మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:46:17

చెరువులన్నీ శుద్ధిగా..

చెరువులన్నీ శుద్ధిగా..
  • గుర్రపు డెక్క తొలిగింపుతో సత్ఫలితాలు
  • శుద్ధి ప్రక్రియలో కీలకంగా మారిన
  • ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లు
  • హెచ్‌ఎండీఏ పరిధిలో వేగంగా చెరువుల శుద్ధి ప్రక్షాళన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో చెరువులు అందంగా ముస్తాబు అవుతున్నాయి.గుర్రపుడెక్కతో కళావిహీనంగా మారి న చెరువులను సర్వాంగ సుందరంగా, శుద్ధిగా తీర్చిదిద్దుతున్నారు. శుద్ధి విధానంలో ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ యంత్రాలతో సత్ఫలితాలు వస్తుండడంతో కొత్తగా మరో ఆరు యంత్రాలను దిగుమతికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఐదు ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లు వినియోగంలోకి ఉండగా, ఒకటి హుస్సేన్‌సాగర్‌లో, మరో రెండు పెద్ద మిషన్లు సంస్థ పరిధిలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్నాయి. రెండు చిన్న యంత్రాలు దిగుమతి కావాల్సి ఉంది. ఐతే గడిచిన ఏడాది కాలంగా గుర్రపు డెక్కను తొలిగించేందుకు రెండు యంత్రాలతో నిర్విరామంగా శుద్ధి పనులు కొనసాగిస్తున్నారు.

ఇప్పటి వరకు రాంపల్లి (ఎఫ్‌టీఎల్‌ విస్తీర్ణం 127), కుంట్లూరు (102.173),అన్నారయన్‌చెరువు/నాగారం (32. 700), పీర్జాదీగూడ పెద్ద చెరువు (34.113), మీర్‌పేట మంతరాల (62.51),చందన్‌చెరువు, మంచెర్యాల్‌ తలాబ్‌ చెరువులో గురప్రు డెక్కను తొలిగించి సరికొత్తగా మార్చారు.  నిజాంపేట, పసుమాముల, దుర్గం చెరువులలో శుద్ధిపనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ యంత్రాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ యంత్రాల దిగుమతి చేయాలంటూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ అరవింద్‌కుమార్‌ హెచ్‌ఎండీఏకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా ఆరు ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లు కొనుగోలుకు హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించారు. ఇందులో మూడు పెద్దవి, మరో మూడు చిన్న యంత్రాలను దిగుమతి చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగించనున్నారు. పెద్ద యంత్రానికి రూ. 1.50కోట్లు, చిన్న యంత్రానికి రూ. కోటి మేర ఖర్చు అవుతుండగా, ఈ నిధులను జీహెచ్‌ఎంసీ భరించనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల శుద్ధి ప్రక్రియలో ఈ ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లను జీహెచ్‌ఎంసీ వినియోగించనుంది. 


తేలికగా శుద్ధి విధానం 

   గుర్రపు డెక్కను తొలిగించడంలో ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ (ఎఫ్‌టీసీ) మెరుగైన ఫలితాలను రాబడుతున్నది. గుర్రపు డెక్క చెరువులో పేరుకుపోవడంతో అందాన్ని కోల్పోవడం,ఈ క్రమంలోనే శుద్ధి చేసిన తర్వాత చెరువు ఆహ్లాదకరంగా మారుతున్నది.  ఈ అధునాతన యంత్రంతో  శుద్ధి విధానం తేలికగా మారింది. 12మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు వరకు గుర్రపుడెక్కను ఒకేసారి తొలిగిస్తున్నది. తొలిగించిన చెత్తను వెనువెంటనే ట్రాష్‌ కలెక్టర్‌లోనే స్టోర్‌ చేసుకుని చివరకు ఒడ్డుకు చేర్చుతున్నది.  5టన్నుల వరకు గుర్రపుడెక్కను స్టోర్‌ చేసుకునే సామర్థ్యం ఈ యంత్రానికి ఉంది. అన్నింటి కంటే చెరువు నీటిపై తెడ్డు చక్రాల ద్వారా తేలుతూ ముందుకు సాగుతూ నాలుగు యాంకర్‌ లెగ్స్‌ ద్వారా శుద్ధి ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే వందల టన్నుల కొద్ది గుర్రపు డెక్కను తొలిగించి దాదాపు పది చెరువులను శుద్ధి చేశారు. 


logo