బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:48:59

ధ్వజారోహణం.. దేవతాహ్వానం

ధ్వజారోహణం.. దేవతాహ్వానం

సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం... తనువు, మనసు పులకించిపోతుండగా దేవదేవుడి వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతాహ్వానం, భేరీపూజలను యాదాద్రిలో గురువారం సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పదకొండు రోజులపాటు జరుగనున్న యాదాద్రి నర్సన్న జాతరలో శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్మంతున్ని ఆహ్వానించి, సకల దేవతలకు యాదాద్రి నర్సన్న శుక్రవారం పెండ్లి కొడుకు అవుతున్నాడని సబ్బండ బంధుగణంతో 33 కోట్ల దేవతలు తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును వేదపండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేసి పలురకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

  • దేవేరులకు గరుత్మంతునితో ఆహ్వానం
  • పట్టు పీతాంబరాలు...వజ్రవైఢూర్యాలు ధరించి కొలువుదీరిన దేవతామూర్తులు
  • నేడు పెండ్లి కొడుకు కానున్న యాదాద్రి నారసింహుడు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ధ్వజారోహణం.. దేవతాహ్వానం.. భేరీపూజలు గురువారం యాదాద్రిలో వైభవంగా నిర్వహించారు.   శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్ముంతున్ని ఆహ్వానించి సకల దేవతలకు యాదాద్రి నారసింహుడు శుక్రవారం పెండ్లి కొడుకు అవుతున్నాడని సబ్బండ బంధుగణంతో 33 కోట్ల దేవతలు తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు ఆధ్వర్యంలోని వేదపండితులు, అర్చకులు, పారాయణికులు వేదమంత్రోచ్ఛారణ మధ్య ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేసి పలురకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, ఆలయ అర్చకుల వేదమంత్రాలు, ఉపనిషత్తుల పారాయణాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.పంచనారసింహుడు.. యాదాద్రీశుడు 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ :యాదరుషి తపస్సుకు మెచ్చిన లక్ష్మీనరసింహస్వామి..యాదాద్రి క్షేత్రములో పంచ రూపాలతో దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. పంచరూపాలు ధరించడంలో ప్రత్యేకతలను వివరిస్తూ స్కాంద, బ్రహ్మండాది పురాణాలు అనేక విధాలుగా వర్ణించాయి. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచతిన్మాత్రలు, పంచ తత్తములు, అంతర్లీనములై  స్వామి వారిలో ఉంటాయని పేర్కొన్నాయి. హిరణ్యకశ్యపుని వధ సమయంలోస్వామి వారు సుమారు 72 రూపాలను ధరించి.. హిరణ్యకశ్యపుడు దాల్చిన 72 విషతత్తములను సంహరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిలో యాదాద్రి క్షేత్రంలోని పంచ రూపాలు మహోన్నత ప్రత్యేకతను తెలియజేస్తాయి.

జ్వాలా నృసింహుడు..

భయంకర ఆకృతి దాల్చి హిరణ్యకశ్యపుడు చీకట్లో అంతర్లీనుడైతే.. స్వామి వారు జ్వాలా నరసింహునిగా సర్పకారంలో ఆవిర్భవించి తన వెలుగు ద్వారా హిరణ్యకశ్యపుని తమోమయ శరీరమును నాశనం చేశారు. సర్పాకృతిలో స్వామి దర్శనమివ్వడం, తనను దర్శించిన వారికి దృష్టశక్తుల పీడ ఉండదని అనుగ్రహించడం విశేషం. 

యోగానందనారసింహస్వామి..

 యోగసాధన మహర్షులకు దర్శింపచేస్తూ బాహ్యస్మృతిని వదిలి అంతరంగిక శుద్ధిని తెలియజేస్తుంది. హిరణ్యకశ్యపుడిలోని అంతరంగిక మాలిన్యం తొలగించి యోగసాధనలో చిత్తవృత్తిని భగవదర్పణ చేసే వైనాన్ని యోగాభ్యాసంతోనే ఆయనలోని దుష్ట శక్తిని తొలగించించారు.

గండభేరుండ స్వామి..

హిరణ్యకశ్యపుడు స్వామి వారితో యుద్ధం చేసే సమయంలో దిక్కుతోచని స్థితిలో భయంకర విషసర్పాల రూపం దాల్చిన సమయంలో స్వామి వారు లోక రక్షణార్థం గండభేరుండ పక్షి రూపంలో అతడిని సంహరించారు. ఆ పక్షి రెక్కల్లో ఒకటి జ్ఞానమును, రెండోది కర్మనుష్టానాన్ని సూచిజస్తుందని ప్రతీతి. అందుకే యాదాద్రి క్షేత్రంలో భక్తకోటి ‘గండదీప’ మొక్కుల ద్వారా తమ దోషాలను తొలగించుకుంటున్నారని యాదగిరి క్షేత్ర మహత్యం తెలియజేస్తుంది.  

ఉగ్రనరసింహస్వామి..

