బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Feb 26, 2020 , 23:38:16

సంజీవరావుకు కన్నీటి వీడ్కోలు

సంజీవరావుకు కన్నీటి వీడ్కోలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ/నవాబుపేట    : మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు బుధవారం నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌ నిమ్స్‌లో గుండె పోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివ దేహాన్ని నియోజక వర్గ ప్రజల కడసారి చూపు కోసం మెథడిస్టు చర్చిలో బుధవారం రెండుగంటల పాటు ఉంచారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌లు మెథడిస్ట్‌ చర్చికి చేరుకుని ఆయన పార్థివ దేహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ అట్టడుగు కుటుంబంలో పుట్టి ఉద్యోగం సాధించి మూడు మండలాల్లో ఎంపీడీవోగా సేవలందించి రాజకీయాలపై ఇష్టంతో వచ్చిన వ్యక్తి సంజీవరావని, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా, ధారూరు జడ్పీటీసీగా వికారాబాద్‌ ఎమ్మెల్యేగా రాణించారని కొనియాడారు. ఆయన రాజకీయంలో ఉన్నన్ని రోజులు అందరిని కలుపుకుపోయిన వ్యక్తి అని ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా ఎవరూ తన వద్దకు వచ్చినా మంచిగా పలుకరించిన నేత అని తెలిపారు. మెథడిస్టు చర్చి నుంచి పార్థీవదేహాన్ని ఆయన స్వగ్రామం గేటువనంపల్లికి తరలించే క్రమంలో భాగంగా చర్చి నుంచి ఆలంపల్లి వరకు పెద్ద ఎత్తున అంతిమ యాత్ర నిర్వహించారు. 


నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు.   అంతిమ యాత్రలో  మాజీ ఉప ముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య,  విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్ల పల్లి మంజుల, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హఫీజ్‌, కౌన్సిలర్లు లంకా పుష్పలతారెడ్డి, అర్ధ సుధాకర్‌రెడ్డి, గోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి, ముత్తహర్‌ షరీఫ్‌, దత్తు, బొండల శ్రీనివాస్‌, సుభాన్‌రెడ్డి , పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, వికారాబాద్‌ వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రమేష్‌, దళిత నాయకులు శంకరప్ప, ఆనంద్‌, శివరాజు, అడ్వకేట్‌ అశోక్‌కుమార్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు చిట్టెపు మల్‌రెడ్డి, డెక్క మాణయ్య, స్థానిక సర్పంచ్‌ రత్నం, మాజీ ఎంపీటీసీ సంజీవరావు, మాజీ సర్పంచ్‌ నర్సింహులు హాజరైయ్యారు.


మాజీ ఎమ్మెల్యే సంజీవరావు సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ 

వికారాబాద్‌ టౌన్‌ : బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ దురందరుడు వికారాబాద్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి చెందడం బాధాకరమని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ   అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. సంజీవ్‌రావు మొదటగా ఎంపీడీవోగా వికారాబాద్‌ మండలంలో పని చేశారని, ప్రజా సమసల పరిష్కారానికి నిరంతరం కృషి చేసేవారన్నారు. అలాగే మరింత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పని చేసి ప్రజల మససులో చెరగని ముద్ర వేశారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల, శివారెడ్డిపేట పీఎస్‌సీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాండు, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 


ధారూరు మండల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే  కృషి:  ధారూరు జడ్పీటీసీ సుజాతవేణుగోపాల్‌

ధారూరు : ధారూరు మండల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఎంతో కృషి చేశారని ధారూరు మండల  జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.  బుధవారం మాజీ  ఎమ్మెల్యే సంజీవరావు నివాసం గేటువనంపల్లిలో  మాజీ ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  ఆమె వెంట టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, తరిగోపుల సర్పంచ్‌ విశాలవెంకట్రామ్‌రెడ్డి నివాళులు అర్పించారు.  


logo