సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:48:03

హైనా దాడిలో లేగదూడ మృతి

హైనా దాడిలో లేగదూడ మృతి
  • 15 రోజుల వ్యవధిలో నాలుగు జంతువులపై దాడి
  • భయాందోళనలో రైతులు

దోమ: హైనా దాడిలో లేగదూడ మృతి చెందింది. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్‌  శివారులో రైతు నీరటి వెంకటయ్య పంట పొలంలో కట్టేసిన లేగదూడపై హైనా గురువారం దాడి చేసింది.పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు జంతువులపై దాడిచేసి చంపింది. వరుస ఘటనలతో రైతులు, గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.కిష్టాపూర్‌   రైతుల పంటపొలాలు అడవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన నీరటి వెంకటయ్య బుధవారం సాయంకాలం తన పశువులను కట్టేసి వెళ్లిపోయి మరుసటి రోజు వచ్చి చూడగా లేగదూడ మృతి చెంది ఉంది. పరిశీలించి చూడగా లేగదూడను పొట్ట చీల్చి తిన్నట్లు గమనించి ఇది హైనా దాడి చేసినట్లు గుర్తించాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం హైనా ఒక మేకపై దాడిచేసి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్తుంటే స్వయంగా రైతులు హైనాను చూశామని తెలిపారు. రైతుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారి శంకర్‌ లేగదూడ చనిపోయిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

ఇది హైనా దాడేనని అనుమానం వ్యక్తంచేశారు. పశువులపై దాడి చేస్తున్న ఏ జంతువైనా సరే బంధిస్తామని తెలిపారు. అనంతరం రైతులు ఎవ్వరు కూడా పశువులను పొలాల దగ్గర కట్టివేయరాదని స్పష్టం చేశారు. ఏవైనా సంఘటనుల జరిగితే రైతులు భయపడకుండా వెంటనే సమాచారం అందించి అటవీ శాఖకు సమాచారం అందించాలన్నారు.


logo