 హిరణ్యకశ్యపుడి సంహరించే సమయం లో..  శ్రీహరి నరహరిగా ఉగ్రస్తంభం నుం చి వెలువడి హిరణ్యకశ్యపుడిని వధించే సన్నివేశాన్ని ఈ ఉగ్ర ఆకృతిలో దర్శించవచ్చు. ఆ భయంకర ఆకృతిలో దర్శనమిచ్చిన స్వామిని..  గిరినంతా ఆశ్రయించి  ఉన్నతిని పొందింప చేయమని యాదరుషి కోరగా స్వామి వారు  కొండపై  సుదర్శన చక్రరూపంలో సమ స్త భూత, ప్రేత, పిశాచాది బాధలను తొలగిస్తున్నాడని ప్రతీతి.

లక్ష్మీనరసింహస్వామి..

 శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిగా యాదాద్రి క్షేత్రంలో భక్తకోటికి కొంగు బంగారమై ఆశ్రిత రక్షకుడై సర్వసంపదలను ఇస్తున్నా రు. ఆపదలో ఉన్న వారిని  సర్వదా రక్షిస్తూ ఉన్న రూపమే శ్రీ లక్ష్మీనృసింహస్వామి.  భక్తుల ఇబ్బందులు తొలగించి రక్షించడం యాదాద్రి క్షేత్రములోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకత.

గరుత్మంతున్ని ఆహ్వానిస్తూ..

ఉత్సవమూర్తులను బాలాలయంలోని ధ్వజ స్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేసి ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభానికి తెల్లని వస్త్రంపై గరుత్మంతుని చిత్రపటం కుంకుమతో వేసి, ఆ వస్ర్తానికి షోడషోపోచరాలు చేశారు. ధ్వజస్తంభానికి దర్పలతో తయారుచేసిన తాడుతో గరుత్మంతుని చిత్రపట వస్ర్తాన్ని కట్టారు. ధూపదీప నైవేద్యాలు చేసి గరుడముద్దలను ఎగురవేశారు. గరుడముద్దలను అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు.  యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు గరుడిని ఆహ్వానిస్తూ పాడిన వేదోక్తమైన భక్తిగీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కోటి సూర్యతేజస్సుతో..

గరుత్మంతుని ఆహ్వానించడం ద్వారా.. సకలదేవకోటి ఉత్సవ తంతులో భాగస్వామ్యం తీసుకోవాలని గరుత్మంతుని వేడుకున్నారు. గరుత్మంతుని వైభవం గురించి కొనియాడుతూ మంత్రోచ్చారణలతో నిర్వహించే ఘట్టమే ధ్వజారోహణం.  కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ అళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించారు.

  కోలాహలంగా పారాయణాలు..

రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణు సహస్రనామ, పారాయణాలను రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు 60 మంది రుత్వికులు తమ స్వరాలతో శ్రీవారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారికి రుత్వికులు చేసే జపాలు, పారాయణాలు ధారపోయడం ద్వారా లక్ష్మీనృసింహుడికి శక్తిపెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 

మూలమంత్రాలతో హవనం...

బ్రహ్మత్సవాలలో స్వామి, అమ్మవారలకు ఎదురుగా అగ్ని ప్రతిష్ఠ చేసి, ఆ అగ్నిలో పంచ పల్లవాలు (రాగి, మేడి, జువ్వి, మోదుగ, మామిడి) చెట్ల కర్రలతో హోమాన్ని వెలిగించారు. అందులో నారాయణ, లక్ష్మి, సుదర్శన, నారసింహ, ఆంజనేయ, గరుడ మొదలైన మూలమంత్రాలతో హవనం చేశారు.

లఘుపూర్ణాహుతి 

   శ్రీవారి ఉత్సవాల్లో పంచసూక్త పఠనాన్ని జరిపారు. మూలమంత్ర నిత్యహవన సంబంధిత సూక్తములతో హవిస్సును సమర్పించారు. లఘుపూర్ణాహుతిని నిర్వహించారు. మహామంత్ర పుష్పపఠనం చేశారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. 

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య పూజలు 

 షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయప్రధాన అర్చకులు అర్చక బృందం ఆశీర్వచనం జరిపారు.

ఉచిత దంత వైద్యశిబిరం...

 బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రి కొండపైన  భువనగిరికి చెందిన డాక్టర్‌ మంచాల నవీన్‌కుమార్‌  ఉచిత దంత వైద్య శిబిరంలో సేవలు అందించారు.  ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులు, స్థానికులకు చికిత్స చేశారు. భువనగిరికి చెందిన డాక్టర్‌ మంచాల మాధురి హోమియో వైద్య శిబిరం కూడా నిర్వహించారు. సుమారు రెండు వందల మంది పాల్గొని వైద్యసలహాలు పొందారు. ఆలయ ఈవో ఎన్‌. గీత శిబిరాన్ని ప్రారంభించారు. యాదాద్రి ఆలయ వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. 


logo