండా రైతుల నుంచి కందు లు తీసుకోవాలి. రైతుల కోసం అన్ని చేస్తున్న ప్రభుత్వం మద్ధతు ధర కొనుగోలు కేంద్రంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదేశాలు జారీ చేస్తే బాగుంటది. ఏదేమైన ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం చేస్తున్న సహాయం బాగుంది. క్వింటాలుకు రూ. 5800 ఇవ్వడం సంతోషం.

- కృష్ణ, సంగెంకలాన్‌


15వేల క్వింటాళ్ల కొనుగోళ్లు

జనవరి 5నుంచి తాండూరు డీసీఎంఎస్‌లో ప్రారంభమైన కందుల కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 15వేల క్వింటాళ్ల కందులు కొనుగోళ్లు చేశాం. తాజా నిబంధనల ప్రకారం ప్రతి రైతు నుంచి 10క్వింటాళ్ల కందులు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా 15రోజుల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పంట పండిన భూమి పాసు పుస్తకాల ఆధారంగా అధికారుల సంతకం చూసి కొనుగోలు చేస్తున్నాం. 

- మహ్మద్‌ షరీఫ్‌, తాండూరు డీసీఎంఎస్‌ మేనేజర్‌


logo